
311views
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బహ్‌రాయిచ్‌లో దుర్గా దేవి విగ్రహం నిమజ్జనం సందర్భంగా రెండు వర్గాల మధ్య చెలరేగిన గొడవలు సోమవారం మరింత భగ్గుమన్నాయి. ఆదివారం 22 ఏళ్ల యువకుడు మృతి చెందడంతో ఆగ్రహించిన పలువురు కర్రలు, ఇనుప రాడ్లతో వీధుల వెంట తిరుగుతూ పలు దుకాణాలకు నిప్పు పెట్టారు. మన్సూర్ గ్రామం మహరాజ్‌గంజ్‌లో ఆదివారం దుర్గా మాత విగ్రహ ఊరేగింపు సాగుతుండగా ఆ సమూహంపై మరోవర్గానికి చెందిన కొందరు వ్యక్తులు రాళ్లు రువ్వడంతోపాటు తుపాకీతో కాల్పులు జరిపారు. దీంతో సుమారు అరడజను మంది గాయపడ్డారు. తూటా గాయంతో గోపాల్ మిశ్ర అనే వ్యక్తి మరణించారు. ఆగ్రహించిన జనం ఆందోళనకు దిగి నిందితుడిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. పోలీసులు ప్రధాన నిందితుడిని అరెస్టు చేయడంతోపాటు 30 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.





