
భారతదేశం, హిందూ సమాజం అంటే విశ్వంలోని సమస్త జీవకోటి శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని జీవనం చేసే ఉన్నత సంస్కృతీ సంప్రదాయాల నిలయం. మరీ ముఖ్యంగా అడవుల్లోను, కొండల్లోను జీవనం సాగించే గిరిజన సమాజం అంటే.. ప్రకృతి పరిరక్షణకు, అత్యున్నత విలువలకు పెట్టింది పేరు. అలాంటి ఈ వనవాసులను దెబ్బతీసి, హిందూ సమాజం నుంచి వీరిని విడదీసేందుకు మతమార్పిడి వంటి కార్యకలాపాలతో అన్యమతాల వారు అనేక పథకాలు వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వనవాసీ కల్యాణ్ ఆశ్రమ్ సంస్థ ఆ గిరిజన సమాజానికి తోడై నిలిచి, వారి ధర్మాన్ని, సంస్కృతీ సంప్రదాయాలను నిలబెట్టేందుకు ఎన్నో సేవలతో విశేష కృషి చేస్తోంది. వీటి గురించి జాగృతి పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వనవాసీ కళ్యాణ ఆశ్రమం, అఖిల భారత సంఘటనా కార్యదర్శి, అతుల్ జోగ్ సవివరంగా తెలియజేశారు. వనవాసీ కళ్యాణ్ ఆశ్రమ్ ప్రయాణం, భవిష్య కార్యాచరణ, వనవాసులకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టే దిశగా చర్యల ఆవశ్యకత గురించి వెల్లడించారు.
నమస్తే అతుల్ జోగ్ గారు, జాగృతి పాఠకుల తరఫున మీకు సుస్వాగతం. ఈ రోజున మనం గమనిస్తే హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేసేందుకు అనేక కుట్రలు జరుగుతున్నాయి. వాటిలో ప్రధానమైంది, హిందూ సమాజం నుంచి వనవాసులను దూరం చెయ్యాలనుకోవడం. ఈ అంశంలో మరింత లోతుగా వెళ్లే ముందు.. అసలు వనవాసుల పట్ల కల్యాణ్ ఆశ్రమ్ విధానం ఏమిటి?
భారతదేశానికి ఎన్నెన్నో విశిష్టతలున్నాయి. ప్రపంచంలోకెల్లా అతి ఎక్కువ సంఖ్యలో భారత దేశంలోనే వనవాసులు లేదా గిరిజన ప్రజలున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 11 కోట్ల 48 లక్షల మంది, అంటే మొత్తం జనాభాలో 9 శాతం మంది షెడ్యూల్డ్ తెగల ప్రజలున్నారు. మరే దేశంలోనూ ఇంత పెద్ద సంఖ్యలో వనవాసీ ప్రజలు లేరు. మన రాజ్యాంగంలో వీరిని ‘జన జాతి’ (గిరిజనులు లేదా వనవాసులు) అని పేర్కొన్నారు. నాడు 13 కోట్ల మంది గిరిజనులు, 700 రకాల తెగల వారుండే వారు. మన దేశంలో కేవలం ఢిల్లీ, హరియాణా, పంజాబ్.. ఈ 3 రాష్ట్రాల్లో మాత్రమే వనవాసులు లేరు. ఈ 3 రాష్ట్రాల్లో అడవులు కూడా లేవు. ఇదొక కారణం కావచ్చు. ఈ వివిధ రకాల గిరిజన జాతులకు వారి వారి భాష, వారసత్వం, సంప్రదాయాలు, వేడుకలు వేర్వేరుగా ఉన్నాయి. వీటిలో పోలికలు, వ్యత్యాసాలూ ఉన్నాయి. వనవాసీ కళ్యాణ్ ఆశ్రమ్ దృష్టిలో ఈ గిరిజన జాతులన్నీ గొప్పవే.. మన దేశపు గిరిజనులలో భిల్లులు, గోండులు, సంథాలీలు, ముండాలు, బోడోలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. మరికొన్ని గిరిజన జాతుల విషయానికి వస్తే, మీరు అండమాన్‌లో చూస్తే గ్రేటర్ అండమానీ జాతి ఉంది. వీరి సంఖ్య వంద వరకూ ఉండవచ్చు. ఉంగీ జొంగత్ అనే జాతి ప్రజలు 140 మంది మాత్రమే ఉన్నారు. ఇలాంటి అల్ప సంఖ్యాక జాతులు కూడా ఉన్నాయి. ఏమైనప్పటికీ ప్రతి ఒక్క గిరిజన జాతిని సంరక్షించుకోవడం ముఖ్యం. కళ్యాణాశ్రమ్ కోణంలో చూస్తే ఈ వనవాసులందరూ భారతదేశ ప్రజలే.. అందరూ సమానమే. వీరి గురించి ఆలోచించాలి.. వీరి వికాసం సమగ్రంగా ఉండాలి. మరో కోణం ఏమిటంటే, నేడున్న వనవాసీ సమాజంలో గమనిస్తే, దేశంలోని 30 శాతం భూమి అటవీ భూమి, అంటే వనవాసీ క్షేత్రం అన్నమాట. ఈ 30 శాతం భూమిలో 9 శాతం మంది ప్రజలు జీవిస్తున్నారు. ఈ వనవాసుల గురించి మీకేం తెలుసు? అని పట్టణాల్లో నివసిస్తున్న ప్రజలను అడిగితే, గిరిజనులు విద్యలోనూ, సామాజిక జీవనంలోను, ఆర్థికంగాను, వెనుకబడి ఉన్నారని చెబుతారు. అన్నీ ప్రతికూలమైన భావాలే వ్యక్తమవుతాయి. దేశమంతటా వనవాసు లంటే ఇదే భావన నెలకొంది. ఎందుకంటే వారెప్పుడూ వనవాసులను కలిసింది లేదు. ఈ కారణాలవల్ల చాలామంది ఇలాగే అనుకుంటున్నారు.
