News

భారతీయుల భద్రతపై ఆందోళన : కెనడాలో ఆలయ దాడి ఘటనపై కేంద్రం

223views

కెనడాలో మరోసారి రెచ్చిపోయిన ఖలిస్థానీలు.. అక్కడి బ్రాంప్టన్‌లోని హిందూ ఆలయాన్ని లక్ష్యంగా చేసుకొని భక్తులపై దాడులు చేశారు. దీనిపై భారత ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్‌ మాట్లాడారు.

‘‘ఉగ్రవాదులు, వేర్పాటువాదుల హింసాత్మక చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ తరహా దాడుల నుంచి అన్ని ప్రార్థనాస్థలాలను సంరక్షించాలని మేం కెనడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. హింసకు కారకులైన వారిని శిక్షిస్తారని మేం ఆశిస్తున్నాం. కెనడాలో మా దేశీయుల భద్రత గురించి భారత ప్రభుత్వం తీవ్ర ఆందోళన చెందుతోంది. భారతీయులకు కాన్సులర్ సేవలు అందించే దౌత్యవేత్తలు ఈ తరహా బెదిరింపులకు తలొగ్గరు’’ అని జైస్వాల్‌ అన్నారు.

బ్రాంప్టన్‌లోని ఆలయ కాంప్లెక్స్‌లో కొందరు ఖలిస్థానీలు భక్తులపై దాడులు చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. ఈనేపథ్యంలో ఆలయం వద్ద భారీగా భద్రతా దళాలను మోహరించారు. దీనిని ఆ దేశ ప్రధాని జస్టిన్‌ ట్రూడో తీవ్రంగా పరిగణించారు. అక్కడి ప్రజలు అన్ని మతాలను పాటించే హక్కును కాపాడతామని పేర్కొన్నారు. మరోవైపు కెనడా ఎంపీ చంద్ర ఆర్య స్పందిస్తూ కెనడాలో ఎంత తీవ్రస్థాయిలో హింసాత్మక తీవ్రవాదం పెరిగిపోయిందో ఈ ఘటన చెబుతోందన్నారు. కెనడా హిందువులు ముందుకొచ్చి తమ హక్కులను కాపాడుకోవాలన్నారు.

బ్రాంప్టన్‌లోని హిందూ ఆలయం వెలుపల నిర్వహిస్తోన్న కాన్సులర్ క్యాంప్‌పై ఖలిస్థానీ మద్దతుదారులు దాడి చేయడం తీవ్ర నిరాశపరిచిందని ఒట్టావాలోని ఇండియన్ హై కమిషన్ వ్యాఖ్యానించింది. ‘‘భారత వ్యతిరేక శక్తుల దాడితో మా క్యాంపు కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. ఇలాంటి చర్యలు తీవ్ర నిరాశకు గురిచేశాయి’’ అని పేర్కొంది. గత కొన్ని నెలలుగా కెనడాలోని ఆలయాలపై వరుసగా దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. అక్కడి ఆలయ గోడలపై భారత వ్యతిరేక నినాదాలను రాసిన ఘటనలు చోటుచేసుకున్నాయి.