
ఒకప్పుడు గ్రామదేవత. ఇప్పుడామె ప్రజలందరి దేవత.విజయనగరం పైడితల్లి కీర్తి ఎల్లలుదాటింది. పసిడితల్లి కరుణా కటాక్షాల కోసం ఎక్కడెక్కడి నుంచో సిరిమాను పండగ నాటికి విజయనగరం చేరుకుంటారు. సిరిమాను రథం ఊరేగింపు ప్రారంభమయ్యేసరికి మూడులాంతర్లు, రాజా బజారు, కోట కూడలికి చేరుకుంటారు. పూజారి రూపంలో అమ్మవారిని దర్శించుకుని తరిస్తారు. సిరిమానోత్సవం విజయవంతమయ్యేందుకు అధికార యంత్రాంగం పెద్దఎత్తున ఏర్పాట్లు చేసింది. మధ్యాహ్నం 3 గంటల ఐదు నిమిషాలకు ప్రారంభమయ్యే సిరిమానోత్సవంలో ప్రధాన పూజారి బంటుపల్లి వెంకటరావు ఎనిమిదో సారి సిరిమానును అధిరోహించనున్నారు. సుమారు ఐదు లక్షలకిపైగా భక్తులు తరలివస్తారని అధికారుల అంచనా.
● అత్యంత నియమనిష్టలతో…
అత్యంత నియమనిష్టలతో, ఉపవాసంతో ఉండే సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు హుకుంపేటలో మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరుతారు. దారిపొడువునా భక్తులు పూజారి పాదాలపై పసుపునీళ్లు పోసి దీవెనలు అందుకుంటారు. చంటిపిల్లలపై నుంచి పూజారి దాటితే వారికి మేలు జరుగుతుందన్న నమ్మకంతో చాలా మంది ఆయనొచ్చే దారిలో వారిని నేలపై ఉంచుతారు. పూజారి ఆలయానికి చేరుకున్నాక సిరిమానోత్సవం ప్రారంభమవుతుంది. 260 ఏళ్ల చరిత్ర గల సిరిమాను చదురుగుడి నుంచి మహారాజా కోట వరకు మూడు పర్యాయాలు తిరిగి భక్తులను ఆశీర్వదించనుంది. సిరిమాను ముందుండే బెస్తవారి వల, పాలధార, తెల్ల ఏనుగు, అంజలి రథాలు ఆకర్షణగా నిలుస్తాయి.
● బెస్తవారి వల
రెండున్నర శతాబ్దాలకు మునుపు పైడితల్లి పెద్దచెరువులో నిక్షిప్తమైనప్పుడు పతివాడ అప్పలనాయుడు కలలో అమ్మవారు చెప్పిన సమాచారం మేరకు పైడితల్లి మూల విరాట్‌ను చెరువు నుంచి వెలికి తీయడంలో విజయనగరం యాతవీధికి చెందిన జాలర్లు సహకరించారు. అమ్మ సాక్షాత్కారానికి ఆదిలోనే పాత్రులైన ఆ బెస్తలే కీలకంగా వ్యవహరించారు. నాటి నుంచి నేటి వరకూ ఏటా ఈ వలను యాతవీధి జాలర్లు తయారుచేస్తుంటారు. చేపలు వేటకు వెళ్లేటప్పుడు వాడే ప్రతి వస్తువును వల కింది భాగంలో ధరించి ఉత్సవంలో పాల్గొంటారు. వీరంతా ఒంటికి పసుపు రాసుకుని, వేపకొమ్మలు, జాలరి వస్తువులను చేతబట్టి సంబరంలో ఉత్సాహంగా ముందుకు సాగుతారు. సంప్రదాయ రీతిలో ఈ ఏడాది జాలరివాళ్లు ప్రత్యేక ఆకర్షణీయంగా కనిపించనున్నారు.
● అంజలి రథం
సిరిమాను జాతరలో అంజలిరథానికి విలక్షణమైన స్థానం. సిరిమానుకు అంజలి ఘటిస్తూ ముందుకు సాగుతుంది. కాబట్టి దీనిని అంజలి రథమని పిలుస్తారు. అంజలి అంటే నమస్కారం. పైడిమాంబను నమస్కరిస్తూ అంజలి రథంపై ఉన్న నడిపేన, కోరాడ కుటుంబాల వారు ముందుకు సాగుతారు. నాటు బండిపై రోలును బిగించి, దానికి అటు, ఇటు రాటలను కడతారు. దానిపై ఐదుగురు పురుషులు మహిళల వేషధారణలో కూర్చొంటారు. వీరంతా ఆరుమూరల నార చీరను, చేతికి వెండి సందెలను ధరిస్తారు. సంబరం ప్రారంభానికి ముందు ఊరేగింపుగా చదురుగుడి వద్దకు వస్తారు. వీరంతా అమ్మవారి పరిచారికులుగా వ్యవహరిస్తారు. సంబరం జరుగుతున్నంత సేపూ భక్తులపై అక్షితలు విసురుతుంటారు. ప్రతిగా భక్తులు భక్తిభావంతో అరటిపండ్లను వారిపై విసురుతుంటారు.
