News

భారత్‌కు ‘శ్వేత హంసలు’

217views

సరిహద్దుల్లో పాకిస్థాన్‌, చైనాతో ఇబ్బందులు ఎదురవుతున్న వేళ.. భారత్‌ తన రక్షణ సామర్థ్యాన్ని పెంచుకునే అద్భుత అవకాశం తలుపుతట్టింది. పొడవైన రెక్కలతో.. భారీ బాంబర్లతో శత్రువులపై విరుచుకుపడే బాంబర్‌ యుద్ధవిమానాలు టీయూ-160ఎం ‘వైట్‌ స్వాన్‌’లను భారత్‌కు ఇచ్చేందుకు రష్యా సంసిద్ధత వ్యక్తం చేసింది. దీన్ని తీసుకోవాలా వద్దా అనే అంశాన్ని భారత్‌ పరిశీలిస్తోంది. పొడవైన రెక్కలు కలిగిన ఈ భారీ యుద్ధవిమానాలను తీసుకుంటే రన్‌వేలను పునరుద్ధరించాల్సి ఉంటుంది. అలాగే పైలట్లు, సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇప్పించాల్సి ఉంటుంది. ఇవి గనుక అందుబాటులోకి వస్తే ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో బలమైన రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నట్టు అవుతుంది.

  • రష్యా వద్ద ఇప్పటికే ఉన్న టీయూ-160 యుద్ధ విమానానికి ఇది అడ్వాన్స్‌డ్‌ వెర్షన్‌.
  • ప్రపంచంలోనే వేగంగా ఎగిరే సూపర్‌ సోనిక్‌ యుద్ధ విమానం, బరువైన పేలోడ్లను మోసుకెళ్లే బాంబర్‌ ఇదేనని రష్యా చెబుతోంది.
  • దీనిలో నలుగురు సిబ్బంది కూర్చోవచ్చు. 12 దీర్ఘశ్రేణి క్షిపణులు లేదా 12 స్వల్పశ్రేణి అణు క్షిపణులను ఇది మోసుకెళ్లగలదు.
  • దీనిలో నాలుగు ఇంజన్లు ఉంటాయి. ఒక్కసారి ఇంధనం నింపితే ఏకబిగిన 12 వేల కిలోమీటర్లు ప్రయాణించగలదు.
  • ఇది 16వేల మీటర్ల ఎత్తులో గంటకు 2,220 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించగలదు.