
ఛత్ పూజ ప్రత్యేకం
ప్రకృతి ఆరాధన, సాంఘిక, సాంస్కృతిక, శాస్త్రీయ, ప్రాచీన, వైదిక, సంస్కృతి యొక్క ఏకైక సంగమంగా ఛత్ పూజను నిర్వహిస్తారు.సూర్య భగవానుడు, ప్రకృతి, జలం, వాయుఛతీ మాతకు అంకితం ఈ ఛత్ పూజని జరుపుకుంటారు.
సూర్యారాధనకు సంబంధించిన ఈ ప్రత్యేకమైన జానపద పండుగను ముఖ్యంగా బీహార్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్, తూర్పు ఉత్తరప్రదేశ్ మరియు నేపాల్‌లోని వివిధ ప్రాంతాలలో ఎంతో వైభవోపేతంగా జరుపుకుంటారు. ఈ పండుగ క్రమంగా ప్రవాస భారతీయులతో సహా ప్రపంచవ్యాప్తంగా ప్రాచూర్యం పొందింది.
ఛత్ పూజ నాలుగు రోజుల ఉత్సవం. కార్తిక శుక్ల చతుర్థినాడు ప్రారంభమై.. కార్తిక శుక్ల సప్తమి నాడు పరిసమాప్తం అవుతుంది. ఈ కాలంలో, వ్రతం చేసేవారు మంచినీళ్లు సైతం సేవించకుండా 36 గంటల పాటు కఠోర ఉపవాసం పాటిస్తారు. మహిళలతో పాటు పురుషులు కూడా సంప్రదాయ దుస్తులు ధరించి ఈ పండుగలో పాలు పంచుకుంటారు.
కుటుంబ సంతోషం, శ్రేయస్సు మరియు ఆశించిన ఫలితాలను సాధించడం కోసం ఈ పండుగను జరుపుకుంటారు. వేదకాలం నుంచి ఛత్ పూజ సంప్రదాయం కొనసాగుతోందని ప్రతీతి.
సూర్య భగవానుడి ఆరాధన గురించి ఋగ్వేదంలో కూడా ప్రస్తావించబడింది. అంతేకాక, ఉపనిషత్తులు, వేద గ్రంథాలు, ద్వాపర, త్రేతా సత్యయుగంలో కూడా ఈ పండుగను జరుపుకున్నట్లు ఆధారాలు ఉన్నాయి.మహాభారత కాలంలో కూడా ఈ పండుగను జరుపుకునేవారు. త్రేతాయుగంలో కూడా సీతారాములు ఉపవాసం ఉండి సూర్యభగవానుడిని ఆరాధించారు.
వైజ్ఞానిక దృష్టికోణంలో కూడా ఛత్ పూజకు ప్రాముఖ్యత ఉంది. ఈ సమయంలో, సూర్యుని అతినీలలోహిత కిరణాలు భూమి యొక్క ఉపరితలంపైకి చేరుకుంటాయి, ఇవి ఆరోగ్య రీత్యా మేలు చేకూర్చేవి. ఈ పండుగ కేవలం మత విశ్వాసానికి ప్రతీక కాదు. సామాజిక ఐక్యత మరియు కుటుంబ బంధాలను బలోపేతం చేయడానికి కూడా పని చేస్తుంది.
ఛత్ పూజ మతపరమైన, సాంస్కృతిక మరియు కుటుంబ ప్రాముఖ్యత కలిగి భారతీయ సంస్కృతిలో ప్రత్యేక స్థానం కలిగి ఉంది.