● తెల్ల ఏనుగు
పైడితల్లి సిరిమాను సంబరంలో తెల్ల ఏనుగుకు విశిష్ట స్థానం ఉంది. పూసపాటి గజపతులు ముస్తాబు చేసిన అంబారీ ఏనుగుపై కూర్చొని సంబరంలో పాల్గొనేవారు. సిరిమానుకు ముందు పట్టపుటేనుగు నడిచేది. రాచరికం అంతరించి, ప్రజాస్వామ్యం వచ్చాక పట్టపుటేనుగుకు గుర్తుగా 1956 నుంచి ఏనుగు ఆకారంలో ఒక బండిని ప్రదర్శిస్తున్నారు. ఈ ఏనుగుపై ఒక పురుషుడు, ఏడుగురు పురుషులు సీ్త్ర వేషాలను ధరించి కూర్చొంటారు. సీ్త్రలంతా పైడితల్లమ్మకు అక్కాచెల్లైళ్లెన గ్రామదేవతలుగా, మగవేషంలో ఉన్న వ్యక్తి అమ్మవారి సోదరుడు పోతురాజుగా భావిస్తారు. వెదురుతో తయారైన ఈ ఏనుగుపై భోగాపురం, పెద్దింటి తదితర కుటుంబ సభ్యులు కూర్చొంటారు.
పాలధార
సిరిమాను సంబరం ప్రారంభానికి ముందు పాలధార ఆలయానికి రావడం అనాదిగా వస్తున్న ఆచారం. జాలరి వలను వెన్నంటే ఈటెలు చేతపట్టి వచ్చే ఈ జనం మహాశక్తి స్వరూపాలుగా భావిస్తారు. పాలధారగా పిలిచే ఈ జనధార అమ్మవారి సైనిక శక్తికి వారసులంటారు. తొలుత కొందరు ఈటెలను ధరించి అమ్మవారి ఆలయానికి వస్తారు. అక్కడ పైడిమాంబను దర్శించుకున్న అనంతరం డప్పు వాయిద్యాలతో కోట వద్దకు చేరుకుంటారు. అక్కడ పూజలు చేసిన అనంతరం కోట పశ్చిమ భాగం వైపు వెళ్లి, కోట శక్తికి నమస్కరిస్తారు. సైనికులుగా పనిచేసే వీరంతా ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలన్న భావనతో గ్రామ కట్టడి చేస్తారు. ఈ ఘట్టంలో సాకేటివీధికి చెందిన డోకుల, మండల, అలుగోలు, రామవరపు తదితర కుటుంబ సభ్యులు పాల్గొంటారు.
సిరిమానోత్సవం.. ఈ పేరు వింటే భక్తకోటి పరవశించిపోతుంది. సిరిమాను పూజారి రూపంలో నగర వీధుల్లోకి పైడితల్లి అమ్మవారు తరలివచ్చే దృశ్యాన్ని కనులారా వీక్షించేందుకు భక్తకోటి పరితపిస్తోంది. రెండున్నర శతాబ్దాల చరిత్రను సొంతం చేసుకున్న పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సం ముహూర్తం ప్రకారం మంగళవారం మధ్యాం 3.05 గంటలకు ఆరంభం కానుంది. ఉత్సవంలో పాల్గొనేందుకు లక్షలాది మంది భక్తులు ఇప్పటికే జిల్లాకు చేరుకున్నారు. ప్రతి ఇల్లు పండగ శోభను సంతరించుకుంది. ఓ వైపు విజయనగర ఉత్సవాలు మరోవైపు పైడితల్లి పండగ శోభతో విద్యలనగరం వెలిగిపోతోంది. భక్తులకు ఇబ్బంది కలగకుండా రెండువేల మందితో పోలీస్‌లు బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.
భక్తులను విశేషంగా ఆకట్టుకునే సిరిమానోత్సవంలో అన్నీ రసవత్తర ఘట్టాలే. 58 అడుగుల పొడవున్న సిరిమాను ఉపరితలంలో బిగించే ఇరుసుపై ప్రధాన పూజారి విసనకర్త చేతబట్టి ఆశీనులవుతారు. రెండో చివర రథంపై అమర్చిన ఇరుసును మానుకు అమరుస్తారు. దాని ఆధారంగానే మాను పైకి లేస్తుంది. గజపతిరాజు వంశీయుల తరఫున ఒకరు తాడు లాగడంతో ప్రారంభమయ్యే సిరిమాను ఊరేగింపు మూడులాంతర్లు వద్దగల పైడితల్లి అమ్మవారి గుడి వద్ద నుంచి రాజాబజారు మీదుగా కోట వరకూ మూడుసార్లు తిరుగుతుంది. ఊరేగింపు ఆద్యంతం విసనకర్ర విసురుతూ కనిపించే సిరిమాను పూజారిని భక్తులు అరటిపండ్లతో కొలుస్తారు.