అయితే 75 ఏళ్లుగా వనవాసుల సేవల్లో కళ్యాణాశ్రమ కార్యకర్తలున్నారు. మా దృష్టికోణం ఏమిటంటే, బహుశా వనవాసులు భౌతిక సదుపాయాల విషయంలో వెనుకబడి ఉండవచ్చు. అధునాతన వాహనాలు, ఏసీలు, భారీ భవనాల వంటివి ఉండకపోవచ్చు. భౌతిక సంపదలో పేదవారైనప్పటికీ వీరు బిచ్చమెత్తడం మనం చూడం. అబద్ధం ఆడనే ఆడరు. వీరిది సామూహిక జీవనం. నిజమైన భారతీయ విలువలను వనవాసుల్లో చూడవచ్చు. ఢిల్లీకి చెందిన ఒక న్యాయవాది, తన సతీమణితో కలసి ఏడాదికి నాలుగైదు రోజులు వనవాసీ క్షేత్రాలకు వెళుతూ వారి నుంచి ఏదైనా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు తప్ప ఆ గిరిజనులకు ఏదో నేర్పడానికి కాదు. గతేడాది వారు మధ్యప్రదేశ్ లోని ఝాంవార్ అనే చోటుకు వెళ్లారు. ఈ ప్రాంతంలో మందిరం ఉందా… అని అక్కడి వారిని అడిగారు. మందిరం లేదు గానీ తమ దేవుడున్నా డన్నారు. ఎక్కడని అడిగితే గ్రామం బయట మర్రి చెట్టు కింద తమ దేవుడు ఉన్నాడన్నారు. తాము కూడా చూస్తామని చెప్పగా పూజారిని పిలిపించారు. మర్రి చెట్టు దగ్గరకొచ్చారు. ఢిల్లీ నుంచి ఎవరో న్యాయవాది మన దేవుడిని చూడటానికి వచ్చారను కుంటూ ఊరివారంతా అక్కడికి రావడం, పూజ చెయ్యడం, ప్రసాదం ఇవ్వడం, దక్షిణ సమర్పించడం అన్నీ జరిగాయి. ఇవన్నీ అయ్యాక ఆ న్యాయవాది ‘మీరు ఈ దేవుడికి ఎప్పుడు పూజ చేస్తారు?’ అని గ్రామస్తులను అడిగారు.. ఏడాదికి 3 సార్లు పూజ చేస్తామని వారు చెప్పారు. పూజలో దేవుడిని ఏమడుగుతారు? అని న్యాయవాది అడిగారు. గ్రామస్తులకు ఈ ప్రశ్నే అర్థం కాలేదు. మీకు ఏం కావాలని దేవుడిని కోరుకుంటారు? అని న్యాయవాది కాస్త వివరంగా అడిగారు. ఆ ప్రజలు చాలా సేపు ఆలోచించి సమయానికి వానలు పడాలని, సూర్యుని వెలుగులు పడాలని, నదులు పుష్కలంగా నీటితో ప్రవహించాలని, ప్రకృతి శాంతంగా ఉండాలని అడుగుతాం.. అని చెప్పారు. మరి మీరు డబ్బు, ఉద్యోగం, పదోన్నతి వంటివి అడగరా? అని వారిని ప్రశ్నించారు న్యాయవాది. అది దేవుడేం చేస్తాడు… మనం కదా కష్టపడాలి… అని బదులిచ్చారు గ్రామస్తులు. అప్పుడు నిస్వార్థ భక్తి అంటే ఏమిటన్నది ఆ న్యాయవాదికి అర్థమైంది. వనవాసులకు అది మాత్రమే తెలుసు. మన పట్టణవాసులమైతే దేవుడిని ఎన్నో కోరికలు కోరతాం.. అది జరిగితే ఇదిస్తా… ఇది జరిగితే అదిస్తా అంటుంటాం.. అంతా వ్యాపారం అయిపోయింది. గ్రామీణులు భక్తితో ఉంటారు తప్ప దేవుడి నుంచి ఆశించరు. రామ దర్శనం చేసుకున్న శబరి, ఆయన్ని ఏమీ కోరలేదు. ఇలాంటి భారతీయ విలువలను ఈ వనవాసీ ప్రజల్లో నేటికీ చూడవచ్చు. వీరిని వెనుకబడినవారు అంటుంటాం మనం.
ఈ వనవాసీ సమాజంలో దేశపు ధర్మం, సంస్కృతి విషయంలో పెద్ద సంఘర్షణ కూడా ఉంది. మీరు మహాభారత కాలం చూస్తే.. హిడింబి, ఆమె కుమారుడైన ఘటోత్కచుడు, బర్బరీకుడు, ఏకలవ్యుడు వీరంతా వనవాసులే. నాటి సమాజంలో వీరి మధ్య భేదభావాలు లేవు, సమరసత నెలకొని ఉంది. నాటి నుంచి.. మొఘలులతో పోరాడిన రాణి దుర్గావతి, బ్రిటిష్ వారిని ఎదిరించిన భగవాన్ బిర్సాముండా, తెలంగాణకు చెందిన అమరవీరుడు రాంజీ గోండు ఇలా ఎందరో దేశం కోసం ప్రాణాలర్పించారు. భారత ఇతిహాసంలో రెండు రకాల సంఘర్షణలు కనిపిస్తాయి, పట్టణ ప్రాంతాలవారైన భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్, మదన్‌లాల్‌ధింగ్రా వంటి వారూ పోరాటాలు చేశారు. వీరు తుపాకులు చేతబట్టి బ్రిటిష్ వారిని మట్టుబెట్టడం, తర్వాత వారు ఉరికంబా లెక్కడం, జనం చూస్తుండటం మనకు తెలుసు. వీరి పోరాటానికి నాటి ప్రజల మద్దతు లేదు.
