News

పాకిస్థాన్లో 72 ఏళ్ళ తర్వాత పునః ప్రారంభమైన పురాతన గురుద్వారా

490views

పాకిస్థాన్లోని పంజాబ్లో గల 19వ శతాబ్దానికి చెందిన చారిత్రాత్మక గురుద్వారా “చౌవా సాహెబ్” ను శుక్రవారం యాత్రికుల సందర్శనార్ధం తెరిచారు. దేశ విభజన కాలంలో మూయబడ్డ ఈ గురుద్వారా 72 సంవత్సరాల తర్వాత తెరుచుకుంది.

పాకిస్థాన్లోని పంజాబ్ ను జీలం సిటీ దగ్గర గల రొహతాస్ ఫోర్ట్ కు ఉత్తర దిక్కున ఈ గురుద్వారా ఉన్నది. నవంబర్లో సిక్కుల గురువైన గురునానక్ 550 వ జయంతి జరుగనున్న సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది. సిక్కల చక్రవర్తి మహారాజా రంజిత్ సింగ్ ఈ గురుద్వారాను మరియు సరోవరాన్ని 1834 లో నిర్మించారు.

యునెస్కో వారిచే ప్రపంచ చారిత్రక వారసత్వ సంపదగా గుర్తించబడ్డ ఈ కట్టడం పలువురు ప్రముఖులు, మత పెద్దల సమక్షంలో వైభవోపేతంగా పునః ప్రారంభించబడింది.

గురుద్వారాను పునర్నిర్మించటానికి పాక్ ప్రభుత్వం బిలియన్ల కొద్ది ధనాన్ని వెచ్చించనున్నట్లు కాందిశీకుల ఆస్తుల పరిరక్షణ బోర్డు ( ETBP) సెక్రెటరీ ఇమ్రాన్ గొండల్ చెప్పినట్లుగా “ఎక్ష్ప్రెస్ ట్రిబ్యూన్” పత్రిక ఓ కథనంలో వెల్లడించింది.

ఈ మధ్యనే సియాల్ కోట్ కు తూర్పునగల శతాబ్దాల నాటి షావాలా తేజా సింగ్ దేవాలయాన్ని పూజల నిమిత్తం తెరిచిన సంగతి తెలిసిందే. ఈ దేవాలయాన్ని కూడా ఈ మధ్యనే స్థానిక హిందువుల కోరిక మేరకు 72 సంవత్సరాల తర్వాత తెరిచారు.