News

భారత మాత విగ్రహాన్ని తిరిగి అక్కడే ప్రతిష్ఠించండి : మద్రాసు హైకోర్టు సీరియస్

389views

మద్రాసు హైకోర్టు పోలీసు శాఖకు కీలక ఉత్తర్వులిచ్చింది. గతంలో తమిళనాడులోని విధునగర్ జిల్లాల బీజేపీ కార్యాలయం నుంచి తీసుకెళ్లిన భారత మాత విగ్రహాన్ని తిరిగి బీజేపీ కార్యాలయంలోనే ప్రతిష్ఠించాలని ఆదేశించింది. ఓ ప్రైవేట్ స్థలం నుంచి ఇలా విగ్రహాన్ని తొలగించడం అదో దౌర్జన్యమవుతుందని తేల్చి చెప్పింది. ఒకరి ప్రైవేట్ స్థలానికి వెళ్లి వారి ఆస్తిని తీసుకురావడం హక్కు కాదని, ఇలాంటివి భవిష్యత్తులో పునరావృత్తం కావొద్దని జస్టిస్ ఎన్. ఆనంద్ వెంకటేష్ పోలీసుల్ని హెచ్చరించారు.‘‘ వ్యక్తిగత ఆస్తుల నుంచి భరత మాత విగ్రహాన్ని తొలగించారనడంలో సందేహమే లేదు. బహుశ: ఎవరైనా అలా చేయమని ఒత్తిడి పెట్టి వుండొచ్చు. అదే నిజమైతే అది ఖండించదగిందే’’ అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఇలాంటి ఏకపక్ష చర్యలను ఎప్పటికీ సహించమని హెచ్చరించారు.

అరుప్పుకట్టై ఆర్డీవో శివకుమార్, స్థానిక తహసీల్దార్ భాస్కరన్ నేతృత్వంలోని బృందం ఆగస్టు నెల 7 న ఉదయం బీజేపీ కార్యాలయంలోకి బలవంతంగా చొచ్చుకొని వెళ్లి, అధికారుల అనుమతి లేకుండా భారత మాత ప్రతిష్ఠించారని ఆరోపించారు. కేవలం ఆరోపణలే కాకుండా విగ్రహాన్ని తొలగించారు. దీంతో విరుదునగర్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాండురంగన్ మద్రాసు హైకోర్టుకి వెళ్లారు.

తమ భారత మాత విగ్రహం తమకు తిరిగి ఇచ్చేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు. విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవడం తమ హక్కని, దీనిని అడ్డుకోవడం అధికారులు ఆపేయాలని కోర్టును కోరారు.దీంతో కేసును విచారించిన జస్టిస్ ఎన్. ఆనంద్ వెంకటేష్ ప్రభుత్వ ఆస్తులలో విగ్రహాలను ప్రతిష్ఠించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం కావాలని, కానీ… ఇళ్లు, కార్యాలయాలు, ప్రైవేట్ స్థలాలకు అనుమతులే అవసరం లేదని తేల్చి చెప్పింది.