
శ్రీకాకుళం అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానం, సుమిత్రా కళాసమితి సంయుక్త నిర్వహణలో స్థానిక వైజయంతి ఉత్సవ మండపంలో ద్విశతావధాన కళావిలాస కార్యక్రమం ప్రారంభమైంది. డాక్టర్ పులఖండం శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో అవధాని బులుసు అపర్ణ మాట్లాడుతూ తెలుగు భాషకు వన్నెతెచ్చిన సాహిత్య ప్రక్రియ అవధానమని పేర్కొన్నారు. సమితి గౌరవాధ్యక్షుడు డాక్టర్ కొంచాడ సోమేశ్వరరావు, విశ్రాంత రిజిస్ట్రార్ గుంట తులసీరావు, వ్యాపారవేత్త సూర శ్రీనివాసరావులు మాట్లాడుతూ తెలుగు సాహిత్యానికి వరం అవధానమని చెప్పారు.
ఆకట్టుకున్న సాహిత్య ప్రక్రియలు..
సభా సంచాలకులు విశాఖకు చెందిన డాక్టర్ పేరి రవికుమార్, సభాధ్యక్షుడు విజయవాడకు చెందిన పాలపర్తి శ్యామలానంద ప్రసాద్‌లు మాట్లాడుతూ అవధాన ప్రక్రియను మొదటిగా మాడభూషి వెంకటాచార్యులు ప్రవేశపెట్టారని, తదుపరి తిరుపతి వెంకట కవులు కొనసాగించారని తెలిపారు. అప్రస్తుత ప్రసంగీకులుగా విజయవాడకు చెందిన పంతులు తపస్వి, దండిభోట్ల దత్తాత్రేయ శర్మలు పలు అప్రస్తుత సమస్యలను చెబుతూ సమాధానాలు రాబట్టారు. పైడి హరనాధరావు ‘దంష్ట్రాఘాతం నేలకొరిగేన్’ అని, సుసరాపు చంద్రశేఖరశర్మ ‘కొండయున్నది భానుని కొలనులోన’ అని, కర్నేన జనార్దనరావు ‘మునిఘాతంబున జచ్చె రాక్షసుడు సమ్మూఢంబుగా’ వంటి సమస్యాపూరణాలను ఇవ్వగా అవధాని పూరణ చేశారు. దత్తపదిలో కె.వి.రాజారావు లతిక, గీతిక, వీచిక, వేదిక పదాలతో అస్సాం వరదలలో పడవలో ప్రసవించిన ఓ గర్భిణి దుస్థితిని పద్యంగా చెప్పమని.. తమ్మినేని సూర్యనారాయణ ధనము, జనము, వనము, దినము అనే పదాలతో పర్యావరణ పరిరక్షణ కోసం చెప్పమనగా ఒక్కో పాదం చక్కగా పూరించారు. మొత్తం 25 మంది దత్తపదులను ఇచ్చారు. సాయంత్రం 25 వర్ణనలకు అవధాని పద్యరూపంలో సమాధానమిచ్చారు.





