News

అహింసే పరమ ధర్మం.. కానీ ధర్మరక్షణ కోసం బలప్రయోగం సమర్థనీయం

166views

ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ దేశ భద్రత, అహింస, ధర్మరక్షణపై కీలక వ్యాఖ్యలు చేశారు. అహింసా మానవాళికి పరమ ధర్మమని చెబుతూనే, దేశానికి లేదా సమాజానికి ఎవరైనా ముప్పుగా మారితే అలాంటి పరిస్థితుల్లో అహింసతో సమస్యలు పరిష్కారం కావని అన్నారు. దేశరక్షణ కోసం అవసరమైతే బలప్రయోగం, ధర్మ హింస ముఖ్యమే అని స్పష్టం చేశారు.

లక్నోలో నౌసేన శౌర్య వాటిక ప్రారంభోత్సవ కార్యక్రమంలో యోగి ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘అహింసా పరమో ధర్మః.. ధర్మ హింస తథైవ చ’’ అనే సూక్తిని ప్రస్తావిస్తూ.. అహింస అత్యున్నత ధర్మమే అయినప్పటికీ ధర్మాన్ని, దేశాన్ని కాపాడే సందర్భంలో హింస కూడా ధర్మమే అని ఆయన అన్నారు. దేశం బలంగా ఉంటేనే ప్రపంచం గౌరవిస్తుందని, భద్రతాపరంగా శక్తివంతమైన దేశాలతోనే ఇతర దేశాలు స్నేహం చేయాలని కోరుకుంటాయని ఆయన అన్నారు. బలహీనుల్ని ప్రపంచం ఎప్పుడూ గౌరవించదని చెప్పారు. భారత సాయుధ దళాలు దేశ శత్రువుల్ని ఎదుర్కొనే తీరులో ఈ సూత్రం స్పష్టంగా కనిపిస్తుందని చెప్పారు.