
బంగ్లాదేశ్ హిందువులపై ఇస్లామిక్ ఛాందసులు చేసిన మారణ హోమాన్ని ఖండిస్తున్నట్లు అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడంపై విశ్వహిందూ పరిషత్ స్పందించింది. మారణ హోమాన్ని ఖండించినందుకు వీహెచ్ పీ జాతీయ అధికార ప్రతినిధి వినోద్ బన్సల్ ప్రశంసించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. హిందువు పక్షాన మాట్లాడినందుకు ధన్యవాదాలు ప్రకటించారు.నిరసన పేరుతో ఇస్లామిక్ ఛాందసులు ప్రధానిని ఇబ్బందిపెట్టారని, ఇప్పుడు ఏకంగా రాష్ట్రపతిని కూడా లక్ష్యంగా చేసుకుంటూ ఆందోళనలు చేస్తున్నారని అన్నారు.
బంగ్లాలో హిందువులు, మైనారిటీలపై అంత స్థాయిలో హింస జరిగినా మానవ హక్కుల కార్యకర్తలు అని అనిపించుకునేవారు ఎందుకు మౌనంగా వున్నారని, అంతర్జాతీయ మానవ హక్కుల ప్రతినిధులు ఏమయ్యారని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. బంగ్లాదేశ్, పాక్, ఆఫ్గనిస్తాన్ వంటి దేశాలు జిహాదీ శక్తులచే పీడింపబడుతున్నాయని, ఆ దేశాల్లో హింసకు కూడా పాల్పడుతున్నారని అన్నారు. వారి అణచివేతను తిరస్కరిస్తూ.. పోరాడుతున్నవారు ఒక్క హిందువులేనని పేర్కొన్నారు. కానీ బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న అకృత్యాలను ఖండించిన ఏకైక పాశ్చాత్య నేత బహుశ: ట్రంపేనని బన్సల్ అన్నారు.