వనవాసీ క్షేత్రంలో చూస్తే బిర్సాముండా గురించి మనకు తెలుసు, ఆయనతో పాటు ఎందరో అమరులయ్యారు. వీరి పేర్లు కూడా తెలియవు. తెలంగాణలోని నిర్మల్ దగ్గర రాంజీ గోండును నాటి ప్రభుత్వం పట్టుకున్నప్పుడు చెట్టుకు కట్టి ఉరి తీశారు. ఆయనతో పాటు వెయ్యిమందిని ఉరి తీశారు. వీరి పేర్లు కూడా తెలియవు. వనవాసీ వీరులు.. మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు.. ఏనాడూ ఒంటరి పోరాటం చెయ్యలేదు. వారి సమాజం సైతం వారితో పాటు కలసి పోరాడింది. అంతటి ఉన్నతమైన ఈ సమాజాన్ని అప్రతిష్టపాలు చెయ్యడానికి బ్రిటిష్ వారు కుట్రలు పన్నారు. 1871లో మన దేశంలో మొదటి జనగణన జరిగినప్పుడు ఈ గిరిజన జాతుల ప్రజలను క్రిమినల్ ట్రైబ్ యాక్ట్ పరిధిలోకి తీసుకు వచ్చారు. అంటే, గిరిజనులు/వనవాసులందరూ నేరస్తులు అని తీర్మానం చేశారు. అంటే, ఆ జాతుల్లో అప్పుడే పుట్టిన పసికందులు పుట్టుకతోనే నేరస్తులన్న మాట. భగవంతుని స్వరూపాలైన ఆ పసివారిని కూడా అపరాధులను చేశారు. ఇంతకు మించిన పాపం మరేదీ లేదు. ఇదంతా చూసిన పట్టణ ప్రజలు ఆ అమాయక గిరిజనవాసులను నేరస్తులని, వెనుకబడినవారని, అసభ్యులని, నిరుపేదలని వారిపట్ల ప్రతికూల భావాలను పెంచుకున్నారు. హాలీవుడ్/బాలీవుడ్ సినిమాల్లో కూడా గిరిజనులను అలాగే చూపించి ఒక ముద్ర వేసేశారు. కానీ వాస్తవం చాలా భిన్నమైనది. వనవాసీ కళ్యాణాశ్రమ్ దృష్టిలో చూసినప్పుడు వనవాసీ సమాజం అనేది మన దేశంలోనే ఒక గొప్ప సభ్య సమాజం.
మీరు వనవాసీ క్షేత్రాల్లో విశేషంగా పర్యటనలు చేశారు. ఒక ఆదర్శ వనవాసీ గ్రామం/గిరిజన గ్రామం అంటే ఎలా ఉంటుంది?
వనవాసీ గ్రామాన్ని మీరు గమనిస్తే, నివాసుల ఇళ్లన్నీ ఒకేలా ఉంటాయి. ఒకరి ఇల్లు బహుళ అంతస్తులతోను, మరొకరిది గుడిసె… ఇలా అంతరాలతో ఉండవు. వారంతా సమానంగా ఎదుగుతారు. మా కార్యకర్తలు గిరిజనుల ఊళ్లకు వెళ్లినప్పుడు ఏ ఇంటికీ కంచె అన్నది కనిపించలేదు. ఇప్పటికీ అంతే.. మీ ఇళ్లకు కంచె ఎందుకు లేదని ఆ వనవాసులను అడిగితే, అసలు కంచె ఎందుకు పెట్టుకోవాలని వారు ఎదురు ప్రశ్నించారు.. దానికి, మీ భూమి ఎంత? పక్కవారు లేదా ఎదుటివారి భూమి ఎంత అనేది ఎలా తెలుస్తుంది? అని ప్రశ్నించారు కార్యకర్తలు. అందుకు, అసలు ఈ భూమి అనేది నాది కాదు, ఈ ఊరిది, ఈ సమాజానిది అని బదులిచ్చారు. ‘‘నేను ఉండటానికి ఎంత భూమి అవసరమో నాకు అంత ఇచ్చారు, నా పక్కవారికి ఎంత అవసరమో అంత ఈ సమాజం ఇచ్చింది’’.. అని ఆ గిరిజనులు జవాబిచ్చారు. ఒకవేళ ఎవరైనా ఆక్రమిస్తే సమస్య పరిష్కరించడానికి గ్రామ పంచాయితీ ఉంది, కోర్టుకు ఎందుకెళ్లాలి? అని వారు అన్నారు. అంటే, వనరులనేవి సమాజానివి.. వ్యక్తిగత ఆస్తులనే భావన భారతదేశంలో లేనే లేదు. స్వంత ఆస్తులు అనే భావన పాశ్చాత్య దేశాల నుంచి వచ్చింది. వనవాసీ గ్రామాలు ఈ విధంగా ఉంటాయి. ఇక్కడ అన్నీ నియమానుసారంగా ఉంటాయి, ఆ నియమాలను ప్రజలు గౌరవిస్తారు. ఈ గ్రామాల్లో కార్చిచ్చు, దావానలం లాంటి ప్రమాదాలు సంభవించి ఎవరి ఇల్లయినా కాలిపోతే ఊరివారంతా అడవి నుంచి కట్టెలు తెచ్చి, బాధిత కుటుంబానికి ఇల్లు కట్టి, వారి అవసరాలకు కావలసిన వస్తు సామగ్రిని సమకూర్చుతారు. సాయం కోసం ఎవరూ దరఖాస్తులు తీసుకుని కలెక్టర్, ఎమ్మెల్యే, ఎంపీల దగ్గరికి వెళ్లరు. ఇదే ఆత్మనిర్భరత అంటే. వనవాసీ గ్రామాలలో దీన్ని చూడవచ్చు. ఇందుకే, మేం కళ్యాణాశ్రమంలో ఒక పాట పాడుకుంటాం.. దాని అర్థం, సరియైన భారతావనిని దర్శించాలనుకుంటే వనవాసీ గ్రామాల్లో పుట్టాలి అని.
