
ఆంజనేయుడు లంకాదహనం చేసి వెళ్లాక, రావణుడు కొద్దిగా కలవరపడతాడు తాత్కాలికంగా. కానీ, అతడి కళ్లకు పొరలు కమ్మిన “కామం” సీతాదేవి పెట్టిన సంవత్సర కాలంగడువు, తాను సీతకిచ్చిన “మాసం” గడువు ఏ ఆపద లేకుండా గడిచి పోతాయనీ, ఆ తర్వాత సీత తనంత తానుగ తనని వరిస్తుందనీ ఆశలో పడవేస్తుంది. “ఒక కోతి వచ్చింది. ఏదో అల్లరి చేసిపోయింది. మావంటి యోధానుయోధులుండగా ఈ లంకానగరానికిగానీ, నీకు గానీ భయమేమీ లేదు!” అని ఇచ్చకాలు పలికే కొందరు మూర్ఖులైన మంత్రులు, బంధువులు, ఆశ్రితులూ ఉండగా కామమే ప్రధాన లక్షణంగా, లక్ష్యంగా కలిగిన రావణుడు తనకు మృత్యువు త్వరలో రాబోతోందని తెలుసుకోలేక నిశ్చింతగా ఉంటాడు. వానర సైన్యంతో శ్రీరాముడు సముద్రపు ఆవలిగట్టున విడిది చేసినపుడు, విభీషణుడు రాముని శరణు వేడినపుడుగానీ, ఆ మూర్ఖపు నియంతకు పరిస్థితి పీకల మీదకు వస్తోందని అర్థంగాదు.
‘శుకుడు’ అనే గూఢచారిని వంవగా, వానరవీరుల చేతులలో ప్రాణావశిష్ఠుడై తిరిగివచ్చి రామపరాక్రమం, వానరుల పరాక్రమం గురించి రావణుడికి చెబు తాడు. మరల సేతువు బంధించి రాముడు లంకాద్వీపం వెలవల సైన్యాన్ని మొహరించగ వారు వానరుల చేతిలో చావుదెబ్బలు తినివచ్చి రావణుడికి రామ పరాక్రమమూ, వానరవీరుల బలమూ చెప్పి, భయంతో గజగజవణకిపోతారు. రావణుడు కపటోపాయంతో సీతాదేవిని తన పట్ల ఆకర్షితురాలిని చేసుకోవాలనే తలంపుతో ‘విద్యుజ్విహ్వుడు’ అనే రాక్షసుడితో రాముని శిరస్సును పోలిన శిరస్సు, ధనన్సు చేయించి, అశోకవనంలో సీతాదేవి వద్దకు నెత్తు రోడుతున్న శిరస్సు, ధనస్సు తెచ్చి, రాముడు లంకా నగరపు పొలిమేరలు ప్రవేశించటంతోనే హతు డయ్యాడని అబద్ధాలు చెబుతాడు. ఆమె దుఃఖిస్తూ ఉండగా, అత్యవసరంగా అమాత్యులు తనని సభకు ఆహ్వానిస్తున్నారని తెలుసుకొని వెళ్లిపోతాడు. శిరస్సు, ధనస్సు మాయమైపోతాయి. సీత నిజం తెలుసు కుంటుంది.
ఇక రణరంగంలో మూడుమార్లు రామునిచేత పరాజితుడౌతాడు రావణుడు. “ఇతడు సాక్షాత్తూ విష్ణువా! నన్ను వధించటానికిలా మానుష రూపం ధరించాడా? ఆహో! ఏంబలం? ఏం శౌర్యం?” అని ఆలోచనలో పడతాడు. కానీ ఆ ఆలోచన తాత్కాలికం! సీతమీద గల కామం, ఆ జ్ఞానలేశాన్ని చీకటిలో ఆవరించేస్తుంది.
యుద్ధరంగంలో వరుసగా సోదరులు, కొడుకులు, యోధానుయోధులు మరణిస్తున్నారన్న వార్తలే తప్ప, జయం సాధిస్తున్నారన్న వార్తలే లేవు. కలతపడిపోతాడు. వ్యాకులపడతాడు. అయినా మొండి వైఖరి వదలడు. మహోదరుడు చనిపోయాక, కుంభకర్ణుడు చనిపోతాడు. అప్పుడు దిగులుతో, “విభీషణుడి మాట విన్నాను కాను! కుంభకర్ణుని మాట విన్నాను కాను!” అనుకుని ఏడుస్తాడు. ఆ ఏడుపూ తాత్కాలికమే! మరల తన ప్రియపుత్రుడు ఇంద్రజిత్తుని పిలిపించి, యుద్ధరంగంలోకి శలభంలా తరుముతాడు.