News

ఐసిస్ లో చేరిన కేరళ యువకుడు అమెరికా డ్రోన్ దాడిలో మృతి.

712views

మాయలో పడ్డాడు – పాడెక్కాడు

కేరళకు చెందిన కొందరు యువకులు ఐసిస్ లో జాయిన్ అయిన సంగతి తెలిసిందే. వారిలో ఓ వ్యక్తి అమెరికా చేసిన డ్రోన్ దాడులలో మరణించాడు. కేరళ లోని మలప్పురం జిల్లా ఎడప్పల్ కు చెందిన మొహమ్మద్ ముహాసిన్ ఐసిస్ కు ఆకర్షితుడై 2017 లో జాయిన్ అయ్యాడు. అప్పటి నుండి ఐసిస్ లో ఉంటూ ఒక చోటు నుండి మరొక చోటుకి ప్రాంతాలను మారుస్తూ ఉన్నాడు. ముహాసిన్ ఐసిస్ కీలక నాయకుడైన హుజైఫా-అల్-బకిస్తానీ బృందంతో కలిసి ఉన్నాడు. ఆఫ్ఘానిస్తాన్ లోని ఖోరోసన్ ప్రాంతంపై జులై 18న అమెరికా డ్రోన్ దాడులు చేసింది. ఈ దాడుల్లో హుజైఫా-అల్-బకిస్తానీతో పాటూ ముహాసిన్ కూడా మరణించినట్లు తెలుస్తోంది.

తీవ్రవాదుల కార్ఖానా 

బకిస్తానీ పాకిస్థాన్ కు చెందిన తీవ్రవాది.. ఎంతో మంది భారత యువతను తన ప్రసంగాలతో ఐసిస్ కు ఆకర్షితుల్ని చేశాడు. ముహాసిన్ చనిపోయాడన్న విషయం అతడి కుటుంబ సభ్యులకు ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన ఓ నంబర్ నుండి అందింది. మీ బిడ్డ పది రోజుల క్రితం అమెరికా చేసిన దాడులలో అమరుడయ్యాడని మలయాళంలో  మెసేజ్ పంపారు. “ఈ విషయాన్ని పోలీసులకు కూడా చెప్పకండి. ఒకవేళ ఈ విషయం తెలిస్తే వారు మిమ్మల్ని ఇబ్బంది పెడతారు.” అని ఆ మెసేజ్ లో ఉంది. గత కొన్నేళ్లుగా కేరళకు చెందిన యువత ఐసిస్ లో పెద్ద ఎత్తున చేరుతోంది. ఈ ఏడాది జూన్ 15న కన్నూర్ లో 40మంది ఐసిస్ లో చేరారు.. అందులో 8 మంది మహిళలు కూడా ఉన్నారు. గత కొన్నేళ్లలో కేరళ నుండి 98 మంది ఐసిస్ లో జాయిన్ అయ్యారు. వారిలో 38 మంది చనిపోగా. 60మంది ఇంకా ఐసిస్ లోనే ఉన్నారు. కేరళలోని పలు ప్రాంతాల్లో ఐసిస్ సానుభూతిపరులు ఉన్నారు. సోషల్ మీడియా ద్వారా యువతకు మాయమాటలు చెప్పి వాళ్ళను తమ వైపు తిప్పుకుంటున్నారు.