ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రుల స్వదేశీ జాగరణలు – 62 ; కాళీపట్నం కొండయ్య

364views

ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధునిగా, వైజ్ఞానిక గ్రంథ రచయితగా, ప్రముఖ రసాయన శాస్త్రవేత్తగా ప్రసిద్ధి చెందిన కాళీపట్నం కొండయ్య జనవరి 4, 1901న అత్తిలి సమీపంలోని ఈడూరు గ్రామంలో జన్మించారు.

1920-22లో కాకినాడ పి.ఆర్. కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతుండగా గాంధీ మహాత్ముని స్వాతంత్ర్యోద్యమ పిలుపు కొండయ్యపై అమిత ప్రభావం చూపింది. తణుకు నందలి జాతీయ విద్యాలయంలో కొంతకాలం అధ్యాపకునిగా చేశారు. తరువాత బెనారస్ హిందు విశ్వవిద్యాలయంలో చేరి బి.యస్సీ, తరువాత రసాయన శాస్త్రంలో ఎం.యస్సీ పరీక్షలలో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణులైనారు. పిమ్మట మదనమోహన్ మాలవ్యాగారి ఎంపికతో అదే విశ్వ విద్యాలయంలో రసాయనశాస్త్ర అధ్యాపకునిగా సుమారు 4 సంవత్సరాలు పనిచేశారు.

1930లో గాంధీజీ ఉప్పు శాసనోల్లంఘన సమరశంఖారావంతో విశ్వ విద్యాలయ అధ్యాపక వృత్తిని విడిచి స్వాతంత్ర్యోద్యమంలో ప్రవేశించారు. 1930-32లో సంవత్సరాల మధ్య ఆంగ్ల రాక్షసపాలనపై నిప్పులు చెరిగి, యువతలో విప్లవ జ్వాలలు రేకెత్తించిన ‘వీరభారతి’ సైక్లో స్టైల్ద్ రహస్య వారపత్రిక ప్రచురించిన విప్లవ వీరుడు కొండయ్య, అల్లూరి సత్యనారాయణరాజు, తనికెళ్ళ వెంకటచలపతి వంటి మిత్రుల సహాయంతో “వీరభారతి’ పత్రిక ప్రతులను జిల్లా అంతటా అందేటట్టు చేశారు. ‘వీరభారతి’ మూలస్థావరం కనుగొనటానికి ఆంగ్ల ప్రభుత్వం విశ్వ ప్రయత్నం చేసింది.ఉద్యమకారుల్ని, గ్రామ ప్రజల్ని వేధించి భయభ్రాంతులను చేసినా ఫలితం లేకపోయింది. 1932లో శాసనోల్లంఘన ఉద్యమం అన్ని స్థాయిలలోని కాంగ్రెస్ సంఘాలను ఆంగ్ల ప్రభుత్వం నిషేధిత సంస్థలుగా ప్రకటించటంతో కాంగ్రెస్ వారు సమావేశమగుటకు అవకాశాలు లేకపోయినవి. దానితో కాళీపట్నం కొండయ్య ‘రామదండు’ అనే పేరుతో ‘భజన సమాజం’ స్థాపించారు. ఈ దండు సభ్యులందరూ కాషాయవస్త్రాలు ధరించి, పగలు భజనలు చేసుకుంటూ గ్రామాల వెంట తిరిగేవారు. రాత్రి ఉద్యమ ప్రబోధం చేస్తూ సత్యాగ్రహులను చేర్చుకునేవారు.

1932 జూన్ 27న ప్రభుత్వ శాసనాల్ని ధిక్కరిస్తూ పశ్చిమగోదావరి జిల్లా కాంగ్రెస్ సంఘ సమావేశం భీమవరంలోని శ్రీరామపురంలో జరిపారు. ఈ సమావేశ వివరాలను కొండయ్య ‘వీరభారతి’ పత్రికలో తెలియచేశారు. పసల కృష్ణమూర్తి ఆద్యక్షునిగా, కాళీపట్నం కొండయ్య ఆహ్వాన సంఘాధ్యక్షునిగా జరిగిన ఈ రహస్య సమావేశం యువతలో ఎంతో ఉత్సాహాన్ని నింపింది. సమావేశానంతరం కొండయ్య నాయకత్వంలో 150 మంది కాంగ్రెస్ ఉద్యమకారులు దేశభక్తి గీతాలను ఆలపిస్తూ భీమవరం సబ్ కలెక్టరు ఆఫీసుకు వచ్చారు. కలెక్టరు భవనం పైకి ఎక్కి కాంగ్రెస్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. కుపితులైన పోలీసులు కొండయ్యను, మిగిలిన కార్యకర్తలను రక్తసిక్తమయ్యేలా తీవ్రంగా లాఠీచార్జి జరిపారు. ఈ సందర్భంలో కొండయ్యతోసహా 45 మంది యోధుల్ని పోలీసులు అరెస్టు చేశారు. కొండయ్యకు 1 సంవత్సరం కఠిన కారాగార శిక్షను రాజమండ్రి, బళ్ళారి, మధురై జైళ్ళలో అమలు జరిపారు. జైలు నుండి విడుదలైన తరువాత కొండయ్య మరలా బెనారస్ హిందు విశ్వవిద్యాలయానికి వెళ్ళారు. విశ్వవిద్యాలయ అధికారులు కొండయ్యను, స్వాతంత్ర్యోద్యమంలో అతని త్యాగాన్ని ప్రశంసించి అధ్యాపకవృత్తిలో తిరిగి నియమించారు. 1943 వరకు కొండయ్య విశ్వవిద్యాలయంలో అధ్యాపకునిగా పనిచేస్తూ రసాయనశాస్త్రంలో విస్తృత పరిశోధనలు జరిపారు. గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ రంగంలో పనికిరావని వదిలివేసే అరటి బొందలు, పుగాకు కాడలు, నువ్వుల కంప మున్నగువాటిని ఉపయోగించి పొటాషియం పర్మాంగనేట్ మున్నగు రసాయనిక పదార్థాలను తయారుచేశారు. మహాత్ముడు కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని ఏర్పరచాలని సంకల్పించి తాను విశ్వ విద్యాలయంలో పరిశోధించిన విజ్ఞానాన్ని ఆచరణలో ప్రజలకు అందజేయడానికి 1943లో తన ఉద్యోగానికి రాజీనామా గావించి నిడదవోలు చేరారు.

