News

‘యురేనియం తవ్వకాలను చేపట్టనీయం’

50views

యురేనియం తవ్వకాలను ఎట్టి పరిస్థితుల్లో చేపట్టనిచ్చేది లేదని నంద్యాల జిల్లాలోని కప్పట్రాళ్ల, పి.కోటకొండ, బేతపల్లి, చెల్లెలచెలిమల, దిబ్బనగుర్తి, నెల్లిబండ, జిల్లెడబుడకల, మాదాపురం, కె.వెంకటాపురం తదితర గ్రామాల ప్రజలు ముక్త కంఠంతో నినదించారు. శుక్రవారంకప్పట్రాళ్ల రిజర్వు ఫారెస్టులోని కౌలుట్ల చెన్నకేశవస్వామి ఆలయ ఆవరణలో ఆయా గ్రామాల ప్రజలు సమావేశమయ్యారు. యురేనియం తవ్వకాలను అడ్డుకునేందుకు చేపట్టాల్సిన కార్యాచరణ, కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాల మీద ప్రజాప్రతినిధులు ఒత్తిడి తెచ్చేలా చేయాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. దాదాపు 3 వేల మందికి పైగా ప్రజలు సమావేశమయ్యారు. తమ గ్రామాలను కాపాడుకోవడమే ప్రధాన లక్ష్యంగా పోరాడతామన్నారు. ఒకప్పుడు ఫ్యాక్షన్‌కు నిలయంగా ఉన్న కప్పట్రాళ్ల, దాని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు నేడు అన్నీ వదిలి సుఖంగా జీవిస్తున్నామన్నారు. ఇక్కడ యురేనియం తవ్వకాలు చేపడితే తాము వివిధ రకాలైన సమస్యలను ఎదుర్కొంటామని, ఇలాంటి తవ్వకాలు చేపట్టరాదన్నారు.