ఇంతటి అత్యున్నతమైనటువంటి విలువలు గిరిజన సమాజంలో ఉన్నాయి కదా.. ఆ సమాజం నేడున్న పరిస్థితి ఏమిటో మాకు వివరించండి..
నేటి స్థితి కూడా అలాగే ఉంది. అయితే, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా, పట్టణవాసులు వారిని వెనుకబడినవారని అనుకుంటుంటారు. నగరాల నుంచి వనవాసీ గ్రామాల్లోకి వెళ్లేవారంతా, వారికి ఏదో నేర్పాలనే మనోభావంతో వెళుతుంటారు. సేవ చెయ్యడానికంటూ వెళ్లేవారు కూడా ఆ గిరిజనులకు ఏదో నేర్పిద్దామనే ఆలోచనతో ఉంటారు. వీరు చెప్పేది వినీ వినీ ఆ గిరిజనులు కూడా తాము వెనుకబడి ఉన్నామేమోనని అనుకునే పరిస్థితి వచ్చింది. కానీ, వారు వెనుకబడి లేరు. చివరికి తాము అభివృద్ధి చెందాలంటే తమ ప్రాంతాలు కూడా పట్టణాల్లాగా మారాలి (అర్బనైజ్) అని, తమకు ఇంగ్లీష్ బాష తెలియాలి.. అనుకుంటున్నారు. మాడ్రనైజేషన్ అంటే వెస్ట్రనైజేషన్ అని నగరాల్లో అనుకుంటున్నట్టే, గిరిజన ప్రాంతాల్లోని వారు కూడా అదే ఆలోచనలోకి వచ్చారు. తమకు చెందినవన్నీ పాతకాలానివి అని భావిస్తున్నారు. అయితే ఇలాంటి భావాలు క్రమంగా దూరం కావడం కూడా మొదలైంది. గ్రామాల్లో ఒకప్పుడు చదువుకున్నవారు ఉండేవారు కాదు. నేడు రాయడం, చదవడం వచ్చినవారు పెరిగారు. గ్రామవాసులు కూడా డాక్టర్లు, ఇంజనీర్లు అవుతున్నారు. పట్టణాలకు వస్తున్నారు. మొదట్లో కమ్యూనికేషన్ అనేది ఉండేది కాదు. దాంతో కోరికలు కూడా ఉండేవి కాదు. ఏదో పొలం చూసుకోవడం, కాస్త చదువుకుని టీచర్ కావడం.. దీనికి మించిన ఆశయాలేమీ ఉండేవి కాదు. ఇప్పుడు ఇంటర్నెట్, మొబైల్ సహా ఎంతో సాంకేతిక అభివృద్ధి ప్రవేశించింది. అక్కడ నేటి యువతరంలో ఆశయాలు, ఆకాంక్షలు పెరిగాయి. మన విద్యా విధానం అందరినీ ఒకే ప్రమాణాలతో చూస్తోంది. ఎవరిలోనైతే గణితం, ఆంగ్లం, సామాజిక విజ్ఞానం ఎక్కువగా ఉంటుందో వారినే ఉన్నతులుగా లెక్కిస్తారు. ఇక్కడ చూస్తే లెక్కల్లో ఫెయిల్ అయినప్ప టికీ విలువిద్య (ఆర్చరీ)లో మంచి ప్రవీణులు ఉంటారు. దానికేమంటారు? ఒలింపిక్స్‌కి వెళ్లాలంటే అక్కడ లెక్కల ప్రావీణ్యం ఉంటే కుదరదు కదా.. ప్రతి సమాజంలోనూ దానికంటూ ఒక ప్రావీణ్యత ఉంటుంది. దాన్ని మనం ఎలా అభివృద్ధి చెయ్యగలం అనేది ఆలోచించాలి.
వనవాసీ సమాజం కోసం వనవాసీ కళ్యాణ్ ఆశ్రమ్ ఎన్నో సేవలు చేస్తోంది. గిరిజన సమాజంలో సహజంగానే పరస్పర సహకారం, దాన ధర్మాలు, ప్రకృతిని కాపాడుకోవడం లాంటి ఎన్నో ఉన్నత విలువలున్నాయి, అటువంటి గిరిజన సమాజం వనవాసీ కళ్యాణ్ ఆశ్రమ్ నుంచి ఎటువంటి సహాయం అవసరమైన స్థితిలో ఉంది?
