కెనడాలోని హిందూసభ దేవాలయంపై ఖలిస్తానీ మూకల దాడిని హిందూ స్వయంసేవక్ సంఘ్ తీవ్రంగా ఖండించింది. కెనడాలోని హిందూ పౌరుల గురించి, వారి భద్రత గురించి, మానవ హక్కులతో పాటు అక్కడి దేవాలయాల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే దేవాలయాల ఆస్తులపై కూడా ఆందోళన వ్యక్తం చేసింది. చట్టాలను బలంగా అమలు చేసి, దాడి చేసిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందన్న ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ దాడులపై మేధావులు, సమాజాన్ని ప్రభావం చేసే వ్యక్తులు కచ్చితంగా ఆలోచించాలని సంస్థ కోరింది.
సమాజానికి తీవ్రవాదంతో వున్న ముప్పును వెంటనే గుర్తించాలని సూచించింది. శాంతియుత జీవనంతో ముడిపడి వుండే సమాజ నిర్మాణానికి అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చింది. ఆలయాలపై దాడులు చేసిన వారిని వెంటనే గుర్తించి, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. అలాగే రాజకీయ మద్దతు ముసుగులో హిందువులపై దాడులను సమర్థించే వారిని కూడా శిక్షించాలని హిందూ స్వయంసేవక్ సంఘ్ డిమాండ్ చేసింది.
కెనడాలో ఖలిస్తానీలు మరోసారి రెచ్చిపోయారు. బ్రాంప్టన్ లోని హిందూ సభ ఆలయాన్ని లక్ష్యంగా చేసుకొని దాడి చేశారు. దేవాలయంలోకి ప్రవేశించి మరీ అక్కడి భక్తులపై దాడిచేశారు. ఈ సమయంలో చిన్న పిల్లలు కూడా మందిరంలోనే వున్నారు. అయినా ఖలిస్తానీ ఛాందసులు దాడి చేస్తూనే వున్నారు. ఈ దాడి అత్యంత ఘోరంగా జరిగిందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.
కెనడాలోని బ్రాంప్టన్ హిందూ దేవాలయంలోని హిందూ భక్తులపై ఆదివారం ఈ దాడి జరిగింది. దేవాలయం దగ్గర నిరసన వ్యక్తం చేస్తున్న ఖలిస్తానీలు బారికేడ్లను బద్దలు కొట్టి మరీ, ఆలయంలోకి ప్రవేశించారు. అక్కడే వున్న హిందూ భక్తులపై దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతోంది. ఈ దాడి జరగ్గానే భారతీయ సంతతికి చెందిన ఎంపీ చంద్రశేఖర్ ఆర్య తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దాడిని చూస్తుంటే ఛాందసుల మూలాలు కెనడాలో ఎంత బలంగా వున్నాయో అర్థమైపోతుంది.