News

పాకిస్థాన్‌ది గురివింద ధోరణి.. ఐరాసలో దునుమాడిన భారత్‌

237views

మారుతున్న ప్రపంచంలో శాంతి పరిరక్షణలో మహిళల పాత్ర అనే అంశంపై ఐరాస భద్రతా మండలి చర్చిస్తుండగా పాకిస్థాన్‌ దుష్టతలంపుతో కశ్మీర్‌ సమస్యను లేవనెత్తడంపై భారత్‌ మండిపడింది. పాక్‌లో ఏటా హిందూ, క్రైస్తవ, సిక్కు వర్గాలకు చెందిన 1,000 మంది మహిళల అపహరణ, నిర్బంధ మతమార్పిళ్లు, వివాహాలు జరుగుతున్నాయని భద్రతా మండలిలో భారత్‌ శాశ్వత రాయబారి పి.హరీశ్‌ తెలిపారు. పాక్‌ గురివిందలా తన దుశ్చేష్టలను కప్పిపెట్టుకుని భారత్‌పై దుష్ప్రచారానికి పాల్పడుతూనే ఉంటుందన్నారు. భారత్‌ మహిళాభ్యుదయం, శాంతి సుస్థిరతలకు కట్టుబడి ఉందని ప్రకటించారు. 2007లో మొట్టమొదటిసారి ఐక్యరాజ్యసమితి తరఫున శాంతిభద్రతల నిర్వహణకు పూర్తిగా మహిళలతో ఏర్పాటుచేసిన పోలీసు బృందాన్ని లైబీరియా దేశానికి భారత్‌ పంపిందని హరీశ్‌ గుర్తుచేశారు. లింగ దుర్విచక్షణను రూపుమాపడానికి డిజిటల్‌ సాంకేతికతలు తోడ్పడతాయన్నారు.