News

సింహగిరిపై ఆధ్యాత్మిక కాంతులు

405views

సింహాచలం బుధవారం సుదర్శన నారసింహ మహాయజ్ఞం శోభను సంతరించుకుంది. ఎటు చూసినా యజ్ఞకాంతులతో ప్రజ్వరిల్లింది. లోకకల్యాణార్థం ఏప్రిల్‌ 1వ తేదీ వరకు జరగనున్న సుదర్శన నారసింహ మహాయజ్ఞంను పాంచరాత్ర ఆగమశాస్త్రాన్ని అనుసరించి దేవస్థానం అర్చకులు శాస్త్రోక్తంగా ప్రారంభించారు. ఉదయం 6 గంటల నుంచి యజ్ఞఘట్టాలను నిర్వహించారు. స్వామి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను ఓ పల్లకీలో, చక్రపెరుమాళ్‌ను ఓ పల్లకీలో అధిష్టింపజేసి ఆలయ ఉత్తర రాజగోపురం ఎదురుగా ఏర్పాటు చేసిన యాగశాలలోకి తిరువీధిగా తీసుకొచ్చారు. యజ్ఞశాలలో చక్రపెరుమాళ్‌ను, మరొక వేదికపై స్వామి ఉత్సవమూర్తులను అధిష్టింపజేశారు. యాగశాల మూర్తి ఆరాధన, శాంతిపాఠం, గోపూజ నిర్వహించారు. ప్రకృతి సిద్ధంగా అగ్ని మధనం చేశారు. అనంతరం అగ్నిప్రతిష్టాపనం, కుంభావాహనం, మండలావాహనం, ధ్వజావరోహణం చేపట్టారు. తదుపరి యజ్ఞశాలలో ఏర్పాటు చేసిన ఐదు హోమ గుండాల వద్ద రుత్వికులు యజ్ఞాన్ని ప్రారంభించారు. మధ్యాహ్నం 12గంటల సమయంలో పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. పూర్ణాహుతి ప్రసాదాన్ని యజ్ఞంలో పాల్గొన్న ఉభయదాతలు, భక్తులకు అందజేశారు.

అనంతరం ఉత్సవమూర్తుల చెంతన రామాయణం, భాగవతం, విష్ణుపురాణం, నృసింహ సహస్రనామం, దివ్యప్రభంద పారాయణం, క్షేత్ర మహత్యం, సుదర్శన శతకం పారాయణాలను వైదికులు పఠించారు. విశేషంగా హారతులు అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా, తమిళనాడు నుంచి వచ్చిన సుమారు 60 మంది రుత్వికులు యజ్ఞం నిర్వహించారు. విశాఖ శ్రీ శారదాపీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి, స్వాత్మానందేంద్ర సరస్వతి పుర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. యజ్ఞంలో పాల్గొన్న ఉభయదాతలకు దేవస్థానం తరఫున శాలువ, రవిక, కల్యాణం లడ్డూ, అర కిలో పులిహోర ప్రసాదం, అప్పన్న స్వామి రాగి ప్రతిమ అందజేశారు. ప్రిలిగ్రిమ్స్‌ సెంటర్‌లో ప్రత్యేకంగా భోజన సదుపాయం అందజేశారు. దేవస్థానం ఈవో ఎస్‌.శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో అధికారులు ఏర్పాట్లు చేశారు. దేవస్థానం వంశపార ధర్మకర్త పూసపాటి అశోక్‌గజపతి రాజు, ట్రస్ట్‌బోర్డు సభ్యులు గంట్ల శ్రీనుబాబు, సంపంగి శ్రీనివాసరావు, వారణాసి దినేష్‌రాజ్‌ తదితరులు పాల్గొన్నారు. దేవస్థానం స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్‌, ప్రధానార్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, ఇరగవరపు రమణాచార్యులు, పురోహిత్‌ అలంకారి కరి సీతారామాచార్యులు, అర్చకులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

అప్పన్నకు శారదాపీఠాధిపతులు పూజలు
సుదర్శన నారసింహ మహా యజ్ఞంలో పాల్గొనేందుకు వచ్చిన శారదాపీఠాధితులు స్వరూపానందేంద్ర సరస్వతి, స్వాత్మానందేంద్ర సరస్వతి శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి మూలవిరాట్‌ను దర్శించుకున్నారు. ఆలయ ధ్వజస్తంభం వద్ద వారికి దేవస్థానం అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామీజీల పేరిట అంతరాలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోదాదేవి సన్నిధిలో కుంకుమార్చన చేసి, వేద ఆశీర్వచనం అందజేశారు. దేవస్థానం తరఫున ఈవో శ్రీనివాసమూర్తి స్వామీజీలకు శేషవస్త్రాలు, ప్రసాదాన్ని అందించారు.