కళ్యాణాశ్రమ్ చేసే సేవలు చూస్తే, మేం ప్రాథమికంగా విద్యారంగంలో పనిచేస్తుంటాం. ఒక పాతిక ముప్ఫయ్ ఏళ్ల కిందట చూస్తే, ప్రాథమిక విద్యా వ్యవస్థ లేని చోట ఈ వ్యవస్థను ప్రారంభించాం. అయితే, బడికి ఇవాళ వచ్చిన పిల్లలు మర్నాడు కనిపించరు. సెలవులిచ్చినప్పుడు ఇంటికి వెళ్లిన పిల్లలు తిరిగి బడికి రానే రారు.. టీచర్లు పిల్లల ఇంటికెళ్లి పాఠశాలను తెరిచాం రమ్మని పిలిస్తే, మమ్మల్ని రమ్మని పిలవలేదు కదా.. అని నవ్వుతూ చెప్పేవారు. నాడు ఆ ప్రాంతాల్లో పిల్లలు చదువు కోవడం అనేది వారికంటే కూడా కళ్యాణాశ్రమానికి అవసరం అన్నట్టుండే పరిస్థితి ఉండేది. నేడు ఆ పరిస్థితి మారింది. గిరిజన బాలలు చక్కగా చదువుకుంటున్నారు. ప్రభుత్వం వైపు నుంచి కూడా మెరుగైన వసతులు సమకూరాయి. ఈ క్రమంలో కళ్యాణాశ్రమం ద్వారా ఫార్మల్ స్కూల్స్, కోచింగ్ సెంటర్లు అక్కడ నడుస్తున్నాయి. దేశవ్యాప్తంగా వేలాది మంది పిల్లలు చదువుకుంటున్నారు. వారి ఆకాంక్షల మేరకు వైద్యం, ఐటీ, ఐఐటీలోకి వెళ్లేందుకు శిక్షణ ఇస్తున్నాం. అవన్నీ వారు సాధిస్తున్నారు. ప్రభుత్వ పరీక్షలు రాసి సర్కారు ఉద్యోగాల్లోకి కూడా వెళుతున్నారు. బ్యాంకింగ్, రెవెన్యూ విభాగాల్లోకి ప్రవేశిస్తున్నారు. అలాగే ఆరోగ్య విభాగం, గ్రామ వికాస కార్యకలాపాల్లోనూ కళ్యాణాశ్రమ్ సేవలందిస్తోంది. పట్టణాల్లో చదువుకునే వనవాసీ పిల్లల కోసం వసతి గృహాలు నిర్వహిస్తున్నాం.
వనవాసులను హిందూ సమాజం నుంచి దూరం చేసే ప్రయత్నం ఒకవైపు వేగంగా జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో వనవాసులతో పాటు, వారి ధర్మ సంస్కృతి పరిరక్షణకు కల్యాణ్ ఆశ్రమ్ ఏం చేస్తోంది. ఇందులో హిందూ సమాజ కర్తవ్యం ఏమిటి?
గిరిజన సమాజం అనేది హిందూ సమాజం నుంచి విడదీయలేని అవిభాజ్య మూలం. వారు (గిరిజన సమాజం) మన ధర్మాన్ని రక్షించారు. ఆ సమాజం ఎప్పటికీ మన నుంచి వేరు కానే కాదు. అయితే ఇక్కడ భారతీయ ఆలోచన, పాశ్చాత్య ఆలోచన అనేవి రెండున్నాయి. ఈ రెండవది సెమెటిక్ మతం. ఇది ఏమంటుందంటే, ఒక ధర్మం (మతం) అనేది ఉందంటే కచ్చితంగా ఒక ధార్మిక గ్రంథం కూడా ఉండి తీరాలి. అది కూడా ఒక్కటే పుస్తకం ఉండాలి, రెండు మూడు ఉండరాదంటుంది. దేవుడు ఒక్కరే ఉండాలి, రెండవ దేవుడు ఉండరాదంటుంది. ఒకే పద్ధతిలో ప్రార్థన చెయ్యాలి, అప్పుడే ఆ దేవుడు ప్రసన్నమవుతారు. మరొకటేమిటంటే, నిశ్చయించిన ప్రకారమే ప్రార్థనా స్థలం ఉండాలి. ఆ మతానికి ఒక వ్యవస్థాపకులు కూడా ఉండాలి. ఇదీ సెమెటిక్ మతం. ఇక భారతీయ విధానాన్ని చూస్తే, మన హిందూ ధర్మం ఎప్పుడు మొదలైంది? భూమి పుట్టి మానవుడు పాదం మోపినప్పటి నుంచీ మన ధర్మం ఉందని విశ్వసిస్తాం. ఒకే గ్రంథం, ఒకే దేవుడు, ఒకే పూజా స్థానానికి పరిమితం కాదు. ఇందువల్ల దీన్ని అర్థం చేసుకోవడం పాశ్చాత్యులకు సాధ్యం కాలేదు. అది వారి సమస్య, మనది కాదు. కానీ, వారు మాత్రం మాకు ఒకడే దేవుడు, మీకు ఇంతమంది ఉన్నారు.. మాకు ఒకటే మత గ్రంథం, మీకు మత గ్రంథం ఏది? అంటూ వాదిస్తారు. మనవాళ్లు వీటిని క్షుణ్ణంగా తెలుసుకున్నవారు కాకపోవడంతో జవాబిచ్చే పరిస్థితి ఉండదు. మరోవైపు భారతదేశంలోని సామాజిక వ్యవస్థను గమనిస్తే, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా గిరిజన గ్రామాలు అడవుల్లో ఎక్కడో ఉంటాయి. భారతీ యులు స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న రోజుల్లో క్రైస్తవ మిషనరీలు ఆ గ్రామాలకు వెళ్లి తామెంతో దూరం నుంచి వచ్చి సేవ చేస్తున్నామని చెప్పేవారు. 