
సనాతన ధర్మాన్ని కించపరిస్తే సహించేది లేదని విశ్వ హిందూ పరిషత్ దక్షిణాంధ్రప్రదేశ్ అధ్యక్షులు నందిరెడ్డి సాయిరెడ్డి హెచ్చరించారు. శ్రీ లలితా పీఠం ఆధ్వర్యంలో కర్నూల్ ఓల్డ్‌సిటీలోని లలితా పీఠంలో నాల్గవ హిందూ ధార్మిక సంస్థల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. సభాధ్యక్షత వహించిన ఆయన మాట్లాడుతూ.. విపక్ష నేత రాహుల్ గాంధీ పవిత్రమైన పార్లమెంట్ సాక్షిగా హైందవ సంస్కృతిని కించపరిచేలా మాట్లాడటం గర్హనీయమన్నారు.
వైఎస్సార్ జిల్లా బ్రహ్మంగారి మఠం అచలానంద ఆశ్రమం స్వామీజీ విరజానంద ప్రసంగిస్తూ.. హిందువులందరూ హైందవ విలువలతో జీవించటం అత్యంత అవసరమన్నారు. ప్రధాన వక్త వీహెచ్‌పీ రాష్ట్ర కార్యదర్శి కాకర్ల రాముడు మాట్లాడుతూ హిందూ సంప్రదాయాలను ఆచరించడం, గౌరవించడం మనందరి కర్తవ్యం కావాలన్నారు. కందిమల్లాయపల్లె బ్రహ్మంగారి మఠం వీరబ్రహ్మేంద్ర స్వామి 8వ తరం మునిమనుమడు నొస్సం వీరంభట్లయ్య స్వామి, చిన్నటేకూరు సద్గురు నాగలింగేశ్వర జీవైక్య మఠం మఠాధిపతి ఎల్లప్ప స్వామి, జూటూరు గురుసిద్ద నాగసాయి బ్రహ్మ విద్యాశ్రమం పీఠాధిపతి సద్గురు రామానంద స్వామి, ఇస్కాన్ కర్నూలు బాధ్యులు రఘునందన సేవక్‌ప్రభు, లలితా పీఠం వ్యవస్థాపకులు మేడా సుబ్రహ్మణ్య స్వామి, తెలుగు భాషా వికాస ఉద్యమం కార్యదర్శి జేఎస్‌ఆర్కే శర్మ మాట్లాడారు.
అంతకు ముందు జ్యోతి ప్రజ్వలనతో అతిథులు కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో తరిగొండ వెంగమాంబ సేవాసమితి అధ్యక్షులు నీలిమ, సభ్యులు చంద్రమౌళిని, వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షులు గోరంట్ల రమణ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ తొగట సురేష్‌బాబు కార్యక్రమ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.




