నిత్యజీవితంలో ప్రతి ఒక్కరూ కోరుకునేవి కొన్ని ఉంటాయి. వాటిలో ఐశ్వర్యం ఒకటి ధన ధాన్యాదులు మాత్రమే ఐశ్వర్యం కాదు. వ్యక్తుల మనుగడ, ఉన్నతి, అభివృద్ధి, ఆధ్యాత్మిక ఆలోచనలు తదితరాలకు దోహదం చేసేవన్నీ ఐశ్వర్యాలే ఐశ్వర్యాన్ని విభూతి అంటారు. ఇది రెండు రకాలు- భూతి, విభూతి అని ఈ లోకంలో అనుభవానికి వచ్చే సంపదలను ‘భూతి’ అని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కలిగించే ఆలోచనలను ‘విభూతి’ అని అంటారు. ఈ రెండు రకాల ఐశ్వర్యాలనూ ప్రసాదించేది భస్మ రూపంలో ఉండే విభూతి ధారణ.
విభూతి ధారణ అపమృత్యు భయాన్ని తొలగించి శుభాలు కలగజేస్తుందని, సకల సంపత్కరమైనదని ఒక శ్లోకంలో చెప్పారు పౌరాణికులు. వేదాలు, పురాణాలు విభూతి ధారణ మహిమను ముక్త కంఠంతో చాటుతున్నాయి.
భస్మ ధారణ చేసినవారికి దుష్ట గ్రహాలు, పిశాచ పీడలు, రోగాలు, పాపాలు దరిచేరవు. ధర్మబుద్ధి, బాహ్య ప్రపంచ జ్ఞానం కలుగుతాయంటారు. విభూతిని నొసట ధరించి శివ పంచాక్షరి మంత్రాన్ని ప్రతి నిత్యం పరించేవారికి ఎంతోమేలు జరుగుతుందని యోగ శాస్త్రం చెబుతోంది.కారణాంతరాల వల్ల నీటితో స్నానం చేసే అవకాశం లేనివారికి విభూతి స్నానాన్ని సూచించాయి. శాస్త్రాలు, క్రమ పద్ధతిలో విభూతిని ఒంటికి రాసుకోవడాన్ని విభూతి స్నానం అంటారు.
విభూతి ధరించినవారికి పైన వివరించిన విభూతి ఆవిర్భావ విధానం మదిలో మెదిలి, మనసులోని ఇతర వ్యాపకాలన్నింటినీ స్వచ్చందంగా విడిచి పెట్టేసి తమంత తాముగానే పవిత్ర హృదయులవుతారు. ఆ నిశ్చలతత్వ స్థితికి చేరినవారికి అంతా శాంతే. దాన్ని మించిన ఐశ్వర్యం లేదు. పై భావాలనే భగవద్గీత విభూతి యోగం బోధిస్తోంది. అందువల్లనే దానికా పేరు వచ్చింది.





