
ఆవు అనగా భారతీయ సంతతికి చెందిన గోవు మాత్రమే. జెర్సీ కాదు. జెర్సీ ఆవు కాదు. పాలిచ్చు జంతువులు ఆవు, గేదె, జెర్సీ. ఈ మధ్య దేవాలయాలలో కూడా జెర్సీ గోదానాలు చేసేస్తున్నారు. ప్రసిద్ధమైన ఆలయాలలో స్వామివారికి జెర్సీ పాలతో అభిషేకం చేస్తున్నారు. ఆలయాలకు సరఫరా చేసే ఆవునెయ్యిలో ఆవుమాంసంలోని కొవ్వుని, కొమ్ములలోని కొవ్వుని కలిపి నెయ్యిగా ఇస్తున్నారు. వాటిని దేవాలయాలలో వాడుతున్నారు. ప్రసిద్ధి చెందిన ఆలయాలలో యజ్ఞానికి, పదార్థాల నైవేద్యాల తయారీకి, నివేదన సమయానికి వాడుతున్నారు. ఇది చేసి దేవతల అపచారానికి మనందరం పాల్పడుతున్నాం. దణ్ణం పెట్టి బాధ్యత తీరిపోయింది అనుకోవద్దు. దేవాలయాలను కాపాడుకోవాల్సిన అవసరం భారతదేశంలో ఉన్న అందరికీ ఉంది.
గుడికి రాబడి కానీ రాబడి కోసం గుడి కాదు. దేవాలయ అభివృద్ధి అంటే దానికున్న ఆదాయం చూపించి కాదు. దాని తపస్సును చూసి చెప్పాలి, దాని అనుష్ఠానాన్ని చూసి చెప్పాలి, దాని పవిత్రతను చూసి చెప్పాలి. ఆలయాలలో దేశవాళీ గోశాలలు పెంచాలి, వాటియొక్క పంచగవ్యములు వాడుకోవడం మొదలుపెట్టాలి. ప్రతివారూ మేము దేశవాళీ గోవుపాలు మాత్రమే త్రాగుతాం, ఆ నెయ్యే వాడుతాం అని నియమం పెట్టుకుంటే అప్పుడు మళ్ళీ గోశాలలు అభివృద్ధి చెందుతాయి. అది జరగాలి. భారతదేశం తనదైన ప్రత్యేకమైన గోజాతితో వర్ధిల్లుతుంది!
ప్రతి జాతి, ప్రతి దేశం తనకు మాత్రమే ప్రత్యేకమైన ఒకానొక జాతిని కాపాడుకోవడం దానియొక్క అవసరం. భారతీయ గోవు లాంటి గోవు ఇంకో నేలమీద ఉండదు ప్రపంచంలో. ఈ గోవు ప్రత్యేకత వేరు. మొత్తం ఆసేతుసీతాచలం గోవుల జాతులు వేరైనా భారతీయ గోవు లక్షణం మాత్రం ఒక్కటే. ఇది కేవలం కామధేను సంతానం భారతదేశానికే దిగి వచ్చింది. యజ్ఞ భూమియైన భారతదేశానికి దిగి వచ్చింది. అందుకే ఎన్ని దేశాలు తిరిగినా భారతదేశం లాంటి దేశం లేదు. అందుకే ఆ గోసంస్కృతిని, యజ్ఞసంస్కృతిని భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలి. భారతదేశపు గోవును హింసించే వారు ఎవరైనా దేశద్రోహియే.





