విజయనగరం జిల్లాలో అపూర్వమైన శైవశిల్పాలకు ఆలవాలం గుళ్లసీతారాంపురం గ్రామమని, పదవ శతాబ్ధంలో ప్రసిద్ధి శైవక్షేత్రంగా విరాజిల్లిందని రాజాం రచయితల వేదిక నిర్వాహకుడు గార రంగనాథం తెలిపారు. రాజాం చరిత్ర రచనలో భాగంగా ఇటీవల ఆయన ఆ గ్రామాన్ని సందర్శించిన సమయంలో ఈ విషయం కనుగొన్నట్లు తెలిపారు.
ఈ మేరకు స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ..350 ఏళ్లుగా బొబ్బిలి రాజుల కాలం నుంచి సీతారామ క్షేత్రంగా పిలిచే ఈ ఊరు గంగరాజుల కాలంలో ప్రసిద్ధ శైవ క్షేత్రమని, గతంలో ముగడపేట, గొల్ల సీతారాంపురంగా పిలిచేవారన్నారు. దక్షిణాన తోటలోని శివాలయంలో 10వ శతాబ్దపు లింగం, అలంకరించిన నందిని తాను చూశానని తెలిపారు. ఈ ఆలయంలో వినాయకుడి విగ్రహం నాలుగు చేతులు కలిగి ఉందని, చేతులలో సర్పం, ఢమరుకంతో శివలింగం, కుడుము గల అతి అరుదైన శిల్పమని పేర్కొన్నారు.
అలాగే కళింగ శైలి నంది, కాళికాదేవి, కళింగానికి చెందిన శివలింగం ఉన్నాయని అన్నారు. అవి క్రీస్తు శకం 10వ శతాబ్దం నుంచి 14వ శతాబ్దం మధ్యలో అప్పుడప్పుడు చెక్కించిన విగ్రహాలని తెలిపారు. అంతే కాకుండా సీతారాముల ఆలయ ముఖద్వారంపై ఇదే కాలానికి చెందిన శృంగార శిల్పం, ఆలయానికి ముందర ఖాళీ స్థలంలో లలితాదేవి విగ్రహం ఉన్నాయని, అవన్నీ అత్యంత ప్రాచీనమైనవన్నారు. ఈ విగ్రహాల స్థితిగతులపై ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ ముఖ్యకార్య నిర్వహణాధికారి ఈమని శివనాగిరెడ్డిని సంప్రదించగా ఆయా దేవతలను, కాలాలను ఆయన ధ్రువీకరించారని రంగనాథం తెలిపారు.