
అన్నవరం సత్యదేవుని జన్మనక్షత్రం ‘మఖ’ సందర్భంగా ఈ నెల 27వ తేదీన సత్యదీక్షలు చేపట్టే వనవాసీ భక్తులకు మంగళవారం 600 జతల దీక్షా వస్త్రాలు పంపిణీ చేశారు. ఏటా కార్తీకమాసం ముందు వచ్చే స్వామివారి జన్మనక్షత్రం ‘ మఖ ’ నాడు దీక్ష ప్రారంభమై 27 రోజుల తరువాత వచ్చే ‘ మఖ ’ నక్షత్రం నాడు దీక్ష విరమించడం ఆనవాయితీగా వస్తోంది. దానిని అనుసరించి నవంబర్ 23న దీక్ష ముగియనుంది. కాగా, ఎక్కువ మంది భక్తులు సత్య దీక్ష చేపట్టేందుకు గాను అన్నవరం చుట్టుప్రక్కల గ్రామాలలో విస్తృత ప్రచారం చేయాలని అధికారులు నిర్ణయించారు. 27 రోజుల దీక్ష కుదరని వారికి, మహిళల కోసం 18 రోజులు, తొమ్మిది రోజుల దీక్ష కూడా చేసే వీలుంది. సత్య దీక్షలు చేపట్టనున్న మారేడుమిల్లి, అడ్డతీగల, తదితర వనవాసీ ప్రాంతాల్లో 600 మందికి దీక్షా వస్త్రాలు, మాలలను అందజేసినట్టు దేవస్థానం రిసెప్షన్ సూపరింటెండెంట్ బలువు సత్యశ్రీనివాస్ తెలిపారు. అడ్డతీగల మండలం పవనగిరి స్వామీజీ సమక్షంలో పంపిణీ చేశామన్నారు.





