
(ఏప్రిల్ 14 – డాక్టర్ భీమ్‌రావ్ రాంజీ అంబేద్కర్ జయంతి)
డాక్టర్ భీమ్‌రావ్ రాంజీ అంబేద్కర్ ఆధునిక భారతంలో దేశ ఐక్యతా పునాదులను బలంగా నిలబెట్టిన దూరదృష్టి కల ద్రష్ట. గడిచిన 17 వందల సంవత్సరాలుగా అస్పృశ్యత వల్ల అవమానాలకు గురి అవుతున్న దేశంలోని 17 శాతం హిందువుల సామాజిక సమానత్వం కోసం అంబేద్కర్ ఎన్నో జనజాగరణ ఉద్యమాలు నిర్వహించారు. మన దేశంలో గాంధీజీ నాయకత్వంలో జరిగిన స్వాతంత్ర ఉద్యమంలో హింసాత్మక సంఘటనలు చోట చేసుకున్నాయి. కానీ, డా.బి.ఆర్.అంబేద్కర్ నిర్వహించిన సామాజిక సమానతా ఉద్యమాలలో చుక్క రక్తంబొట్టు నేల చిందలేదు. అలా దేశంలో గత 17 వందల సంవత్సరాలుగా కొనసాగిన అస్పృశ్యత, వివక్ష, కుల అసమానతలను భారత రాజ్యాంగం ద్వారా వ్యవస్థాపూర్వకంగా నిర్మూలించిన ఘనత డా. అంబేద్కర్‌ది. అందువల్ల ఆయనను ప్రపంచంలోనే గొప్ప శాంతియుత ఉద్యమకారునిగా పేర్కొనవచ్చు.
భారత రాజ్యాంగ రూపకర్తగా పేరు తెచ్చుకున్న అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్‌లోని మౌ అనే గ్రామంలో జన్మించారు. రామ్‌జీ మలోజీ సక్పాల్, బీమాబాయి దంపతుల 14వ సంతానం అంబేద్కర్. వీరి వంశీకులు మహార్ కులానికి చెందినవారు. మెహర్లను అస్పృశ్యులుగా పరిగణించడం వలన అంబేద్కర్ చిన్నతనంలోనే అంటరానితనాన్ని ఎదుర్కొన్నారు. 1912లో బీఏ పరీక్షల్లో ఉత్తీర్ణుడైన తర్వాత కొలంబియా విశ్వవిద్యాలయంలో చేరి 1915లో ఎంఏ, 1916లో పీహెచ్డీ పట్టాలను పొందారు. 1917లో డాక్టర్ అంబేద్కర్‌గా స్వదేశానికి తిరిగివచ్చి కులవివక్షకు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించారు.
అంబేద్కర్ అనేక ఉద్యమాలు నిర్వహించిన తరువాత హిందూ సమాజంలో కాలానుగుణంగా మార్పురాదని ఆగ్రహించి, నిరాశకు గురై 1933లో ‘‘నేను హిందువుగా పుట్టాను, హిందువుగా మాత్రం చావను. ఏ మతంలో సమానత్వం ఉంటుందో ఆ మతాన్ని స్వీకరిస్తాను’’ అని బహిరంగ ప్రకటన చేశారు. ‘హిందువుగా చావను’ అని ప్రకటించినప్పటికీ డా.అంబేద్కర్ హిందూత్వానికి వ్యతిరేకంగా ప్రవర్తించలేదు. తన ‘కుల నిర్మూలన’ అనే ప్రసంగంలో ‘‘కులవిభజన వల్ల, కుల అసమానతల వల్ల, కుల వ్యవస్థ వల్ల హిందూ సమాజం సమైక్యంగా లేదు. ఫలితంగా మనం బానిసలమయ్యాం. విదేశీ పాలనలో వారి ఒత్తిడికి తట్టుకోలేక అనేకమంది ముస్లిం మతస్థులు కావలసివచ్చింది. అలా మారినవారంతా తిరిగి వెనక్కిరావాలంటే ఏ కులంలోకి రావాలి? వారు ఏ కులంలోకి రాగలరు? ఎవరైనా ఇతర మతస్థులు తమ మతం వదిలి హిందూమతంలోకి రావాలంటే నేటి కుల వ్యవస్థ వారి ప్రవేశానికి అడ్డుగా ఉంది. ఇది హిందూ సమాజానికి పెద్ద సమస్య,’’ ఇలా వారి మొత్తం ప్రసంగం హిందూ సమాజ హితం జరగాలనే కోణంలోనే సాగింది. హిందూ తత్వచింతనలో ఉన్న గొప్పతనాన్ని అంబేద్కర్ గుర్తించారు. ‘‘హిందూ తత్వచింతనలో మాత్రమే ‘దేవుడు అందరిలో ఉన్నాడు’ అనే ఆలోచన ఉన్నది. మరెక్కడా లేదు. ఈ ఆలోచన ద్వారా సామాజిక సమానత్వం సాధ్యం అవుతుంది. కాని హిందు తత్వచింతనలోని శ్రేష్ఠత్వానికి, ఆచరణలో ఉన్న అసమానతలకు ఈ అంతరమే ప్రధాన సమస్య. ఈ అంతరం పోవాలి,’’ అని అంబేద్కర్ కోరారు.
