
ప్రకాశం జిల్లాలో ప్రసిద్ధి చెందిన శింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ్లకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి సోమవారం వార్షిక తిరునాళ్ల ప్రధాన ఘట్టం జరగనుంది. ఉదయం ఐదు గంటల నుంచి మంగళవారం ఉదయం వరకు నిరాటంకంగా భక్తు లకు స్వామి వారి దర్శనం ఉంటుంది. ఇతర జిల్లాల నుంచి భక్తులు తరలిరానున్నారు. తిరునా ళ్లకు చేరుకునే భక్తుల సదుపాయం కోసం ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యేక బస్సులను సిద్ధం చేసింది. అద్దంకి, ఒంగోలు, చీరాల, వినుకొండ, నరసరావు పేట, పొదిలి ఆర్టీసీ డిపోల నుంచి ప్రత్యేక బస్సు లను శింగరకొండకు నడపనున్నారు. అద్దంకి డిపో నుంచి 30 బస్సుల్ని మేదరమెట్ల, బల్లికురవ,మార్టూరు, కొమ్మాలపాడు, ముండ్లమూరు, తాళ్లూరు నుంచి నడపనున్నారు. గ్రామీణ ప్రాంతంలో తిరిగే సర్వీసులు రాత్రి సమయాల్లో నేరుగా తిరునాళ్లకు నడుపుతామని ఆర్టీసీ డీఎం రామ్మోహనరావు చెప్పారు. గోపాలపురం ఎస్టీ కాలనీ సమీపంలో, చక్రాయపాలెం మలుపు వద్ద తాత్కాలిక ఆర్టీసీ బస్టాండ్లు ఏర్పాటు చేశారు. తిరునాళ్లకు వచ్చే భక్తు లకు వివిధ సామాజిక సత్రాల వద్ద ఉచిత భోజన సదుపాయాలు కల్పించనున్నారు. భారీస్థాయిలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.





