News

నెల్లూరులో పొణకా కనకమ్మ మహిళా యూనివర్సిటీ

278views

నెల్లూరులో ప్రముఖ స్వతంత్ర సమరయోధురాలు, తొలి బాలికల పాఠశాల నెలకొల్పేందుకు వందేళ్ల క్రితమే నేడు వేలకోట్ల రూపాయలు విలువచేసే స్థలాలను దానంగా సమకూర్చిన పొణకా కనకమ్మ స్మృత్యర్థం ఓ మహిళా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసి, దాని ద్వారా ఎల్ కె జి నుండి పిజి వరకు మహిళలకు ఉచితంగా విద్యా సౌకర్యం కల్పించాలనే ప్రతిపాదన పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సుముఖంగా స్పందించారు.

ఈ విషయమై ఆమె పేరుతో ఓ కేంద్రీయ మహిళా విశ్వవిద్యాలయం నెలకొలపాలని కోరుతూ పొణకా కనకమ్మ ఆశయసాధన కమిటీ కార్యదర్శి, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం మాజీ సెనేట్ సభ్యులు బి సురేంద్రనాథ్ రెడ్డి వ్రాసిన లేఖను ప్రధాన మంత్రి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపుతూ, ఆయన ప్రతిపాదనను పరిశీలించి, సాధ్యాసాధ్యాలపై ఓ నివేదిక పంపమని ఆదేశించారు.

వెంటనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ ప్రతిపాదనలను పరిశీలించి, సవివరమైన నివేదిక పంపమని జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్ ను ఆదేశించారు. కలెక్టర్ తక్షణం స్పందిస్తూ జిల్లా విద్యాశాఖాధికారి ఈ బాధ్యతలను అప్పచెప్పారు. సురేంద్రనాథ్ రెడ్డి వ్రాసిన లేఖలో పొణకా కనకమ్మ విరాళంగా ఇచ్చిన స్థలాల విలువ నేడు రూ 2,500 కోట్ల మేరకు ఉంటుందని తెలిపారు. వాటితో ఉచితంగా మహిళా విద్యకోసం విశ్వవిద్యాలయం కృషి చేయవచ్చని సూచించారు.