News

కాకినాడ తీరంలో రక్షణ దళాల సంయుక్త విన్యాసాలు

54views

సముద్ర మార్గం నుంచి భారత భూభాగంలోకి చొచ్చుకు వచ్చే శత్రు సైన్యం, ఉగ్రవాదులను కట్టడి చేసే లక్ష్యంగా మనదేశ రక్షణ దళాలు, అమెరికా రక్షణ దళాల సంయుక్త విన్యాసాలు కాకినాడ తీరంలో శత్రువులకు దడ పుట్టించేలా కొనసాగుతున్నాయి. టైగర్‌ ట్రాయంఫ్‌ – 2024 విన్యాసాల పేరిట విశాఖపట్నంలో ఈ నెల 18న ఇరుదేశాల విన్యాసాలు ప్రారంభమయ్యాయి. దీనికి కొనసాగింపుగా కాకినాడ సీ ఫేజ్‌లో విన్యాసాలు నిర్వహిస్తున్నారు.

రెండు దేశాల రక్షణ దళాల సామర్థ్యాలను మెరుగుపరిచే విధంగా సాగుతున్న విన్యాసాలతో కాకినాడ సాగర తీరం కదన రంగాన్ని తలపింపజేస్తోంది. గాల్లో పెద్ద శబ్దాలు చేస్తూ జెట్‌ యుద్ధ విమానాలు, తీరం వద్ద హెలికాఫ్టర్‌ చక్కర్లు, ఒడ్డును యుద్ధ ట్యాంకులు, సాగర జలాల్లో యుద్ధ నౌకలు, అత్యాధునిక ఆయుధాలతో భారత సైన్యంలో నేవీ, ఎయిర్‌ ఫోర్స్‌, ఆర్మీ దళాల నుంచి సుమారు 700 మంది మోహరించడంతో కాకినాడ తీరం యుద్ధ క్షేత్రాన్ని తలపింజేస్తుంది. కాకినాడ రూరల్‌ సూర్యారావుపేట నేవెల్‌ ఎన్‌క్లేవ్‌ పరిధిలో ఓల్ట్‌ ఎన్టీఆర్‌ బీచ్‌ వద్ద భారత్‌ త్రివిధ దళాలు ఉభయ చర సామర్థ్యం ప్రదర్శిస్తున్నాయి. సముద్ర తీరంలో యుద్ధ నౌకలపై విన్యాసాలతో పాటు ఒడ్డున చేపడుతున్నారు.

బహుళ డ్రోన్‌లు, యాంటీ డ్రోన్‌ పరికరాలు, పదాతిదళం, మెకనైజ్డ్‌ పదాతి దళం, పారా ఎస్‌ఎఫ్‌, ఆర్టిలరీ, ఇంజనీర్లు, ఇతర సహాయక ఆయుధాలతో ఆర్మీ బృందం ప్రాతినిధ్యం వహిస్తుండగా, నేవీ అత్యాధునిక యుద్ధ నౌకలను రంగంలోకి దించింది. భారత్‌, అమెరికా దేశాలు సిబ్బంది పరస్పర అవగాహన, సహకారం పెంపొందించుకునేలా ఒకరి నౌకలను మరొకరు సందర్శించుకుంటూ స్నేహపూర్వకంగా విన్యాసాలు చేపడుతున్నాయి. విన్యాసాలలో ప్రధానంగా సముద్ర దశ, ఒక అనుకరణ ద్వీప దేశానికి వ్యూహాత్మక తరలింపు, షిప్‌ టు షోర్‌ తరలింపు, ఉభయ చర కార్యకలాపాలతో నైపుణ్యం ప్రదర్శించడం విన్యాసాలలో ముఖ్య భాగం. బుధవారం ఉదయం నేవీ యుద్ధ విమానం కాకినాడ నగరం, రూరల్‌ గ్రామాల పరిధిలో చక్కర్లు కొట్టింది. సైనిక సిబ్బంది ఏరియల్‌ వ్యూ నిర్వహించారు.

విమానం నుంచి పెద్ద శబ్ధం వినిపించడంతో చూసేందుకు జనాలు ఇండ్లలో నుంచి బయటకువచ్చారు. మధ్యాహ్నం సూర్యారావుపేట బీచ్‌లో విశాఖపట్నం నుంచి అమెరికా రక్షణ దళ అధికారులతో కూడిన హెలికాఫ్టరు చక్కర్లు కొట్టింది. ఉదయం, సాయంత్రం విన్యాసాలు చేపట్టారు. అయితే విన్యాసాలు చూసేందుకు ఉత్సాహంగా వస్తున్న ప్రజలకు నిరాశే ఎదురయ్యింది. మీడియా, పబ్లిక్‌ను కూడా విన్యాసాల వద్దకు అనుమతించలేదు. బీచ్‌ రోడ్డును మూసి వేసి పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఈ నెల 30వ తేదీ వరకు భారత్‌, అమెరికా సంయుక్త విన్యాసాలు కొనసాగుతాయని నేవీ అధికారులు తెలియజేశారు.