
వైశాఖ శుద్ధ షష్టి తిథిని పురస్కరించుకుని సోమవారం దుర్గగుడిలో వల్లీ, దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి లీలా కల్యాణోత్సవం జరిగింది. ఆర్జిత సేవల కింద నిర్వహించిన ఈ కార్యక్రమానికి భక్తులు హాజరై స్వామికి మొక్కులు చెల్లించుకున్నారు. వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ భక్తుల నామస్మరణ మధ్య కల్యాణోత్సవ క్రతువు అర్చకులు వేదోక్తంగా నిర్వహించారు. ఈవో కేఎస్ రామారావు కల్యాణానికి పట్టువస్త్రాలను సమర్పించారు. వివిధ ఉపచారాల అనంతరం కల్యాణోత్సవంలో భాగంగా జీలకర్ర బెల్లం సమర్పణ, మంగళసూత్రాల సమర్పణ, తలంబ్రాల సమర్పణ, మంగళ ఆశీస్సుల అనంతరం హారతులు సమర్పించారు.
ఈవో ఆకస్మిక తనిఖీలు
దుర్గగుడిలోని వివిధ విభాగాలను ఈవో రామారావు ఆకస్మిక తనిఖీ చేశారు. భక్తుల అభిప్రాయాలను ఈవో అడిగి తెలుసుకున్నారు. దర్శన క్యూలు, లగేజీ కౌంటర్లు, చెప్పుల స్టాండ్లు, మజ్జిగ పంపిణీ పాయింట్లలో పరిశీలించి సూచనలు చేశారు. భక్తులకు మరింత మెరుగైన సేవలందించాలని, సామాన్య భక్తులే మొదటి ప్రాధాన్యత అని పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సేవలందించడంపై దృష్టి పెట్టాలని సూచించారు.





