
( మార్చి 25 – శ్రీ చైతన్య మహా ప్రభువు జయంతి )
5 వేల సంవత్సరాల క్రితం మతం తన ప్రాభవాన్ని కోల్పోతున్న తరుణంలో శ్రీకృష్ణుడు భూమిపై దర్శనం ఇచ్చాడు. భౌతిక అస్తిత్వ బారి నుండి విముక్తి పొంది, తన శాశ్వతమైన ఆనందమయ నివాసానికి చేరుకోవాలని భగవద్గీత రూపంలో శ్రీకృష్ణుడు తన సందేశాన్ని అందించారు. ఈ శరణాగతి సందేశాన్ని అర్థం చేసుకోవడానికి మరియు అమలు చేయడానికి ఈ కలియుగంలో శ్రీకృష్ణుడు తిరిగి జన్మించాడు. ఆ అవతారమే చైతన్య మహాప్రభు. దేవదేవుడు అయిన ఆ శ్రీకృష్ణ పరమాత్మకు ఎలా లొంగిపోవాలో ఆచరణాత్మకంగా చైతన్య మహాప్రభు బోధించారు. మరో మాటలో చెప్పాలంటే శ్రీకృష్ణుడు తన స్వంత ప్రదర్శన ద్వారా, చైతన్య రూపంలో తనకు ఎలా లొంగిపోవాలో ప్రజలకు బోధించాడు.
భక్తిమార్గ ప్రబోధకులలో చైతన్య ప్రభువులు అగ్రగణ్యులు. వైష్ణవ గురువులలో ఒకరు. ఈయన గౌరీవర్ణ శరీరులు కావడంతో గౌరాంగ మహా ప్రభువుగా లోక ప్రసిద్ధులయ్యారు. శ్రీ చైతన్య మహాప్రభు శతాబ్ది 1407, ఫాల్గుణ మాసం ఇరవై మూడవ రోజు పశ్చిమ బెంగాల్ నదియా జిల్లాలోని మాయాపూర్ అనే గ్రామంలో జగన్నాథ మిశ్రా, శచీదేవి దంపతులకు జన్మించారు. ఆయన అసలు పేరు విశ్వంభరుడు. చిన్నతనంలోనే శాస్త్రాలు, పురాణాలలో పాండిత్యం సంపాదించారు. కేశవభారతి స్వామి అనే ఆచార్యుని వద్ద సన్యాస దీక్షను పొంది భక్తిభావంతో రాధాకృష్ణుల ప్రేమతత్వాన్ని ప్రబోధించేందుకు తన జీవితాన్ని అంకితం చేసిన చేసిన చైతన్యప్రభు జయంతిని ఈ ఏడాది మార్చ్ 25న జరుపుకుంటున్నాము.
చైతన్య మహాప్రభు కృష్ణ తత్వాన్ని కీర్తిస్తూ దేశాటనం చేశారు. ఆయనది మధురమైన భక్తి మార్గం. కృష్ణుడిని పూజించడం, గురువును సేవించడం ద్వారా మాయా మోహముల నుండి జీవుడు విముక్తుడై కృష్ణపదసాన్నిధ్యం చేరుకుంటాడని ప్రబోధించారు. దశమూల శ్లోకం అనే గ్రంధంలో చైతన్యుడు పరమేశ్వర ప్రేమ తత్వాన్ని వివరించాడు. ప్రస్థానత్రయానికి భాగవతమే భాష్య గ్రంథమని వెలుగెత్తి చాటారు. నిత్యానంద ప్రభు, రూపగోస్వామి, సనాతన గోస్వామి, అద్వైతాచార్య, రాయ రామనంద, రఘునాథ భట్టు మొదలగు ప్రముఖులందరూ ఆయన అనుయాయులే. ఉత్కళను పరిపాలించిన ప్రతాపరుద్ర గజపతి సైతం చైతన్య ప్రభు శిష్యుడే.
కృష్ణ భగవానుని నామం, లీలలు, ప్రేమల ప్రచారం ద్వారా ప్రజల్లో కృష్ణ భక్తిని పెంపొందించేందుకు కృష్ణ చైతన్యోద్యమాన్ని ఆయన ప్రారంభించారు. మానవ సమాజాన్ని ఆధ్యాత్మికవనంలో జీవితమనే పుష్పాలను పరమాత్మ పూజకు అంకితం ఇవ్వడమే ఈ ఉద్యమ లక్ష్యం. మనం సాధారణంగా చెప్పుకునే హరే కృష్ణ హరే కృష్ణ..కృష్ణ కృష్ణ హరే హరే. హరే రామ హరే రామ..రామ రామ హరే హరే..ఈ 32 అక్షరాల మంత్రాన్ని మనకు అందించిన మహనీయుడు శ్రీ చైతన్య మహాప్రభు. భక్తి ఉద్యమ స్థాపకులుగా, సంకీర్తన ఉద్యమానికి ఆద్యులుగా శ్రీకృష్ణుణ్ణి ప్రేమించడమే మనందరి పరమ లక్ష్యం కావాలని ప్రబోధించిన చైతన్య మహాప్రభు తన 48వ ఏట జూన్ 14వ తేదీన పూరీలోని జగన్నాథుడిలో ఐక్యం అయ్యారు. భక్తి మార్గంలో నడిచి జీవితాన్ని సార్థకం చేసుకోవడమే మనం ఆయనకు ఇచ్చే గొప్ప నివాళి.





