NewsProgramms

విశాఖలో వైభవంగా సంస్కృత జనపద సమ్మేళనం

239views

విశాఖ జిల్లా సంస్కృత భారతీ ఆద్వర్యంలో ఆదివారం వైభవంగా విశాఖ సంస్కృత జనపద సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించినట్లు సంస్కృతభారతీ, కార్యదర్శి డాక్టర్ మల్లాది శ్రీనివాస శాస్త్రి తెలిపారు. విశాఖ జిల్లాలోని విశాలాక్షి నగర్ లోని బి వి కే కళాశాలలో నిర్ఈవహించిన ఉత్సవంలో సంస్కృత భాషాభిమానులు మూడు వందల మందికి పైగా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా సంస్కృత విజ్ఞాన ప్రదర్శన, వస్తు ప్రదర్శన, పుస్తక ప్రదర్శన, యోగ విద్యా ప్రదర్శన, సంస్కృత వస్త్ర ప్రదర్శన (రసాయనాలు లేని ఆయుర్వేద వన మూలికల నుండి తీసి అద్దిన రంగులతో చేసిన చేనేత వస్త్రాలు), గ్రీష్మ ఋతువులో ఉపయోగ పడే శీతల ఔషధాలతో తయారు చేసిన ఆహార ద్రవ్య ప్రదర్శన వంటి ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి సంస్కృత భాషలో నిర్వహించిన హాస్య నాటికలు, నృత్యములు, గీతములతో అద్భుతమైన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి.

ఈ సందర్బంగా సంస్కృత భారతి, ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షులు డా.సుందర్ రాజ పెరుమాళ్ మాట్లాడుతూ మానవ స్థితి నుండి దైవ స్థితికి ఎదగడానికి కావలసిన జ్ఞాన సర్వస్వం అంతా సంస్కృత భాషా వాఙ్మయంలో ఉందని, సంస్కృతం నేర్చుకోవడం ద్వారా ఉన్నత స్థితికి వెళ్ళాలని అన్నారు.

ప్రతి గృహం సంస్కృత గృహంగా మారి విశాఖ నగరాన్ని సంస్కృత నగరంగా మార్చాలి అని ప్రాంత కార్య కారిణి సదస్యులు మహీధర నాగేశ్వర రావు ఈ సందర్బంగా పిలుపు నిచ్చారు.

PVN మాధవ గారు మాట్లాడుతూ సంస్కృత భాషను నేర్చుకోవడం ద్వారా మనందరం భారతీయ సనాతన సంస్కృతిని రక్షించుకోవలసిన అవసరం చాలా ఉంది అని పేర్కొన్నారు.

సంస్కృత ప్రచార పరిషత్ కార్యదర్శి వావిలాల మురళీ కృష్ణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంస్కృత విద్యను పాఠశాలలో, కళాశాలలలో తొలగించడానికి చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుకుని సంస్కృతాన్ని కాపాడుకోవడానికి అందరూ ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

సంస్కృత భారతి ద్వారా అయోజితమైన ఈ కార్యక్రమంలో గాయత్రి విద్యా పరిషత్ కార్యదర్శి పి సోమరాజు గారు, మాజీ ఎంఎల్‌సి పివీయన్ మాధవ్, కార్పరేటర్ శ్రీమతి పెద్దిశెట్టి ఉషా శ్రీ, డా సామలేటి సునీత, భాగవతుల ట్రస్ట్ కార్య దర్శి భాగవతుల శ్రీ రామ మూర్తి, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ సహ ప్రాంత ప్రచారక్ జనార్ధన్‌లతో పాటు అనేకమంది సంస్కృత అభిమానులు పాల్గొన్నారు.