జమ్మూకశ్మీర్‌లో పర్యటక బస్సుపై జరిగిన ఉగ్ర దాడికి పాల్పడింది తామేనంటూ పాకిస్థాన్ లష్కరే తొయిబాకు చెందిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్‌ఎఫ్) ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో 9 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోగా.. 30 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఉగ్ర ఘటనపై కేంద్రమంత్రి రామదాస్ అథవాలే తీవ్రంగా స్పందించారు.
‘‘జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదం అంతమైందని నేను భావిస్తున్నాను. నరేంద్రమోదీ నేతృత్వంలో కేంద్రంలో కొత్త సర్కార్ కొలువుదీరిన సమయంలో.. ఉద్దేశపూర్వకంగా భయాన్ని సృష్టించేందుకు ఈ ఘటనకు పాల్పడ్డారు. ఇలాంటివి తరచూ జరుగుతుంటే.. మనం పాక్‌కు బుద్ధి చెప్పాల్సిందే’’ అని అథవాలే దాయాది దేశాన్ని ఉద్దేశించి హెచ్చరించారు. ఆదివారం సాయంత్రం యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో అది లోయలో పడింది. ముష్కరులు 25 నుంచి 30 తూటాలను పేల్చారని బాధితులు తెలిపారు. అప్పుడు ఆ వాహనం శివఖోరి ఆలయం నుంచి కట్రాలోని మాతా వైష్ణోదేవీ ఆలయానికి వెళుతోంది. ముఖాలకు మాస్కులు పెట్టుకొని ఉన్న ఆరు లేదా ఏడుగురు ఉగ్రవాదులు బస్సుపై కాల్పులకు తెగబడ్డారని బాధితులు వెల్లడించారు. చనిపోయినట్టు నటించి తాము ప్రాణాలు కాపాడుకున్నామని చెప్పారు. రియాసీ, ఉధంపుర్, ఫూంచ్, రాజౌరీ ప్రాంతాల్లోనే ఉగ్రవాదులు దాక్కున్నారని భావిస్తున్న బలగాలు.. వారి కోసం కూంబింగ్ ఆపరేషన్ ను నిర్వహిస్తున్నాయి.