ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రసామాన్య, అసామాన్యులు – 47 ; గుండ్లపల్లి ఆదినారాయణ పంతులు

368views

స్వాతంత్ర పోరాటంలో ఒంగోలు తాలూకా ముందు నిలిచింది. ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఎందరో మహానుభావులు త్యాగాలు చేశారు. వారిలో గుండ్లపల్లి ఆదినారాయణ గారు ప్రథములు. సుశిక్షితుడైన సేనానిగా స్వాతంత్ర సమరంలోకి ఉరికారు. కారాగార శిక్షను భావించారు. పెద్దగా విద్యాభ్యాసం లేకున్నా ఎంతో ఉన్నతమైన సంస్కారం గల వ్యక్తి, విశాల హృదయం, ఆయనను ప్రముఖులలో అగ్రస్థానం లభింపచేసింది. వీరికి పదవీ వ్యామోహం లేదు. ఏదైనా స్వయంకృషితో సాధించాలన్న పట్టుదల కలవాడు.

ప్రకాశం జిల్లా కీర్తిపాడు గ్రామంలో జన్మించిన గుండ్లపల్లి ఆదినారాయణ గారు, కొలచనకోట గ్రామంలో పెరిగారు. తదుపరి ఒంగోలులో స్థిరపడ్డారు. 1942 ఉద్యమంలో అత్యంత కీలకపాత్ర వహించి, బళ్ళారి జైలులో వెనిగళ్ళ సత్యనారాయణ గారి పరిచయంతో, స్నేహాన్ని పెనవేసుకుని ఎన్నో కార్యక్రమాలు వారితో కలిసి పాలుపంచుకున్నారు. వారిలో డా॥టి.వి.ఎస్. చలపతిరావు, ఎం.ఎల్.ఎ, చెర్వు సుబ్రహ్మణ్యశాస్త్రి, ఒంగోలు, కల్లూరి చంద్రమౌళి, మేడూరి నాగేశ్వరావు, ఎం.పి., శ్రీ ఆకుల బుల్లిస్వామి గారు, యీదరాడ (తూ.గో.) శ్రీ శరణు రామస్వామి చౌదరిగారు, కూచిపూడి(తెనాలి) రామచంద్రుని వెంకటప్ప గారు ఇలా ఎందరో రాజకీయనాయకులు వీరి షష్ట్యబ్ది సంచికలో ఆదినారాయణ గారి జీవితంలో జరిగిన సంఘటనలను నెమరువేసుకున్నారు.

శ్రీ శరణు రామస్వామి చౌదరి గారు, ఆదినారాయణ గారితో కలిసి కాంగ్రెస్ ఉద్యమంలో చేరిననాటినుండి శ్రీ ధారా గోపాలశాస్త్రి గారి నాయకత్వంలో ఒంగోలు తాలూకాలోని గ్రామసీమల్లో పర్యటించి, 1930 సంవత్సరము దేవరంపాడు ఉప్పు సత్యాగ్రహములో కీ॥శే॥ శ్రీ సాగి విజయరామరాజు గారితో కలిసి పనిచేసారు.1932 సత్యాగ్రహోద్యమము, 1940లో వ్యక్తి సత్యాగ్రహము, 1942 క్విట్ ఇండియా ఉద్యమాలలో పాల్గొని అనేక సంవత్సరములు కారాగారములలో మ్రగ్గి, బయటకు వచ్చిన తదుపరి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ సభ్యులుగాను, కాంగ్రెస్ కార్యనిర్వహణమునకు కృషిచేసిన దేశసేవా ధురంధరులు గుండ్లపల్లి వారు.

శ్రీ ఆదినారాయణ గారు బళ్ళారి జైలులో 1942వ సం|| వున్నప్పుడు, రాజకీయ సిద్ధాంతాలపైన, కార్యక్రమాలపైన వివిధ గ్రూపులమధ్య అనేక వాదోపవాదాలు, చర్చలు, సంఘర్షణలు జైలులో అనేకం జరుగుతుండేవి. గాంధీవాదాన్ని నిరసిస్తూ సుభాష్ చంద్రబోస్ తీవ్రవాదానికి జేజేలు కొడుతున్నవారు ఉన్నారు. గాంధీజీ పెట్టుబడిదారుల ప్రతినిధియని, ఆయన మితవాదధోరణులను విశదపరిచి, సంపూర్ణ స్వాతంత్య్రం గాంధీ మార్గం ద్వారా రాదన్న భావనతో పనిచేస్తున్న కిసాన్ గ్రూప్ వారు కూడా, ప్రగాఢ విశ్వాసం గాంధీజీయేనన్న ఆదినారాయణ గారి, గాంధీ బాటలోనే చివరిదాకా నడిచారు. సిద్ధాంత భేదాలతో వున్నా ఆదినారాయణ గారి అనుబంధం స్నేహం స్వాతంత్య్రం సిద్ధించాలన్న కోర్కె వీరిలోఏమాతం సడలేది కాదు.

గాంధీజీ సహాయనిరాకరణ శంఖారావం పూరించేనాటికి ఆదినారాయణ గారి వయస్సు పదేండ్లు. ఊహ తెలిసే నాటికి రాజకీయాలు మళ్ళీ విజృంభించి ఉప్పు సత్యాగ్రహం ప్రారంభించే నాటికి ఆదినారాయణ గారి యువరక్తం ఉరకలు వేసింది. అఖిల భారత కాంగ్రెస్ మహాసభ 1932లో ఢిల్లీలో జరిగింది. ఆ సభ తీర్మానం ఆజ్ఞానుసారం, రాష్ట్ర మహాసభలు, జిల్లా మహాసభలు, తాలూకా మహాసభలు జరిగాయి. పోలీసులు సభలు జరగకుండా నిరోధించారు. గుంటూరులో రాష్ట్ర మహాసభలు స్వర్గీయ వేదాంతం కమలాదేవి అధ్యక్షతన జరిగాయి. ఆదినారాయణ 19 గారు కూడా అరెష్టయి గుంటూరు సబ్ జైలులో ఒక పక్షం రోజులుండి విడుదలయ్యారు. భార్య కామేశ్వరమ్మ విజయ తిలకందిద్ది పూలమాల వేసి భర్తను జైలుకు పంపిన సాధ్వి. ఆదినారాయణ గారి జీవితమంతా స్వతంత్య్ర సమరం, స్వాతంత్య్రం వచ్చాక కూడా గ్రామాల అభివృద్ధికి, రైతుల ఉన్నతికి పాటుపడ్డారు. గుంటూరు జిల్లా పొగాకు ఉత్పత్తిదార్ల మరియు క్యూరర్ల సహకార సంఘం లిమిటెడ్, ఒంగోలు దీని విషయమై ఆదినారాయణ గారి కృషి అమోఘము. 1947లో పొగాకు క్యూరు చేయుటకు రాక్షసిబొగ్గు వాడేవారు. రైతులకు అది సక్రమంగా చేరేది కాదు. రైతులకు సకాలంలో రాక్షసిబొగ్గు అందచేయటానికి, అలాగే నిత్యావసరాలు. పురుగుమందులు సప్లై చేయుటకు సంస్థను స్థాపించారు. రైతుల పక్షాన నిలచి పోరాడారు. ఆదినారాయణ గారి ఆధ్యాత్మిక చింతనయే వారి జీవన సాఫల్యము.