1947లో మనకు స్వాతంత్య్రం వచ్చాక ఠక్కర్ బప్పాజీ వనవాసి సమాజంలో భారతీయ ఆదిమ్‌జాతి సేవక్ సంఘ్ పేరిట సేవాకార్యం చేపట్టారు. 1952లో కళ్యాణాశ్రమ్ సేవలు ప్రారంభ మయ్యాయి. స్వాతంత్య్రం వచ్చిన వెంటనే వనవాసీ కార్యాన్నే ప్రాధాన్యంగా తీసుకున్నాం. రాజ్యాంగంలో బాబా సాహెబ్ అంబేద్కర్ కూడా ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక గుర్తింపునిచ్చారు. ఆర్టికల్ 341 ఎస్సీలకు, 342 ఎస్టీలకు హోదానిచ్చింది. విద్య, ఉద్యోగాలు, పదోన్నతుల్లో రిజర్వేషన్ కల్పించారు. అసెంబ్లీలు, పార్లమెంట్ ఎన్నికలప్పుడు పోటీ చెయ్యడానికి ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పరిచారు. తద్వారా వారి వికాసానికి మార్గం ఏర్పరిచారు. అయినప్పటికీ, అన్యమతస్తులు వారి మనసు విరిచేలా అక్కడ అభివృద్ధి ఏమీ జరగలేదని, మా మతంలోకి వస్తే ఇంకా బాగుపడతారని మాయమాటలు చెప్పి మతమార్పిడులకు పాల్పడుతున్నారు. కళ్యాణాశ్రమ్ విషయానికి వస్తే ప్రతి ఒక్క గిరిజన తెగకు సంబంధించిన వారసత్వ ధర్మం ఏదయితే ఉందో దాని సంరక్షణ, పరిరక్షణ, వికాసం కోసం పని చేస్తుంది. నేను గణేశున్ని పూజిస్తాను, అయితే నాగాలాండ్ వెళ్లినప్పుడు అక్కడి వారికి గణేశ పూజ నేర్పలేదు. అక్కడున్న అంగామీ అనే గిరిజన జాతివారిలో వారి సంప్రదాయ పూజా విధికి మాత్రమే ప్రాధాన్యతనిచ్చాను. మనకు అయ్యప్ప తెలుసు, వారు మరో పేరుతో పూజించే దైవం మనకు తెలియకపోవచ్చు. వారిలో పంటలు చేతికొచ్చాక భగవంతునికి ధన్యవాదాలు చెప్పే వేడుక ఒకటి ఉంది. నేను కూడా అందులో పాలుపంచుకున్నాను. మీరు రాణి గైడిన్ల్యు పేరు వినే ఉంటారు. ఆమె నాగాల సంస్కృతి పరిరక్షణ కోసం హరక్కా ఉద్యమాన్ని తీసుకువచ్చారు. నాగా ప్రజల మందిరాన్ని కిలొంకాయి అంటారు. వారు దైవాన్ని కింకావు అంటారు. అక్కడ జరిగే పూజల్లో నేనూ పాల్గొన్నాను. ఇక్కడ గోండు సమాజాన్ని తీసుకోండి. వారికంటూ ప్రత్యేక సంస్కృతి ఉంది. దీని వికాసం కోసం కూడా మేం పని చేస్తాం. మనం అంతటా దైవాన్ని చూస్తాము. సెమెటిక్ మతం దైవాన్ని అంతటా చూడదు. తాము ప్రార్థించే చోట మాత్రమే దేవుడున్నాడని నమ్ముతారు. కళ్యాణాశ్రమ్ కన్వర్షన్ చెయ్యదు, మన ధర్మాన్ని పరిరక్షిస్తుంది. ప్రతి తెగకు చెందిన పూర్వీకుల ధర్మం ఏదైతే ఉందో దానిని రక్షించుకోవాలి. ఈ క్రమంలో హిందువులు పాటించే ఆచారాలు వనవాసుల్లో లేవంటూ కొందరు మాట్లాడతారు. మరణించినవారి దేహాన్ని ఒకచోట ఖననం చేస్తారు, మరొక చోట దహనం చేస్తారు. అయితే ఏంటి? ఎవరి పద్ధతుల్లో వారు చేసుకుం టారు. అదేమీ సమస్య కాదు. అయితే, ఆయా తెగల జీవన ధర్మం కోసం పోరాడిన పెద్దలు ఎవరైతే ఉన్నారో వారిని జాతీయ వీరులుగా గౌరవిస్తాం. అందువల్ల భగవాన్ బిర్సాముండా కేవలం ముండా తెగవారికి మాత్రమే కాదు యావత్ భారతదేశానికే మహాపురుషుడు.
ప్రస్తుతం జన్ జాతీ సురక్షా మంచ్ సంస్థ డీ-లిస్టింగ్ డిమాండ్ కోసం పోరాడుతోంది. డీ-లిస్టింగ్ అంటే ఏమిటి?