1943లో నిడదవోలులో కెమికల్స్ లిమిటెడ్ అనే రసాయనిక ద్రవ్యాల తయారీ కంపెనీని స్థాపించి తన జీవితాన్ని ఆ సంస్థ ఉద్ధరణకై అర్పించారు. జాతీయ, అంతర్జాతీయ కంపెనీలకు దీటుగా మంచి నాణ్యతతో, అతితక్కువ ఖర్చుతో 1. పొటాషియం పర్మాంగనేట్, 2. సోడియం బై కార్బోనేట్, 3. మెగ్నీషియం సల్ఫేట్, 4. మాంగనీస్ సల్ఫేట్, 5. బ్లాక్ ఆక్సైడ్ మున్నగువాటిని తయారుచేసే విధానం కొండయ్యగారు కనుగొనినా, స్వతంత్ర భారతదేశంలో కూడా ఆయన పరిశోధనలు తగిన గుర్తింపును పొందలేకపోయాయి. కొండయ్య ఎంతో ఆసక్తితో, ఆదర్శంతో, ప్రేమతో నెలకొల్పిన కెమికల్స్ లిమిటెడ్ సంస్థ చివరకు ఆయనను పీల్చిపిప్పి చేసింది. రెండవ ప్రపంచ యుద్ధానంతరం రసాయనికి పదార్థాల ధరలు అమాంతంగా తగ్గిపోయాయి. కొండయ్య తీవ్ర నష్టాల్ని భరిస్తూ, సంక్షోభాన్ని ఎదుర్కోవాలని సుమారు 15 సం||లు పరిశోధనలతో యుద్ధాన్ని చేసి ఓడిపోయాడు. దేశ స్వేచ్ఛ, స్వాతంత్ర్యాల కోసం ఆర్ధిక స్వయంసమృద్ధికోసం, గ్రామాల వికాసం కోసం జీవితాంతం పోరాడిన మహాయోధునికి చివరికి లభించిన ఫలితం ఇది. చివరకు 1962లో కెమికల్ ఇండస్ట్రీని మూసివేయక తప్పలేదు.

కొండయ్య మహా మేధావి, బహుభాషావేత్త ఎంతటి కఠినమైన విషయాన్నయినా సులభ గ్రాహ్యమయ్యేలా చెప్పగల, వ్రాయగల ప్రజ్ఞాశాలి. 1936లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ వ్రాసిన ‘ఇండియా స్ట్రగుల్ ఫర్ ఫ్రీడం’ ‘భారత స్వాతంత్య్రసమరం’ అనే గ్రంథాన్ని ఆంగ్ల ప్రభుత్వం నిషేధించింది. ఈ గ్రంథాన్ని కాళీపట్నం కొండయ్య తెలుగులోనికి అనువదించారు. చివరకు ఈ గ్రంథాన్ని కె.పి.యస్. రాజు, ఉద్దరాజు రామంగార్లు రంగూన్లో అచ్చు వేయించారు. తెలుగున ‘విశ్వరూపం’ అనే తొలి విజ్ఞాన గ్రంథాన్ని రచించిన ఘనత కొండయ్యదే. ఈ గ్రంథాన్ని ఆంధ్ర విశ్వవిద్యాలయం 1944లో ప్రచురించింది. ‘ఆఫ్రికా పంపకం’ అనే అంతర్జాతీయ రాజకీయ పరిశీలనా గ్రంథం, ‘మహ్మదీయ రాజ్యాలలో జాతీయవాదం’ అనే జాతీయ భావ ప్రేరేపిత గ్రంథం వీరి రచనలే. అనేక శాస్త్రీయ అంశాలను పొందుపరుస్తూ, ‘విశ్వ విజ్ఞానం’ అనే మాసపత్రిక వీరు నడిపారు.

ఆంధ్ర దేశంలో ఉజ్వలమైన విజ్ఞాన ప్రచారాన్ని సలిపి, అనేకమంది మనుగడకు మార్గదర్శకమైన మహాపురుషుడు కొండయ్య గారు నిరాశ, నిస్పృహల మధ్య 1966 మార్చి 3, తన 66వ ఏట పరమపదించారు.