స్వాతంత్ర్య భారతం సిద్ధించిన తరువాత న్యాయశాఖా మంత్రిగా హిందూ కోడ్ బిల్‌ను డా. అంబేద్కర్ రూపొందించారు. ఈ సందర్భంగా హిందూ శబ్దం నిర్వచిస్తూ, ముస్లింలు, క్రైస్తవులు, పారశీకులు కాని భారతీయులందరూ హిందువులే అన్నారు. ఇలా హిందుత్వానికి విస్తృతమైన, సమగ్రమైన నిర్వచనం ఇచ్చారు. 1916లో భారతదేశంలో కులాల పుట్టుపూర్వోత్తరాలు అనే పరిశోధనా గ్రంథంలో కుల అసమానతలు ఉన్నా ప్రపంచంలోని ఏ సమాజంలో లేని సాంస్కృతిక ఐక్యత హిందూ సమాజంలో మాత్రమే ఉందని అంబేద్కర్ విశ్లేషించారు. హిందూ సమాజంలో చిచ్చుపెట్టడానికే ఆంగ్లేయ పాలకులు ‘ఆర్య-ద్రావిడ’ అనే నకిలీ సిద్ధాంతాన్ని కల్పించారని వివరించారు.
రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ ఆహ్వానం మేరకు 1939 మే 12న పూనాలోని శిక్షణా శిబిరాన్ని అంబేద్కర్ సందర్శించారు. ఆ శిబిరంలో 100కు పైగా షెడ్యూల్డ్ కులాల కార్యకర్తలు ఉండడం చూసి అంబేద్కర్ ఎంతో ఆనందించారు. తాను ఆశించిన సామాజిక సమానతా కార్యాన్ని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ మౌనంగా చేస్తున్నదని శ్లాఘించారు. ఇలా హిందూ సమాజ సంఘటన చేస్తున్న ఆర్.ఎస్.ఎస్. పట్ల అంబేద్కర్ సానుకూల దృక్పథం ప్రదర్శించారు. 1949 నవంబర్ 25న జరిగిన భారత రాజ్యాంగ కమిటీ తుది సమావేశంలో ప్రసంగిస్తూ, మనకు లభించిన స్వాతంత్ర్యం సుస్థిరంగా ఉండాలంటే కులము, ప్రాంతము, పార్టీ, సంస్థల ప్రయోజనాలకంటే దేశ ప్రయోజనాలకు పెద్దపీట వేయాలని అంబేద్కర్ స్పష్టం చేశారు.
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ షెడ్యూల్డు కులాల ఉన్నతి కోసం, సమానత్వం కోసం నిరంతరం పని చేస్తూనే భారత దేశ ప్రయోజనాల కోసం అహరహమూ శ్రమించారు. ఆ విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. అందుకే ఆయన భారత జాతీయ నాయకులలో ప్రత్యేకత సంతరించుకున్నారు.