ముందుగా డీ-లిస్టింగ్ డిమాండ్ సురక్షా మంచ్ చేపట్టింది కాదు. దానిని వీరు తమ చేతుల్లోకి తీసుకున్నారు. నిజానికి డీ-లిస్టింగ్ డిమాండ్ చేసినవారు కాంగ్రెస్ పార్టీకి చెందిన అత్యంత సీనియర్ నాయకుడు, ఒకప్పటి ఇందిరా గాంధీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కార్తీక్ ఓరాన్. ఆయన నేటి జార్ఖండ్ ప్రాంతానికి చెందిన గిరిజనుడు, మంచి తెలివితేటలున్న వ్యక్తి. ఇంగ్లాండ్‌లో ఇంజనీరింగ్ చేశారాయన. అక్కడి కంపెనీల్లో పని చేస్తూ పెద్ద పెద్ద ప్రాజెక్టుల్లో భాగస్వామిగా ఉన్నారు. ఇలాంటి వ్యక్తి మన దేశానికి సేవ చెయ్యాలంటూ నెహ్రూ ఆయన్ని స్వదేశానికి రప్పించారు. తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. 1967లో ఆయన పార్లమెంట్‌లో ఈ సమస్యను లేవనెత్తారు. షెడ్యూల్డు కులాలవారిని గుర్తిస్తున్న ఆర్టికల్ 341 సవరణ జరిగినప్పుడు, షెడ్యూల్ కులస్తులెవరైనా క్రైస్తవులుగా లేదా ముస్లింలుగా మతం మారితే వారికి ఇక షెడ్యూలు కులస్తులనే గుర్తింపు ఉండదని స్పష్టం చేయడం జరిగింది. అంటే, వీరికి రిజర్వేషన్ కూడా లభించదు. ఎందుకంటే, భారతీయ హిందు సమాజంలోని కులవ్యవస్థ క్రైస్తవం, ఇస్లాంలో లేదని, అంతా సమానమే అంటున్న క్రమంలో ఇందులోకి మతమార్పిడి జరిగిన షెడ్యూల్ కులస్తులకు ఆ గుర్తింపు ఇక ఉండదు. అయితే షెడ్యూల్డ్ తెగల (గిరిజన)ను గుర్తిస్తున్న ఆర్టికల్ 342లో వీరి మతమార్పిడికి సంబంధించిన ప్రస్తావన లేదు. అయితే, కార్తీక్ ఓరాన్ ఒక అధ్యయనం చేసినప్పుడు ఆయన గుర్తించింది ఏమిటంటే, తమ గిరిజన సమాజంలోని 80 శాతం వనవాసీ హిందువులు 20 శాతం ప్రయోజనాలు మాత్రమే పొందుతుండగా మతం మార్చుకున్న వనవాసీలు 80 శాతం ప్రయోజ నాలు అందుకుంటున్నారు. దీంతో హిందువులుగానే ఉన్న గిరిజనులకు అన్యాయం జరుగుతోంది. ఫలితంగా పూర్వీకులనుసరించిన హిందూ మతాన్ని పాటించేవారికి మాత్రమే రిజర్వేషన్ లభించాలని ప్రతిపాదన తెచ్చి జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేశారు. ఈ కమిటీ రెండేళ్ల పాటు 1968 నుంచి 1970 వరకూ దేశమంతా పర్యటించి, సమావేశాలు నిర్వహించి ఈ డిమాండ్ న్యాయమైనదన్న నిర్ణయానికి వచ్చింది. ఆ సమయంలో కార్తీక్ ఓరాన్ వద్ద ఈ డిమాండ్‌కి అనుకూలంగా 348 మంది ఎంపీల సంతకాలు కూడా ఉన్నాయి. మెజారిటీ ఉంది కానీ, విదేశీ శక్తుల ఒత్తిడి కావచ్చు, క్రైస్తవ లాబీ ఒత్తిడి కావచ్చు నాటి ప్రధాని ఇందిరా గాంధీ ఈ డిమాండ్ వైపు మొగ్గు చూపలేదు. దాంతో ఇది చల్లబడిపోయింది. నాటి నుంచి 55 ఏళ్లుగా పెండింగ్‌లోనే ఉండిపోయింది. 2006లో జన్ జాతీ సురక్షా మంచ్ వనవాసీ నేతలతో సమావేశమై ఈ అంశంపై చర్చించి 2009లో ఈ డిమాండ్‌కు మద్దతుగా 26 లక్షల మంది గిరిజన ఓటర్ల సంతకాలు తీసుకుంది. వాటితో నాటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌కి మెమోరాండం సమర్పించింది. దేశంలో ఇలాంటి ఒక అన్యాయం జరుగుతోందని ఆమెకు కూడా తెలీదు. ఆమె కూడా ఇందుకు అనుగుణంగా స్పందించినప్పటికీ కార్యాచరణ జరగలేదు. ఇది రాజకీయంగా తీసుకోవలసిన నిర్ణయం. తర్వాత గత కొన్నేళ్లుగా సురక్షా మంచ్ ద్వారా జిల్లా స్థాయిలోను, కింది స్థాయుల్లోను ర్యాలీలు జరిగాయి. తెలంగాణలోని ఆదిలాబాద్ ప్రాంతంలో కూడా దాదాపు 20 వేలమంది గిరిజనులతో ప్రదర్శనలు జరిగాయి. బహుశా అది తెలంగాణలోనే పెద్ద ర్యాలీ కావచ్చు. ఆ విధంగా 22 రాష్ట్రాల్లోనూ ర్యాలీలు జరిగాయి. దీంతో ఈ డిమాండ్ సజీవంగా నిలిచింది. మన ధర్మ సంస్కృతిని నిలిపే ఈ పని జరగాలని, ఇది భారతదేశానికి ఎంతో ఆవశ్యకమని అందరూ విశ్వసిస్తున్నారు. సురక్షా మంచ్ ఈ పోరాటం చేస్తూ 450 మంది ఎంపీలను నేరుగా కలిసింది,, వారిలో చాలామంది దీనికి మద్దతు తెలిపారు.
వచ్చే మే నెలలో ఢిల్లీ వేదికగా భారీ ఎత్తున డీ-లిస్టింగ్ ర్యాలీ జరుగనుంది కదా… దీని గురించి మాకు కాస్త సమాచారం ఇవ్వండి..
