
ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి తుపాకుల మోత మోగింది. రాజ్‌నంద్‌గావ్ జిల్లా సీతాగోటా అటవీప్రాంతంలో భద్రతా బలగాలు, నక్సలైట్లకు మధ్య శనివారం ఉదయం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఏడుగురు నక్సల్స్ హతమయ్యారు. నక్సల్స్ నిరోధక చర్యల్లో భాగంగా డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్(డీర్‌జీ) ప్రత్యేక దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో దుండగులు భద్రతా సిబ్బందిపైకి కాల్పులు జరపడంతో.. ఎదురుకాల్పులు ప్రారంభించారు. దీంతో ఏడుగురు నక్సల్స్ అక్కడికక్కడే హతమయ్యారు. ఘటనా స్థలిలో భారీగా పేలుడు సామగ్రి, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం డీఆర్‌జీ దళం, నక్సల్స్ మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్లు సమాచారం.
గత నెల 27న ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్) సిబ్బంది, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు నక్సల్స్ మృతి చెందిన విషయం తెలిసిందే. అలాగే 29న జరిగిన కాల్పుల్లో మహిళా నక్సలైట్ సహా ఇద్దరు హతమయ్యారు.





