ArticlesNews

దేవాలయాల స్వయంప్రతిపత్తి కోసం విశ్వహిందూపరిషత్ ‘హైందవ శంఖారావం’

105views

కొన్నేళ్ళుగా దేవాలయాలపై జరుగుతున్న దాడులు, ఇటీవల తిరుపతి లడ్డూలో వాడే నెయ్యిలో కల్తీ వంటి వార్తలతో హిందూ సమాజం తీవ్ర ఆందోళనలో ఉంది. హిందూధర్మానికి ఆయువుపట్టులైన దేవాలయాలే కేంద్రంగా విధర్మీయులు చేస్తున్న వ్యూహాత్మక దాడులు, కుట్రలను నిలువరించినప్పుడే అటువంటి అపచారాలకు అడ్డుకట్ట పడుతుంది. ఆ ఉద్దేశంతోనే విశ్వహిందూ పరిషత్ ‘హైందవ శంఖారావం’ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. జనవరి 5 న విజయవాడలో ఈ బహిరంగసభ జరగనుంది.

విదేశీ భావజాల ప్రేరణతో ఏర్పాటైన దేవదాయ ధర్మదాయ శాఖ ఉక్కుసంకెళ్ళలో మన దేవాలయాలు చిక్కుకుని ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. భక్తులు ఆలయాలకు విరాళాలుగా ఇచ్చిన సొమ్ములను ప్రభుత్వాలు దుర్వినియోగం చేస్తున్నాయి. అంత మాత్రమే కాదు, హిందూధర్మంపై దాడులు చేసే అన్యమతాలకు ఆ నిధులను అప్పనంగా దోచిపెడుతున్నాయి. విమతస్తులను, నాస్తికులను దేవాలయాల నిర్వహణలో భాగస్వాములను చేసి హిందువులకు ద్రోహం చేస్తున్నాయి. దాన్ని అడ్డుకోవాలంటే దేవాలయాలకు స్వయంప్రతిపత్తి కలిగించాల్సిందే. అదే ప్రధాన అజెండాగా ‘హైందవ శంఖారావం’ పూరిస్తోంది విశ్వహిందూ పరిషత్.

దేవాలయాలకు స్వయంప్రతిపత్తి కలిగించేలోగా ఆలయాల నిర్వహణలో కొన్ని సంస్కరణలు తీసుకురావాలని విశ్వహిందూ పరిషత్ ప్రతిపాదిస్తోంది. అవి….

1. దేవాలయాల్లో, దేవదాయ ధర్మదాయ శాఖలో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులను తొలగించాలి.

2. దేవాలయాలు అన్నిటా పూజా, ప్రసాద కైంకర్య సేవలన్నీ అత్యంత భక్తిశ్రద్ధలతో, నాణ్యతతో నిర్వహించేలా చూడాలి. దాన్ని ఉల్లంఘించే దోషులను కఠినంగా శిక్షించాలి.

3. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులలో కూడా హిందువులు మాత్రమే ఉండాలి.

4. దేవాలయాల ట్రస్టుబోర్డులలో రాజకీయ పార్టీలతో ప్రమేయం లేని హిందూ దైవభక్తులు మాత్రమే ఉండాలి.

5. దేవాలయాల నిర్వహణపై ధర్మాచార్యులు తయారుచేసిన నమూనా విధివిధానాలను అమలుచేయాలి.

6. దేవాలయాల పరిసరాలలోని దుకాణాలన్నీ హిందువులకు మాత్రమే కేటాయించాలి.

7. దేవాలయాల ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే అన్యాక్రాంతమైన ఆస్తులను వెంటనే స్వాధీనం చేసుకోవాలి.

8. హిందూ సమాజంపై, హిందూ ఆలయాలపై ఉన్మాదంతో కుట్రపూరితంగా దాడులు చేస్తున్న విధర్మీయులు, విద్రోహులను ప్రభుత్వాలు గుర్తించి అత్యంత కఠినంగా శిక్షించాలి.

9. హిందూ దేవాలయాల భూముల్లో అన్యమతస్తులు అక్రమంగా నిర్మించిన కట్టడాలన్నీ వెంటనే తొలగించాలి.

10. దేవాలయాల ఆదాయాన్ని కేవలం ధర్మప్రచారానికి, సేవలకు మాత్రమే ఉపయోగించాలి. ప్రభుత్వ ప్రజాపాలనా కార్యాలకు వినియోగించరాదు.

ఈ సమున్నత లక్ష్యాలతో విశ్వహిందూ పరిషత్, జనవరి 5వ తేదీన విజయవాడలో భారీస్థాయిలో ‘హైందవ శంఖారావం’ బహిరంగ సభ నిర్వహిస్తోంది. మాతృదేశం, మాతృధర్మం పట్ల మక్కువ ఉన్న హిందూ బంధువులు అందరూ పెద్దసంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తోంది.