ఈ ర్యాలీ ఇప్పటి వరకూ చాలా రాష్ట్రాల్లో జరిగింది. అయితే, ఈ గళం ఢిల్లీ వరకూ చేరలేదు. ఢిల్లీ మీడియా అంటే అది ప్రధాన స్రవంతితో ముడిపడిన జాతీయ మీడియా అని చెప్పాలి. ఈ కారణంగా అక్కడ ఈ డిమాండ్‌పై గళమెత్తడం కోసం సురక్షా మంచ్‌లోని గిరిజన నేతలందరూ రాయ్ పూర్‌లో సమావేశమయ్యారు. తర్వాత ఛత్తీస్‌గఢ్‌లో మరోచోట కూడా సమావేశం నిర్వహించారు. వేర్వేరు రాష్ట్రాల్లో ర్యాలీలు జరిగిన తర్వాత ఈ గళం ఢిల్లీని తాకాలని ఈ నేతలు నిర్ణయించుకున్నారు. అదృష్టవ శాత్తూ గత రెండు మూడేళ్లలో ఈ డీ-లిస్టింగ్ అంశంపై పార్లమెంటులో కూడా చర్చ జరిగింది. ప్రశ్నలు అడగడం కూడా జరిగింది. ఈ ర్యాలీ అనంతరం కేంద్ర ప్రభుత్వం కూడా సరైన ఆలోచన చేయగలదు.
కేంద్రంలో ఇప్పుడు ఒక బలమైన ప్రభుత్వం ఉన్నందువల్ల కశ్మీర్, రామమందిరం, ట్రిపుల్ తలాక్ విషయాల్లో చేసినట్లే, డీ-లిస్టింగ్ విషయంలోనూ న్యాయం జరుగుతుందని గిరిజన నేతలందరూ నమ్మకంతో ఉన్నారు. ప్రజల మనో భావాలకు అనుగుణంగా నడిచే ఒక ప్రభుత్వానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం వహిస్తున్నారు. ఆయన ముందుకు ఈ డిమాండ్ ప్రత్యక్షంగా వెళ్లాల్సి ఉంది. అందుకే ఈ ప్రయత్నమంతా. ఇదేమీ రాజకీయ ర్యాలీ కాదు. ఇది గిరిజన సమాజపు మనోభావ వ్యక్తికరణ. మన ధర్మం పట్ల విశ్వాసంతో మన సంస్కృతిని ఆచరించే వారికే రిజర్వేషన్ లభించాలి. ఈ ఆకాంక్ష, ఆశయంతోనే ఈ ర్యాలీలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ దీనిని స్వాగతిస్తు న్నారు.
వనవాసీ క్షేత్రాల్లో మీ విస్తృత పర్యటనలు, అనుభవాల నుంచి ఒక మరచిపోలేని సంఘటన ఏదైనా మాతో పంచుకోండి
నేను నాగాలాండ్‌లో పనిచేస్తున్నప్పుడు మేం ఊరూరూ తిరిగేవారం. రాణి గైడిన్ల్యూ ప్రారంభించిన హరక్కా ఉద్యమం గురించి నేను ఇంతకు ముందు చెప్పాను కదా.. ఆ ఉద్యమకారులు ధర్మప్రచారం కోసం ఊరూరూ వెళ్లేవారు. నాకూ అందులో పాల్గొనే అవకాశం వచ్చింది. అంతా పాదయాత్రే. ఆ సమయంలో నాగాలాండ్ – మణిపూర్ సరిహద్దుల్లో ఉన్న మగువాం అనే గ్రామానికి వెళ్లాము. మా కార్యక్రమంలో భాగంగా అక్కడి ప్రతి కుటుంబాన్నీ కలుసుకొని వారి యోగక్షేమాలను విచారించాలి. ఒక ఇంట్లో ఒక ఒంటరి వృద్ధురాలున్నారు. ఆమెకు ఇంకెవరూలేరు. ఆమెకు అనారోగ్యంగా ఉందని తెలిసింది. నాతో ఉన్న ఒక నాగా కార్యకర్త ఆమెకు 10 బిళ్లలున్న పారాసిటమాల్ స్ట్రిప్ ఇచ్చాడు. ఆమె తన జబ్బు తగ్గడానికి నాలుగు బిళ్లలు చాలని, 10 అవసరం లేదని చెప్పింది. మా కార్యకర్త, మీకు అవసరపడవచ్చు ఉంచుకోమ్మా… అని చెప్పాడు. ఆమె నిరాకరిస్తూ నాకు నాలుగు చాలంటూ మిగిలినవి ఎవరికైనా పనికి వస్తాయని చెప్పి ఆరు బిళ్లలు తిరిగిచ్చేసింది. పైగా తన వద్ద ఈ మందులకు ఇవ్వడానికి డబ్బులు లేవంది. మా కార్యకర్త డబ్బులు అవసరం లేదని, మీ ఆశీర్వాదాలు ఇవ్వండి చాలు అని చెప్పాడు. కానీ ఆమె నేను ఏదీ ఉచితంగా తీసుకోను అంటూ తన ఇంట్లో ఉన్న 3 కోడిగుడ్లు తెచ్చి మాతో ఉన్న ఆ కార్యకర్తకు ఇచ్చింది. నేను ఇదంతా చూస్తున్నాను. మనం ఎవరినైతే వెనుకబడిన వారు అని అంటున్నామో.. వారిలో వ్యక్తమైన అత్యున్నత ధార్మిక గుణం ఇది. ఇప్పుడు చెప్పండి ఎవరు అనాగరికులు… ఎవరికి ఎవరు ఏమి నేర్పాలో..?

ఇంటర్వ్యూ: గుళ్ళపూడి శ్రీనివాస కుమార్
డిజిటల్ ఎడిటర్, జాగృతి





