
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కాలనీ హనుమాన్ దేవాలయంలోని నవగ్రహ విగ్రహాలను ధ్వంసం చేసిన ఘటనపై హిందువులు భారీ నిరసన చేపట్టారు. బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ హిందూ సంస్థలు, స్థానిక ప్రజలు, భక్తులు నిరసనకు దిగారు. శంషాబాద్ బస్టాండ్ నుంచి డీసీపీ కార్యాలయం వరకూ ఈ ర్యాలీ సాగింది. ఇందులో విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్, బీజేపీతో సహా భక్త సంఘాలు, సమాజంలోని అన్ని వర్గాలూ పాల్గొన్నాయి. దేవాలయంపై జరిగిన దాడిని ఖండించారు. దేవాలయ విధ్వంసానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని, అయినా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ మాట్లాడటం లేదని, చర్యలు కూడా శూన్యమని మండిపడ్డారు. దేవాలయాల రక్షణకు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.
అయితే ఈ ర్యాలీని అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నించారు. దీంతో పోలీసులపై నిరసనకారులు తీవ్రంగా మండిపడుతూ… ఎందుకు ఆపాలని ప్రయత్నిస్తున్నారని ప్రశ్నించారు. దీంతో కాస్త ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. దాడి చేసిన వ్యక్తులను వదిలేసి, కేవలం హిందువులనే టార్గెట్ చేస్తున్నారని, తీవ్రమైన అన్యాయం చేస్తున్నారని హిందువులు ఆక్రోషించారు.
ఈ ఘటనపై విశ్వహిందూ పరిషత్ జాతీయ అధికార ప్రతినిధి రావినూతల శశిధర్ తీవ్రంగా స్పందించారు. ఇస్లామిక్ ఛాందసులు హిందూ దేవాలయాలపై టార్గెట్ విధ్వంసాలకు పాల్పడుతున్నారని, దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను నిరోధించడంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. పోలీసులు ఈ ఘటనను పిచ్చోడి చర్యగా కొట్టిపారేసే అవకాశాలున్నాయని అనుమానాలు వ్యక్త చేశారు. ఇస్లామిక్ ఛాందసులపై చర్యలు తీసుకోవాలని గట్టిగా డిమాండ్ చేశారు.
మరోవైపు దాడి జరిగిన స్థలాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పరిశీలించారు. అలాగే ట్విట్టర్ వేదికగా కూడా స్పందించారు. దేవాలయంపై జరిగిన దాడిని ఖండించారు. దేవాలయాలపై పదే పదే దాడులు జరుగుతున్నా… కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మౌనం వహిస్తున్నారని మండిపడ్డారు. ఈ అంశం హిందువులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందన్నారు. ఈ మౌనం ద్వారా కొందరి ప్రయోజనాలను సీఎం రేవంత్ పరిరక్షిస్తున్నారని, దీని వెనుక కుట్ర తమకు అర్థమైందన్నారు. ఈ మౌనం కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలను బహిర్గతం చేసిందన్నారు. సీఎం రేవంత్ నాయకత్వంలో హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని విమర్శించారు. ప్రభుత్వ అలసత్వమే విధ్వంసకారులను ప్రోత్సహిస్తోందన్నారు.
మరోవైపు చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా ధ్వంసమైన దేవాలయాన్ని పరిశీలించారు. ఈ దాడిని ఖండించారు. చాలా దురదృష్టమైన ఘటన అని ట్వీట్ చేశారు. దీనిపై లోతైన విచారణ జరగాలని డిమాండ్ చేశారు. నిందితులను గుర్తించడానికి సీబీఐ లేదా ఎన్ఐతో విచారణ చేయాలని, చట్టపరంగా నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు.
మరోవైపు విశ్వహిందూ పరిషత్ జాతీయ అధికార ప్రతినిధి వినోద్ బన్సల్ కూడా ఈ ఘటనపై స్పందిస్తూ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటనకు, ఈ ఘటనకు సంబంధముందా? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారన్నారు. దేవాలయాలపై దాడులు చేసిన నిందితులను వెంటనే పట్టుకోవాలని రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆదేశిస్తారా? అని సూటిగా ప్రశ్నించారు. ఇకపై ఇలా జరగదని హిందూ సమాజానికి ఏమైనా భరోసా కల్పిస్తారా? అని వినోద్ బన్సల్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని ఏఏ దేవాలయాలపై దాడులు జరిగాయో వివరంగా ట్విట్టర్ లో పేర్కొన్నారు. భూలక్ష్మీ దేవాలయం, శివాజీ నగర్ మాతాజీ దేవాలయం, అంబర్ పేట్ లోని అమ్మవారి దేవాలయం, ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నవరాత్రుల సందర్భంగా దుర్గా అమ్మవారిపై, సికింద్రాబాద్ లోని ముత్యాలమ్మ దేవాలయంపై, తాజాగా శంషాబాద్ లోని హనుమాన్ దేవాలయంపై దాడులు జరిగాయని గుర్తు చేశారు.
ఇటీవల వరుసగా హైదరాబాద్ లో దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి. దీంతో దేవాలయాల భద్రత, తమ భద్రతపై హిందూ సమాజం తీవ్ర ఆందోళన చెందుతోంది. కావాలనే టార్గెట్ చేసి మరీ దాడులు జరుగుతున్నాయని హిందువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మత సంప్రదాయాలను, ఆచారాలను అణగదొక్కడానికే ఈ దాడులు చేస్తున్నారని అన్నారు. ఇలా పదే పదే దేవాలయాలపై దాడులు జరుగుతుండటంపై హిందువులు తీవ్ర ఆగ్రహంగా వున్నారు.
రెండు రోజుల క్రితం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కాలనీలోని హనుమాన్ దేవాలయంపై దుండగులు దాడి చేశారు. నవగ్రహ విగ్రహాలను ధ్వంసం చేశారు. దీంతో తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఉదయమే పూజల నిమిత్తం వచ్చిన భక్తులు చూసి, పోలీసులకు సమాచారం అందించారు. నిందితులను గుర్తించేందుకు సీసీటీవీలను పరిశీలిస్తున్నామని, పోలీసులు ప్రకటించారు.





