ArticlesNews

యుగ నారీమణి.. కందుకూరి రాజ్యలక్ష్మి

67views

( నవంబర్‌ 5 – కందుకూరి రాజ్యలక్ష్మి జయంతి )

ఆమె పతి ఓ యుగ పురుషుడు. ఆయన ఆశయాలకు అనుగుణంగా అడుగులు కలిపిన సతీమణి ఆమె. సమాజోద్ధరణ కోసం చారిత్రక వితంతు పునర్వివాహాలకు భర్త నడుం బిగించిన తరుణంలో.. ఎన్నో సామాజిక వ్యతిరేక శక్తులు ఆయనను అడ్డుకునేందుకు యత్నించాయి. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆయన వెన్నంటి నిలిచిన మహా ధీశాలి ఆమె. ఆ మహానుభావుడు కందుకూరి వీరేశలింగం.. ఆయనకు దన్నుగా నిలిచిన వీర నారీమణి కందుకూరి రాజ్యలక్ష్మి. అటువంటి యుగ నారీమణి 173వ జయంతి మంగళవారం జరగనుంది. ఈ సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.

భార్య సహకారం లేకుండా సంస్కరణోద్యమం విజయవంతం కాదని యుగ పురుషుడు కందుకూరి వీరేశలింగం తన స్వీయ చరిత్రలో చెప్పారంటే.. కందుకూరి రాజ్యలక్ష్మి ఎంత త్యాగమూర్తో అవగతమవుతుంది. తూర్పు గోదావరి జిల్లా కంతేరు గ్రామంలో 1851 నవంబర్‌ ఐదున బాపమ్మ జన్మించారు.

భర్త అడుగు జాడల్లో..
వితంతు వివాహాలకు వీరేశలింగం నడుము బిగించినప్పుడు పెద్ద దుమారమే చెలరేగింది. విమర్శలు గుప్పించే వారు కొందరైతే.. భౌతిక దాడులకు తెగబడ్డ వారు మరికొందరు. బంధువులంతా రాజ్యలక్ష్మి చెవిలో పోరేవారు. భర్తను వదిలేస్తానని బెదరించాలని సమీప బంధువులు సలహాలిచ్చేవారు. ‘నా భర్త చేస్తున్నది సరైన పనే అని నాకు పూర్తి నమ్మకం ఉంది’ అని ఆమె బంధువులకు స్పష్టం చేశారు. చివరికి వంట వాళ్లను, వివాహ తంతు జరిపే పురోహితులను రాకుండా ఛాందసవాదులు బెదిరించారు. సమీపంలోని గోదావరి రేపు నుంచి రాజ్యలక్ష్మి స్వయంగా బిందెలతో నీళ్లు తెచ్చి, వంటలు సిద్ధం చేసేవారు. వివాహాలకు సిద్ధమైన వితంతువులను తమ ఇంట్లో, వివాహం ఆయ్యే వరకూ రహస్య పునరావాసం కల్పించారు. అనాథ శిశువులను చేరదీసి, ఆదరించారు.

వితంతువులకు విద్యాబుద్ధులు
భర్త స్థాపించిన వితంతు శరణాలయంలోని వితంతువులకు విద్యాబుద్ధులు నేర్పించేవారు. వారికి పునర్వివాహం జరపినప్పుడు పెళ్లిపీటలపై ఈ దంపతులు కూర్చుని కన్యాదానం చేసేవారు. ఆమె నివసించే ఆనందాశ్రమారామంలో వితంతువుల కోసం ఒక ప్రార్థనా సమాజాన్ని నెలకొల్పారు. ప్రతి రోజూ ప్రార్థనలు జరిపేవారు. సంగీతాన్ని అభ్యసించి, భగవద్భక్తిపరమైన కీర్తనలు రచించారు. ఆమె కీర్తినలు, పాటల పుస్తకాన్ని రచించారని చాలా మందికి తెలియదు.

తుది శ్వాస విడిచే వరకు..
రేపు ఉదయం లేవగానే ప్రేమావతి(ఓ వితంతువు బిడ్డ)ని డాక్టర్‌ వద్దకు తీసుకెళ్లి మందు ఇప్పిస్తాను. 1910 ఆగస్టు 11న రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు రాజ్యలక్ష్మి తన భర్తకు చెప్పిన మాటలివి. ఆమె పూర్తి ఆరోగ్యంగానే ఉండటంతో ఆవే ఆమె చివరి మాటలవుతాయని కందుకూరి వీరేశలింగం ఊహించలేదు. సాధారణంగా తెల్లవారుజామున మూడు గంటల సమయంలో నిద్ర లేచి, బయట తోటలోకి ఆహ్లాదం కోసం వెళ్లడం కందుకూరికి అలవాటు. కిందికి వెడుతున్నారా? దీపం ఉందా? జాగ్రత్తగా వెళ్లండి. అంటూ రాజ్యలక్ష్మి చెప్పడం రివాజు. ఆ మాటలు ఆ రోజున కందుకూరికి వినపడలేదు. తిరిగి వచ్చిన వీరేశలింగం ఆమెను నిద్రపోతున్నావా? అని అడిగారు. సమాధానం లేదు. కాసేపు ఆయన మంచంపై పడుకుని, తిరిగి ఐదు గంటలకు లేచి, ఇంకా మెలకువ రాలేదా? అని ఆమెను తట్టారు. ఆమె శరీరం చల్లగా తగిలింది. ఆమెను పరిశీలించిన వైద్యుడు.. ఆమె మరణించిందని చెప్పాడు. భర్త సంస్కరణోద్యమానికి చివరి వరకు చేదోడుగా నిలిచిన రాజ్యలక్ష్మి సుమంగళిగా కన్నుమూశారు.