News

మహవీర్‌ జయంతి సందర్భంగా శోభాయాత్ర

332views

మహావీర్‌ జయంతిని పురస్కరించుకొని విజయవాడ వన్‌టౌన్‌లో జైనులు నిర్వహించిన శోభాయాత్ర ఆదివారం వైభవంగా జరిగింది. భగవాన్‌ మహావీర్‌ జన్మకల్యాణిక్‌ వేడుకలను పురస్కరించుకొని వన్‌టౌన్‌లోని వివిధ జైన్‌ ఆలయాల్లో పలు విశేష పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సంభవనాథ్‌ జైన్‌ శ్వేతాంబర్‌ మూర్తిపూజక్‌ సంఘ్‌, శ్రీ సంభవనాథ్‌ రాజేంద్రసూరి జైన్‌ శ్వేతాంబర్‌ ట్రస్ట్‌ల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం వన్‌టౌన్‌లో భారీ శోభయాత్రను నిర్వహించారు. మార్వాడీగుడి వీధిలోని ఆలయం నుంచి ప్రారంభమైన ఈ శోభాయాత్రలో జైనులు వందలాదిగా పాల్గొని నృత్యాలు చేస్తూ మహావీర్‌ను స్మరించుకుంటూ ముందుకు సాగారు. మహిళలు, పురుషులు జైన సంప్రదాయ వస్త్రధారణలో ఈ శోభాయాత్రలో పాల్గొన్నారు. అదేవిధంగా వెండి రథంలో మహావీరుని విగ్రహాన్ని జైనులు ఊరేగించారు. వాటితో పాటుగా భగవాన్‌సంభవనాథ్‌, పూజ్యగురు రాజేంద్రసూరి తదితరుల చిత్రపటాలను రమణీయంగా అలంకరించిన వాహనాలపై ఉంచి శోభాయాత్రలో ఊరేగించారు. ఈ సందర్భంగా జైనులు నివసించే ప్రాంతాల్లో వారి ముందుకు వచ్చిన మహావీరుని విగ్రహాలకు వారివారి సంప్రదాయరీతిలో నేలపై పీటలు ఉంచి బియ్యం చల్లి స్వాగతం పలికారు. అలాగే మొక్కులు సమర్పించుకున్నారు. ఈ శోభాయాత్ర మెయిన్‌బజార్‌, సామారంగంచౌక్‌, రమణయ్య కూల్‌డ్రింక్‌షాప్‌ సెంటర్‌, హిందూహైస్కూల్‌, సుబ్బరామయ్యవీధి, ఆర్‌ఆర్‌వీధి తదితర ప్రాంతాల మీదుగా తిరిగి జైన్‌ దేవాలయానికి చేరుకుంది. కార్యక్రమంలో శ్రీ సంభవనాథ్‌ జైన్‌ శ్వేతాంబర్‌ మూర్తి పూజక సంఘ్‌ అధ్యక్షుడు ప్రవీణ్‌ కుమార్‌ బోడోతరియా, కార్యదర్శి పన్నాలాల్‌ జైన్‌, శ్రీ సంభవనాథ్‌ రాజేంద్రసూరి జైన్‌ శ్వేతాంబర్‌ ట్రస్ట్‌ అధ్యక్ష, కార్యదర్శులు రాజీవ్‌సోలంకి, నరేంద్ర రాథోడ్‌ కోశాధికారి రికిబ్‌చంద్‌జైన్‌ తదితరులు పాల్గొన్నారు. .