ArticlesNews

సర్వపాపహరం.. పుష్కర స్నానం

4views

( జూన్‌ 2న యమునా నది పుష్కరాలు ప్రారంభం )

పుష్కర సమయంలో ముక్కోటి దేవతలు, మూడున్నర కోట్ల తీర్థాలు ఆ నదిలోకి వచ్చి చేరతాయంటారు. సనాతన ధర్మంలో నీరంటేనే నారాయణ స్వరూపం. అలాంటి పవిత్రజలంతో స్నానమాచరించి పుణ్యాత్ములు కావటానికి పుష్కర సమయం అత్యుత్తమం. అందుకే పుష్కర స్నానం పుష్కల పుణ్యప్రదం.

భారతావనిలోని 12 ప్రధాన నదులకు పన్నెండేళ్లకు ఒకసారి పుష్కరాలొస్తుంటాయి. జ్యోతిషశాస్త్రం ప్రకారం గురుగ్రహ సంచారం ఆధారంగా పుష్కర కాలాలను నిర్ణయిస్తారు. గురుగ్రహం కర్కాటక రాశిలోకి ప్రవేశించిన సంవత్సరంలోని మొదటి 12 రోజుల పాటు యమునానదికి ఆది పుష్కర కాలం. సంవత్సరం ముగియటానికి ముందు ఉండే చివరి పన్నెండు రోజులు అంత్య పుష్కరకాలం. ఈ కాలం ఎంతో పవిత్రమైనది.

పూర్వం ధర్మబద్ధమైన జీవితం గడుపుతున్న తుందిలుడు ఈశ్వరుని గురించి తపస్సు చేశాడు. ప్రసన్నుడైన శివుడు- ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడతడు ఈశ్వరునిలో తనకు శాశ్వత స్థానం కావాలన్నాడు. ‘తథాస్తు’ అన్న శివుడు తన అష్టమూర్తుల్లో ఒకటైన జలంలో తుందిలునికి శాశ్వత స్థానం ఇచ్చాడు. దాంతో మూడున్నర కోట్ల పుణ్యతీర్థాలకు అధికారి అయ్యాడు. ఇలా సకల జీవరాశిని పోషించగలిగే శక్తి లభించింది. పోషించే శక్తిని సంస్కృతంలో పుష్కరం అంటారు. అలా తుందిలుడు పుష్కరుడయ్యాడు. అనంతరకాలంలో బ్రహ్మదేవునికి సృష్టి చేయాల్సిన సమయం వచ్చింది. అందుకవసరమైన జలం కోసం తపస్సు చేశాడు. ఈశ్వరుడు ప్రత్యక్షమై బ్రహ్మ కోరిక మేరకు జల సామ్రాజ్యానికి చక్రవర్తి అయిన పుష్కరుణ్ణి బ్రహ్మకు ఇచ్చాడు. అతణ్ణి బ్రహ్మ తన కమండలంలో ప్రవేశపెట్టాడు. సృష్టికార్యం పూర్తయ్యింది. తర్వాత ప్రాణులను బతికించే ధర్మం నెరవేర్చడం బృహస్పతి వంతు. అందుకు జలం కావాలని బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించాడు. ఆ కోరికను బ్రహ్మ మన్నించాడు కానీ పుష్కరుడు తాను బ్రహ్మదేవుని వదిలి వెళ్లలేనన్నాడు. లోకకల్యాణం కోసం వెళ్లక తప్పదని నచ్చజెప్పారు. అప్పుడు బృహస్పతి, బ్రహ్మ, పుష్కరుడు కలిసి ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం బృహస్పతి- ఆయా రాశుల్లో ప్రవేశించేటప్పుడు పన్నెండు రోజులపాటు పుష్కరుడితో కలిసుంటాడు. ఇక మిగిలిన సంవత్సర కాలమంతా మధ్యాహ్న వేళల్లో రెండు ముహూర్తాల సమయం కూడా కలిసుంటాడు. అలా వారిద్దరూ కలిసున్న నదికి సమస్త దేవతలు రావాలన్నదే వారి ఒప్పందం. అందుకే పుష్కరకాలంలో నదీస్నానం పుణ్యప్రదం.

