
జ్ఞానానికి ఆధ్యాత్మికతే శరణ్యమని విశాఖపట్నం జిల్లా పెందుర్తికి చెందిన శివానందాశ్రమ పీఠాధిపతి స్వామి విష్ణుదేవానంద సరస్వతి అన్నారు. ఈ మేరకు సోమవారం పార్వతీపురం మన్యంజిల్లాలోని రేగిడి గ్రామంలో వెలసిన దత్తపీఠంలో హోలీ పౌర్ణమి సందర్భంగా ఆధ్యాత్మిక గురువు కిమిడి సత్యనారాయణనాయుడు ఆధ్వర్యంలో దత్తజ్ఞాన బోధ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా జ్ఞానాన్ని పొందే మార్గాలను భక్తులకు ఆయన వివరించారు. కాలం మారినప్పటికీ మారని ఒకే ఒక జ్ఞానమార్గం దైవ చింతేనని తెలిపారు. సనాతన ధర్మాలన్నీ సైన్స్ కంటే ముందుగానే విపత్తును కనిపెట్టి, వాటిని అదుపుచేసే మార్గాలను కూడా సూచించాయని తెలిపారు. ప్రజలు ఎప్పుడైతే ఈ నిజాలు తెలుసుకుంటారో అప్పుడే జ్ఞానమార్గాన్ని, మోక్ష మార్గాన్ని పొందుతారని, శాంతిని పొందగలరని వెల్లడించారు. కార్యక్రమంలో దత్తపీఠ కన్వీనర్ రుంకు శ్రీనివాసరావు మాస్టారు, యర్రాపాత్రుని భాస్కరరావు, కుడుతుల మురళి, జల్లు శివ తదితరులు పాల్గొన్నారు.





