
చంద్రయాన్ 3 ప్రయోగంతో భారత్ ఖ్యాతి విశ్వవ్యాప్తం అయింది. ప్రపంచంలో ఏ దేశానికీ వీలు కాని విధంగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలు పెట్టిన దేశంగా భారత్ నిలవడంతో ఇస్రో సాధించిన ఘనతపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ చంద్రయాన్ సిరీస్‌లో తదుపరి ప్రయోగాన్ని చేపట్టడంపై ఇస్రో శాస్త్రవేత్తలు తలమునకలై ఉన్నారు.ఇక చంద్రుడిపై మరిన్ని పరిశోధనలు నిర్వహించేందుకు జాబిల్లిపైకి చంద్రయాన్ 4ను పంపించనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చీఫ్ ఎస్.సోమనాథ్ వెల్లడించారు. ఈసారి జాబిల్లిపై ఏకంగా 100 రోజుల పాటు ఉండేలా చంద్రయాన్ 4 ప్రయోగాన్ని రూపొందిస్తున్నామని చెప్పారు. అయితే అంతరిక్షం గురించి పరిశోధనలు చేయడం అనేది నిరంతరం జరిగే ప్రక్రియ అని తెలిపారు.
ఇక ఈ అంతరిక్ష రంగంలో భారతదేశం గొప్ప పురోగతి సాధిస్తోందని కొనియాడారు. పంజాబ్ లుధియానాలోని ఓ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న సోమనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రుడిపై తర్వాత ప్రయోగం చేపట్టేందుకు ఇస్రో కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. చంద్రయాన్ 4 ప్రయోగాన్ని 2040 లో చేపట్టాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. “ఇస్రో చంద్రుని కోసం తన మిషన్‌కు కట్టుబడి ఉంది. 2040ల ప్రారంభంలో ప్రధాని నరేంద్ర మోదీ చంద్రునిపై ల్యాండింగ్ చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. ఇస్రో నిరంతర అన్వేషణ మిషన్‌లో ఉంది” అని ఆయన చెప్పారు.
చంద్రయాన్-4ను విజయవంతంగా అమలు చేయడం ద్వారా చంద్రుని ఉపరితలం నుంచి నమూనాలను తిరిగి తీసుకురాగల సామర్థ్యాన్ని సాధించిన ప్రపంచవ్యాప్తంగా నాల్గవ దేశంగా భారతదేశం నిలిచే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రక్రియ ప్రారంభం అయినట్లు తెలిపారు. అంతరిక్ష పరిశోధనతో పాటు వివిధ సాంకేతిక అభివృద్ధి ప్రాజెక్టుల్లో దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులను భాగస్వామ్యం చేసేందుకు ఇస్రో ప్రయత్నాలు చేస్తోందని వివరించారు. చంద్రయాన్ సిరీస్‌లో తర్వాత చేపట్టబోయే చంద్రయాన్ 4 ప్రయోగం చాలా కీలకమైందని, భిన్నమైందని సోమనాథ్ వెల్లడించారు. ఈ చంద్రయాన్ 4 ప్రయోగంలో భాగంగా చంద్రుడిపైకి ల్యాండర్‌ను పంపించి వాటిని తిరిగి భూమి మీదకు తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ మిషన్‌లో భాగంగా జాబిల్లిపైన ఉండే రాళ్లు, మట్టి నమూనాలను భూమి మీదకు తీసుకురావాలని ఇస్రో భావిస్తోందని వివరించారు.




