బ్రాహ్మణ ధర్మంపై, బ్రాహ్మణుల టార్గెట్ గా కొందరు కొన్ని పార్టీలు, కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో చేస్తున్న దాడిని ఖండిస్తూ బ్రాహ్మణులు చెన్నైలో భారీ ర్యాలీ నిర్వహించారు. రాజరథీనమ్ స్టేడియంలో జరిగిన ఈ ర్యాలీకి తమిళనాడులోని అన్ని ప్రాంతాల నుంచి బ్రాహ్మణులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ ర్యాలీకి హిందూ సంఘాలు, బీజేపీ కూడా తమ మద్దతు ప్రకటించాయి. సోషల్ మీడియా వేదికగా తమపై, ధర్మంపై కొందరు విషం కక్కుతున్నారని మండిపడ్డారు.
సివిల్ రైట్స్ (పీసీఆర్) చట్టం లాంటిదే… ద్వేష ప్రచారాన్ని నిరోధించడానికి మరో చట్టం తేవాలని స్టాలిన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ద్రావిడ సిద్ధాంతాన్ని పాటించేవారు, అర్బన్ నక్సలైట్లు, ఛాందసులు పదే పదే బ్రాహ్మణులను, బ్రాహ్మణ ధర్మాన్ని కించ పరుస్తూ, తమపై విష ప్రచారం చేస్తున్నారని వారు మండిపడ్డారు. సమాజంలోని అసమానతలకు, రాజకీయ సంఘటనలకు, సామాజిక సమస్యలకు తామే కారణమన్నట్లు కొందరు చిత్రీకరిస్తున్నారని, అంతా పద్ధతి ప్రకారం, టార్గెట్ గా తమపై దాడి చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి వారికి రాజకీయ ప్రోద్బలం కూడా తోడైందని ఆరోపించారు.
ర్యాలీకి నాయకత్వం వహించిన ఐఎంకే అధ్యక్షుడు అర్జున్ సంపత్ మాట్లాడుతూ… ద్వేషపూరిత ప్రసంగాలు, తప్పుడు కథనాల నుండి బ్రాహ్మణులను రక్షించడానికి కొత్త చట్టం రావాలని డిమాండ్ చేశారు. ఇలాంటి తప్పుడు కథనాల ద్వారా సమాజంలో ద్వేషం పెంచుతున్నారని, శత్రుత్వ భావనను కూడా కొందరు కావాలనే చేస్తున్నారని అన్నారు. వీటి వల్ల సమాజంలో లేనిపోని శత్రుత్వ భావన వస్తుందన్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
బ్రాహ్మణులను రక్షించడం, గోవులను రక్షించడం అనేది ప్రాచీన తమిళుల ప్రధాన కర్తవ్యం, కొన్ని సంవత్సరాలుగా వున్న అంటరానితనంపై కలిసి పోరాడుదాం’’ అని అర్జున్ సంపత్ పిలుపునిచ్చారు. పౌరహక్కుల పరిరక్షణ చట్టం లాగానే తమకు కూడా ఓ చట్టం తేవాలని వారు డిమాండ్ చేశారు. తమిళనాడు రాజకీయాలు మొత్తం బ్రాహ్మణులను కించపరిచే విధంగా, తమ సాంస్కృతిక వారసత్వాన్ని తక్కువ చేసే విధంగా చిత్రకీరిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా పలు డిమాండ్లను ప్రభుత్వం ముందు వుంచారు. పాఠ్య పుస్తకాలలో వున్న ఆర్య ద్రావిడ సిద్ధాంతాన్ని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. అలాగే ఆలయ సంరక్షకులుగా భక్తులను మాత్రమే నియమించాలని, దేవాలయాల వ్యవహారాలపై ప్రభుత్వ జ్యోక్యాన్ని ఆపేయాలని డిమాండ్ చేశారు.