ArticlesNews

కర్తవ్య ప్రబోధిని..కార్తిక పున్నమి

243views

( నవంబరు 15 – కార్తిక పౌర్ణమి )

కార్తిక మాసంలో వచ్చే పున్నమి పరమ పవిత్రం. అచంచల, స్థిర భక్తి విలువను ప్రబోధిస్తుంది. ఈ పర్వదినాన్ని త్రిపుర పూర్ణిమ, దేవ దీపావళి అని కూడా అంటారు. పురాణ కథనాలను అనుసరించి కార్తికేయుడు తారకాసురుని సంహరించిన రోజే కార్తిక పౌర్ణమి. ప్రజలను నానారకాలుగా హింసిస్తున్న తారకాసురుడు అంతమయ్యాడన్న ఆనందంతో దీపాలు వెలిగించి ముల్లోకాలూ సంబరం చేసుకున్నాయి. వెయ్యేళ్ల రాక్షస పాలన అంతరించిన శుభసందర్భంగా మహాశివుడు ఆనాడు తాండవం చేశాడు.

కార్తిక పౌర్ణమి అటు శివుడికి, ఇటు విష్ణుమూర్తికి కూడా ప్రియమైన రోజు. ఈ రోజున దీపం వెలిగిస్తే తెలిసో తెలియకో చేసిన పాపాలన్నీ హరిస్తాయంటారు. కార్తిక పౌర్ణమి నాడు రుద్రాభిషేకం, సత్యన్నారాయణ వ్రతం చేస్తుంటారు. ఈ పర్వదినాన తెల్లవారు జామున సముద్రంలో లేదా నదిలో స్నానం చేయడం శుభప్రదం. నదిలో స్నానం చేసే అవకాశం లేనివారు ఇంట్లోనే స్నాన జపాలు ముగించి ఆలయానికి వెళ్లి దైవాన్ని దర్శించుకుంటారు.

పరమశివుడి చిత్రమైన ప్రశ్నలు
కార్తిక పౌర్ణమి కథల్లో పాండ్యుడు- కుముద్వతిల కథ విశేషమైంది. ఆ దంపతులు సంతానార్థం పరమశివుని ఆరాధించి ప్రత్యక్షం చేసుకున్నారు. అయితే వారి పూజల్లో చిన్న లోపం వల్ల సరైన వరం ఇవ్వదలచుకోలేదు శివుడు. అందుకే ‘అల్పాయుష్కుడు, అతి మేధావి అయిన కొడుకు కావాలా? పూర్ణాయుష్కురాలు, వితంతువుగా ఉండబోయే కుమార్తె కావాలా?’ అనడిగాడు. పుత్రుడినే కోరుకున్నారా దంపతులు. అతడి వయసు పెరుగుతున్న కొద్దీ ఆ దంపతులకు దిగులు పెరిగింది.

ఆ దుఃఖ సమయంలో శివభక్తి పరాయణురాలైన అలకాపురి రాజకుమార్తె గురించి విన్నారు. ఆమె పిలిస్తే శివుడు పలుకుతాడని అంతటి మహా భక్తురాలని దంపతులు తెలుసుకున్నారు. ఆమెను కోడలిగా చేసుకుంటే తమ బిడ్డను పూర్ణాయుష్కుడిగా మార్చుకోగలుగుతుందని ఆలోచించి అలాగే చేశారు. వివాహమైన కొన్నాళ్లకే భర్తకోసం యమభటులు వచ్చేసరికి విషయం తెలుసుకుందా సాధ్వి. తక్షణమే తన భక్తి ప్రభావంతో శివుణ్ణి ప్రార్థించి ప్రత్యక్షం చేసుకుంది. భర్త పూర్ణాయుష్కుడు అయ్యేలా వరం పొందింది.

