
సృష్టి కార్యంలో తనకు సహకరించేందుకు బ్రహ్మదేవుడు జన్మనిచ్చిన మానస పుత్రులలో అంగిరసుడు మూడవ వారని విష్ణుపురాణం చెబుతోంది. పుట్టుకతోనే దివ్యతేజస్సుగల ఆయనకు బ్రహ్మ ఆదేశానుసారం చేసిన మహాతపస్సు వల్ల ఆ తేజస్సు దేదీప్యమానమైంది. ఏకకాలంలో ముల్లోకాల్లో నింపగల తేజస్సు ప్రసాదించిన బ్రహ్మ, లోకక్షేమం కోసం తపమాచ రించాలని అంగిరసుని ఆదేశించాడు. అలా తపస్సు ద్వారా మహర్షిత్వం సంపాదించుకుని విజ్ఞాననిధిగా, అనేకానేక వేదమంత్రాలకు ద్రష్టగా, బహుముఖాలైన ధర్మాలకు శాసనికునిగా నిలిచాడు.
కర్దమ ప్రజాపతి తొమ్మండుగురు కుమార్తెలలో ఒకరైన శ్రద్ధను అంగిరసుడు వివాహమాడగా, వారికి ఏడుగురు కుమారులు, ఏడుగురు కుమార్తెలు కలిగారు. ఆయన బోధించిన ధర్మ రహస్యాలు ‘అంగిస్మృతి’ అనే పేరుతో ఉన్నాయి. మనిషి శాస్త్ర ప్రకారమే కర్మలు చేయాలని, పశుపక్షి సంతతిని చంపకూడదని, మాంసాహారం మానాలని మహాదోషాలకు పాల్పడిన బ్రాహ్మణులు ‘వజ్రవ్రతం’ అనే కఠినమైన దానిని అనుసరించాలని సూచిం చాడు. ఆయన వినయశీలతకు ఒక ఉదాహరణ… యజ్ఞయాగాదులలో తనకు తగినంత గౌరవం దక్కడం లేదని అలిగిన అగ్నిదేవుడు బ్రాహ్మణ గృహాల్లోని యాగశాలల నుంచి మాయమైపోవడంతో అగ్నులు చల్లారి యజ్ఞాలు నిలిచి పోయాయి. దాంతో ఇంద్రాద్రి దేవతలు బ్రహ్మకు విన్నవించుకోగా, అగ్నికి ప్రత్యామ్నాయంగా అంగిరసుడికి బాధ్యతలు అప్పగించాడు.
అంగిరసుడు తన విధులు నిర్వర్తిస్తూ జగదారాధకుడయ్యాడు. లోకం అగ్నిదేవునే మరచిపోయేస్థితి ఏర్పడింది. కొంతకాలానికి అగ్ని పశ్చాత్తాపంతో ఇంద్రుడి వద్దకు వెళ్లగా, అక్కడే స్వదేహంతో ఉన్న అంగిరసుడు, ఆయనకు నమస్కరిస్తూ, ‘మీరు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ కార్యాన్ని మీరే నిర్వహించండి’ అని కోరాడు. ఆ వినయానికి ముగ్ధుడైన అగ్ని, ‘నన్ను మించిన మహత్తు కలవాడివి. నీ వంటి మహాత్ముడి వల్ల యజ్ఞయాగాదులకు నేను లేని కొరత తీరిపోయింది. దేవతలు, మానవులకు నీ దర్శన భాగ్యం ఉండబట్టే నేను అలిగి వెళ్లానేమో’ అని బదులు పలికాడు. ‘మీరు నన్ను స్తుతిస్తున్నారు తప్ప మీకంటే ఉన్నతుడిని కాను. లోకారంభం నుంచే మీరే అగ్నిహోత్రం. యజ్ఞయాగాది క్రతువులకు మూలాధారులు. మీ ముందు పుట్టిన వాడిని మీతో సమానుడిని ఎలా అవుతాను? కనుక ప్రథమ పూజ్యులు మీరే. త్రేతాగ్నిలో మొదటి అగ్నిగా మీరుంటే, మీ అభీష్టం మేరకు ద్వితీయాగ్నిగా నేనుంటాను’ అని చెప్పాడు. అలా ద్వితీయాగ్నిగా ఆవాహన చేసేనప్పుడు వచ్చే అగ్నిగా అంగిరసుడు నిలిచాడు.





