
అమర్‌నాథ్ యాత్రికులు వెనక్కి వచ్చేయాలన్న భద్రతాపరమైన హెచ్చరికలతో కశ్మీర్‌లో తీవ్ర కలకలం రేగుతోంది. అనేక ఊహాగానాల నడుమ శ్రీనగర్ ఎన్‌ఐటీ యాజమాన్యం సెలవులు ప్రకటించింది. తదుపరి ఆదేశాలు అందేవరకు తరగతులు ఉండవని ఓ ప్రకటనలో తెలిపింది. ఇతర రాష్ట్రాల విద్యార్థులు స్వస్థలాలకు వెళ్లేందుకు జమ్ముశ్మీర్ ప్రభుత్వం ఉచిత ఏర్పాట్లు చేసింది. దీనిపై స్పందించిన ఎన్‌ఐటీ డీఎం సెలవులు ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో ఇచ్చినవి కాదని.. సాధారణ సెలవులుగానే భావించాలన్నారు. మరోవైపు విద్యాసంస్థల్ని మూసివేస్తున్నట్లు వస్తున్న వార్తల్ని రాష్ట్ర ప్రభుత్వం ఖండించింది. ఇప్పటివరకు అటువంటి ఉత్తర్వులేవీ జారీ చేయలేదని విద్యాశాఖ స్పష్టం చేసింది. అలాగే అమర్‌నాథ్ యాత్రికులను తరలించడానికి అన్ని విమానయాన సంస్థలు సిద్ధంగా ఉండాలని విమానయానశాఖ సూచించింది. అవసరమైతే శ్రీనగర్ నుంచి అదనపు సర్వీసులు నడపాలని కోరింది.
అయితే అదనపు బలగాల మొహరింపుపై అనేక ఊహాగానాలు వెల్లువెత్తున్నాయి. ఈ క్రమంలో వస్తున్న ఎటువంటి వదంతులను నమ్మవద్దని గవర్నర్ సత్యపాల్ మాలిక్ తెలిపారు. రాష్ట్రంలో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం సాయంత్రం జమ్ముకశ్మీర్‌కు చెందిన పలు పార్టీల నాయకులతో భేటీ అయ్యారు. లోయలో పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసిన వారికి.. గవర్నర్ వాస్తవ పరిస్థితులను వివరించారు. ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందన్న పక్కా సమాచారం మేరకే బలగాలను మొహరించారని తెలిపారు. అంతకుమించి ఎలాంటి వదంతులు వచ్చినా.. నమ్మొద్దని సూచించారు.
పర్యాటకులు, అమర్‌నాథ్ యాత్రికులు తక్షణం రాష్ట్రంలో పర్యటనను కుదించుకొని సాధ్యమైనంత త్వరగా వెనక్కి వెళ్లిపోవాలంటూ జమ్మూకశ్మీర్ పాలనా యంత్రాంగం శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. పాక్ ఉగ్రవాదులు, సైన్యం అమర్‌నాథ్ యాత్రను లక్ష్యంగా చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు నిర్దిష్ట నిఘా సమాచారం ఉందని సైన్యం, పోలీసులు ఉన్నతాధికారులు సైతం ధ్రువీకరించారు. దీంతో కేంద్రం అదనపు బలగాలను రాష్ట్రానికి తరలించింది. ఈ నేపథ్యంలో లోయలో ఒక్కసారిగా ఆందోళనకర వాతావరణం నెలకొంది. అయితే ఎలాంటి వదంతులు నమ్మవద్దని కేంద్రం స్పష్టం చేసింది.