త్రిపురాసుర సంహారం
కార్తిక పౌర్ణమికి త్రిపుర పూర్ణిమ అని మరో పేరుంది. తారకాసురుడికి కమలాక్షుడు, విద్యున్మాలి, తారకాక్షుడు అని ముగ్గురు కుమారులు. బ్రహ్మను మెప్పించి ఏ లోకాల్లోనైనా, ఎక్కడికైనా స్వేచ్ఛగా సంచరించగలిగే రాగి, వెండి, బంగారంతో నిర్మించిన మూడు నగరాలు కావాలని, ఎవరివల్లా తమకు మరణం సంభవించ కూడదని వరం కోరారు. అది సాధ్యం కాదన్నాడు బ్రహ్మ. అలాగైతే రథంకాని రథంమీద, విల్లుకాని విల్లుతో, నారికాని నారి సారించి, బాణం కాని బాణం సంధించి, మూడు పురాలూ ఒకే సరళరేఖలోకి వచ్చాక ఒకే బాణంతో ముగ్గురినీ ఏకకాలంలో కొడితేనే తాము మరణించేలా వరమిమ్మన్నారు. అంటే అది సాధ్యం కాదని ఆ సోదరుల భావన. ఇవ్వక తప్పలేదు బ్రహ్మకు. ఆ వర బలంతో బ్రహ్మ ఇచ్చిన విమానాల్లాంటి భారీ పురాలతో సహా సంచారం చేస్తూ లోకాలన్నిటా కల్లోలం సృష్టించసాగారు ఆ సోదరులు.

ఆ బాధ భరించలేక సకల లోకవాసులూ బ్రహ్మకు మొర పెట్టుకున్నారు. వరం ఇచ్చింది తానే కాబట్టి ఏమీ చేయలేనన్నాడు బ్రహ్మదేవుడు. విష్ణువును ఆశ్రయించమని ఉపాయం చెప్పాడు. విష్ణువు కూడా తనకా శక్తిలేదని, వారిని వెంటపెట్టుకుని శివుడి దగ్గరకు వెళ్లాడు. దేవతలందరూ సహకరిస్తే తానీపని చేయగలనన్నాడు శివుడు. ఆ మాటతో భూమి రథం కాని రథంగా మారింది. మేరు పర్వతం విల్లుకాని విల్లుగా, ఆదిశేషుడు నారికాని నారిగా, శ్రీమహావిష్ణువు బాణం కాని బాణంగా మారారు. వీరందరి సమాహార శక్తితో శివుడు త్రిపురాసురులను సంహరించాడు. దైవం కన్నా తామే తెలివి గల వారమన్న ఆ అసురుల వలె ఏ భక్తుడూ భావించకూడదని త్రిపురాసుర సంహారం తెలియజేస్తుంది. ఈ సందేశం అందుకోవటమే త్రిపుర పూర్ణిమ లక్ష్యం.

గంగా మహోత్సవం
పౌర్ణమి నాడు రోజంతా ఉపవాసం ఉండి, సాయంత్రం 365 వత్తుల దీపాన్ని వెలిగించడం సంప్రదాయం. రోజుకు ఒక ఒత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి ఈ ఒత్తులు. కొందరు దీపాలను అరటిదొన్నెపై ఉంచి దగ్గర్లోని నదిలో లేదా కొలనులో వదులుతారు. ఇంకొందరు ఆలయంలో దీపాలు వెలిగిస్తారు. ఆ వీలు లేనివారు ఇంట్లోనే దేవుని ముందు లేదా తులసికోట ఎదుట దీపం వెలిగిస్తారు. కార్తిక పౌర్ణమి జైనులు, సిక్కులు, బౌద్ధులకు కూడా విశిష్ట పర్వదినమే. గురునానక్‌ జయంతి కూడా ఈరోజే. ఈ విశేష పర్వదినాన గంగా మహోత్సవం కూడా నిర్వహిస్తారు.

పౌర్ణమి నాటి దీపాలు
సంప్రదాయాన్ని అనుసరించి కార్తిక పున్నమి నాడు పూజాదికాలు నిర్వహించటం సంగతి అలా ఉంచితే.. ఈ ఆచారాల వెనుక ఆంతర్యాన్ని గమనించాలి. అదే ప్రధాన సందేశం. పూజలు, వ్రతాలు చేసేటప్పుడు సంపూర్ణ భక్తి ఉండాలి. అందులో ఎలాంటి లోపమూ ఉండకూడదు. అందులోనూ ఏదైనా సంకల్పంతో చేసేటప్పుడు పరిపూర్ణ భక్తి ఉండాలి. అలాగే భగవంతుణ్ణి ఏదో ఒకలా ప్రసన్నం చేసుకుందాం, ఆ తర్వాత ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిద్దాం అనే స్వార్థపూరిత భక్తి ధోరణి అసలు పనికిరాదని గుర్తించాలి. ఈ సందేశాన్ని అందిపుచ్చుకోవటం భక్తులందరికీ అవసరం. కార్తిక పురాణంలోని అన్ని కథల్లోనూ పౌర్ణమి నాడు వెలిగించే దీపాలు, చేసే పూజలు, వ్రతాలు ఎంతో పుణ్యం ప్రసాదిస్తాయని తెలియజేస్తున్నాయి.