మోక్షం ప్రాప్తిస్తుంది..
నీళ్లకు దాహార్తిని తీర్చడం, శుభ్రపరచటం అనే రెండు శక్తులున్నాయి. పుష్కర స్నానం చేసి మూడుసార్లు మునక వేస్తే తెలిసీ తెలియక చేసిన పాపాలు నశిస్తాయని, అలాగే నీటిని సంప్రోక్షణ చేయడం వల్ల ద్రవ్య శుద్ధి జరుగుతుందని పురాణాలు పేర్కొన్నాయి. అలాగే పుష్కర స్నానం చేసిన వారికి అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం లభిస్తుందని, మోక్షం ప్రాప్తిస్తుందని ధర్మశాస్త్రాలు తెలియజేశాయి.
నదికి వాయనాలు

సుమంగళిగా జీవితాంతం ఉండాలని కోరుకుంటూ ఆడపడుచులు పుష్కరాల సందర్భంగా నదీమతల్లికి వాయనాలు సమర్పిస్తారు. ఇలా చేస్తే విఘ్నాలు దూరమై అన్నీ శుభాలే కలుగుతాయని విశ్వసిస్తారు. చీర, రవికె, గాజులు, కుంకుమ, పసుపు, పుస్తె, మట్టెలను పూజించి.. నదిలోకి జారవిడుస్తారు. పుష్కర సమయంలో దంపతులకు, ముత్తైదువలకు వాయనాలిచ్చి ఆశీస్సులు తీసుకుంటారు.

శ్రీకృష్ణుడి అనుగ్రహం
కృష్ణపరమాత్ముని ప్రియసఖి యమున. అందుకే యమునానదిలో పుష్కర విధులను నిర్వర్తించటం వల్ల శ్రీకృష్ణుడి అనుగ్రహం కలుగుతుందంటారు పండితులు. పురాణాల ప్రకారం యమునానది సూర్యభగవానుడి పుత్రిక, యమధర్మరాజుకు చెల్లెలు. ఆమెకి కాళింది అనే పేరు కూడా ఉంది. కృష్ణుడి అష్ట భార్యల్లో కాళింది ఒకామె. కళింద పర్వతం నుంచి ఉద్భవించడం వల్ల ఆ పేరొచ్చింది. నదీరూపంలో ఉన్నప్పుడు యమున, కాళింది పేర్లతోనూ, శరీరంతో ఉన్నప్పుడు శ్రీకృష్ణుని భార్యగా ఆరాధించటం సంప్రదాయం. ఆమె కృష్ణుణ్ణి భర్తగా పొందాలని తపస్సు చేసింది. ఆ భక్తికి మెచ్చిన కృష్ణుడు ఆమెను వివాహం చేసుకున్నాడు. పురాణేతిహాసాలు, ఆధ్యాత్మిక గ్రంథాల్లో యమునానదిని ప్రస్తావించేటప్పుడు కాళింది పేరును ఎక్కువగా ఉపయోగించటం కనిపిస్తుంది.

వరదాయిని.. ఆనందరూపిణి
పురాణాల్లో యమునను అత్యంత సౌందర్యవతిగా వర్ణించారు. యమునానది నీరు ముదురు నీలం రంగులో ఉంటుందని శ్యామల అని కూడా పిలుస్తారు. ఆమె నిత్య యవ్వనవతిగా, ప్రసన్నవదనంతో, కరుణ కురిపించే కళ్లతో కనిపిస్తుంది. యమునా దేవి సాధారణంగా నీలి రంగు పట్టు వస్త్రాలను ధరించి, కిరీటం, హారాలు, ఒడ్డాణం తదితర ఆభరణాలతో కళకళలాడుతూ దివ్యకాంతితో భాసిస్తుంది. ఆ దేవి వాహనం కూర్మం. తాబేలు స్థిరత్వానికి, ఇంద్రియ నిగ్రహానికి చిహ్నం. ఆ లక్షణాలన్నీ ఈ దేవతలో ఉన్నాయన్నది ఆమె వాహనమైన కూర్మం ఇచ్చే సందేశం. ఆ అమ్మ నాలుగు చేతులతో అలరారుతుంటుంది. ఒక చేతిలోని పూర్ణకుంభం (నీటితో నిండిన కలశం) సమృద్ధికి, మరో చేతిలోని పద్మం పవిత్రతకు చిహ్నం. కృష్ణుడితో చెలిమివల్ల భక్తిదాయకం. యమధర్మరాజు సోదరి కావడాన యమునా నదిలో స్నానం చేస్తే యమ భయం ఉండదు, మోక్షం లభిస్తుంది- అని విశ్వసిస్తారు.