
పాకిస్థాన్లోని సియాల్‌కోట్‌లో వెయ్యేళ్ళ చరిత్ర కలిగిన ఓ హిందూ ఆలయాన్ని మళ్లీ తెరుస్తూ పాకిస్థాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 72 ఏళ్ల క్రితం మూసివేసిన ఈ ఆలయాన్ని మళ్లీ భక్తుల సందర్శనార్థం అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. సర్దార్ తేజా సింగ్ నిర్మించిన షావాలా తేజా సింగ్ ఆలయం భారత్, పాక్ విభజన సమయంలో మూతపడింది. అయితే భారత్‌లోని బాబ్రీ మసీదు కూల్చివేతకు నిరసిస్తూ 1992లో ఓ గుంపు ఈ ఆలయాన్ని ధ్వంసం చేయడంతో హిందువులు ఇక్కడికి రావడం మానేశారు. తాజాగా పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఆదేశాల మేరకు ఆలయాన్ని తెరవాలని నిర్ణయించినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. ‘ప్రజలు స్వేచ్ఛగా ఎప్పుడైనా దర్శించుకోవచ్చు’. అని డిప్యూటీ కమిషనర్ బిలాల్ హైదర్ పేర్కొన్నారు. కాగా ఈ ఆలయ పునరుద్ధణ, పరిరక్షణ పనులను కూడా త్వరలోనే ప్రారంభించనున్నట్టు పాక్ ప్రభుత్వం వెల్లడించింది.







