
కెనడాలోని ఖలిస్థానీలు మరోసారి రెచ్చిపోయారు. ఈసారి వారు అక్కడి బ్రాంప్టన్‌లోని హిందూ ఆలయాన్ని లక్ష్యంగా చేసుకొని.. భక్తులపై దాడులు చేశారు. దీనిని ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్రంగా పరిగణించారు. అక్కడి ప్రజలు అన్ని మతాలను పాటించే హక్కును కాపాడతామని పేర్కొన్నారు. ఈ దాడులు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. ఈనేపథ్యంలో బ్రాంప్టన్‌లోని ఆలయం వద్ద భారీగా భద్రతా దళాలను మోహరించారు.
ఆలయ కాంప్లెక్స్‌లో కొందరు ఖలిస్థానీలు భక్తులపై దాడులు చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. దీనిపై పీల్ రీజనల్ పోలీస్ విభాగం ప్రతినిధి మాట్లాడుతూ తాము ఎవరినీ అరెస్టు చేయలేదన్నారు. ఘర్షణలకు కారణాలు చెప్పలేకపోయారు. ఈ దాడులపై కెనడా ప్రతిపక్ష కన్జర్వేటీవ్ పార్టీ నేత పియర్రె పొయిలీవ్రే స్పందిస్తూ.. ప్రతిఒక్కరికి వారి మతవిశ్వాసాలను పాటించే స్వేచ్ఛ ఉందన్నారు. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ గందరగోళ పరిస్థితులకు ముగింపు పలుకుతానని పేర్కొన్నారు.
మరోవైపు కెనడా ఎంపీ చంద్ర ఆర్య స్పందిస్తూ కెనడాలో ఎంత తీవ్రస్థాయిలో హింసాత్మక తీవ్రవాదం పెరిగిపోయిందో ఈ ఘటన చెబుతోందన్నారు. కెనడా హిందువులు ముందుకొచ్చి తమ హక్కులను కాపాడుకోవాలన్నారు. కెనడాలో తీవ్రవాద శక్తులు రాజకీయాల్లోకి, లా ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాల్లోకి కూడా చొరబడ్డాయని ఆయన ఆరోపించారు.
ఎంపీ కెవిన్ వూంగ్ స్పందిస్తూ కెనడా తీవ్రవాదులకు సురక్షిత ప్రదేశంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈమేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘‘హిందువులు, క్రిస్టియన్లు, యూధులను కెనడాను రక్షించడంలో మన నాయకులు విఫలమయ్యారు’’ అని పేర్కొన్నారు.
ఈ దాడులకు తెగబడిన వారిపై తీవ్రస్థాయిలో చర్యలు తీసుకొంటామని బ్రాంప్టన్ మేయర్ పాట్రిక్ బ్రౌన్ హామీ ఇచ్చారు. మత స్వేచ్ఛ అనేది కెనడా మౌలిక విలువలకు చిహ్నమని పేర్కొన్నారు. ప్రతిఒక్కరూ వారి ప్రార్థన మందిరాల వద్ద సురక్షితంగా ఉండాలన్నారు. ఒంటారియో సిఖ్స్ అండ్ గురుద్వారా కౌన్సిల్ కూడా ఈ హింసను ఖండిస్తూ ప్రకటన జారీ చేసింది. హింసకు తమ మతంలో స్థానంలో లేదని పేర్కొంది. ఈ ఘటనపై స్థానిక అధికారులు దర్యాప్తు చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరింది.
గత కొన్ని నెలలుగా కెనడాలోని ఆలయాలపై వరుసగా దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. గతేడాది విండ్‌సోర్‌లోని ఆలయ గోడలపై భారత వ్యతిరేక నినాదాలను రాశారు.





