ArticlesNews

వనభోజనం ఎలా మొదలైందంటే..

57views

కార్తికపురాణాన్ని అనుసరించి మొట్టమొదటిగా నైమిశారణ్యంలో మునులందరూ వనభోజనాలు చేశారు. నాటి నుంచి ఈ వేడుక కొనసాగుతోంది. శ్రీకృష్ణ బలరాములు గోప బాలురతో కలిసి వనభోజనాలు చేశారని భాగవతంలో ఉంది. ఉసిరి, వేప, రావి మర్రి, మద్ది మొదలైనవి దేవతా స్వరూపాలు. ఏ చెట్టు నీడలో భుజించినా ఆరోగ్య ఫలం దక్కుతుంది. ఉసిరిచెట్టు మరింత మంచిది. ప్రకృతితో మన బాంధవ్యాన్ని పెంపొందించేదే వనభోజనం. మనం ప్రకృతిని సమగ్రంగా కాపాడుకుంటే- ఆ ప్రకృతి మనని సర్వదా కాపాడుతుందన్నది ఆంతర్యం.

ఉసిరిచెట్టు నీడలో..
ఉసిరి చెట్టును విష్ణుమూర్తిగా వర్ణిస్తారు. సంస్కృతంలో ధాత్రి అంటారు. ముందుగా ఉసిరిచెట్టు నీడలో విష్ణువును పూజించి, పదార్థాలను నివేదించి- ఆ తర్వాత భుజించాలి. అలా చేస్తే సమస్త పాపాలూ నశిస్తాయి, అశ్వమేధ యాగం చేసిన ఫలం దక్కుతుంది- అన్నది పురాణవచనం. ఉసిరిచెట్టు ఎందుకు విశేషమైందంటే.. ఈ చెట్టు మూలంలో శ్రీహరి, కాండంలో రుద్రుడు, ఊర్ధ్వంలో బ్రహ్మదేవుడు, కొమ్మల్లో సూర్యభగవానుడు, రెమ్మల్లో దేవతలు కొలువై ఉంటారు. అంతేకాదు.. లక్ష్మీదేవి, భూదేవి, విష్ణుమూర్తి కలిసిన రూపం ఉసిరి. దీన్ని పూజిస్తే సకల దేవుళ్లనూ పూజించినట్లే. ఈ చెట్టు నీడలో భుజిస్తే- ఆ పదార్థాలు అమృతప్రాయమై దైవానుగ్రహం లభిస్తుంది. ఉసిరిచెట్టులో ఔషధ గుణాలెన్నో ఉన్నాయి. ఉసిరికాయలు, ఆకులు తింటే శరీరానికి కాంతివస్తుంది. శ్వాసకోశ వ్యాధులు, చర్మరోగాలు, జ్వరాలు తగ్గుతాయి. ఉసిరిగాలి రోగనిరోధకశక్తిని పెంచుతుంది, కీటకాలను నశింపచేస్తుంది.