
మన దేశంలో సింధు నాగరికతకు చెందిన అతి పురాతన అవశేషాలన్నీ దేశ విభజనలో పాకిస్తాన్ కి సంక్రమించాయి. దానితో సింధు నాగరికతను పరిశీలించే మన చరిత్ర పరిశోధకులకు అవరోధం ఏర్పడింది. అటువంటి పరిస్థితిలో మన పరిశోధనలకు నూతనాధ్యాయాన్ని రూపొందిచారు శ్రీ ఎన్.ఆర్. రావు. ఆయన 1954లో సింధు నాగరికతకు చెందిన ‘లోధల్’ ఓడరేవును కనుగొన్నారు. దీనితో సింధు సంస్కృతికి సంబంధించిన ఎంతో విలువైన సమాచారం మనకు లభించింది. ఆయన అన్వేషణ అంతటితో ఆగిపోలేదు.
ప్రపంచ వ్యాప్తంగా ఎందరో పరిశోధకులు, భాషావేత్తలు ఎన్నో రకాలుగా ప్రయత్నించి విఫలమైన సింధు లిపిని చదివి అందరిచే ‘శభాష్’ అనిపించుకున్న మేధావి రావు. ఆయన కృషినీ, ఆసక్తినీ గుర్తించిన మన ప్రభుత్వం ఆయనకు కొత్త బాధ్యత అప్పగించింది. దేశంలోని విలువైన చారిత్రక కట్టడాల పునరుద్ధరణ, పునర్నిర్మాణ కార్యక్రమాలు ఆయన పర్యవేక్షణలో నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా తాజ్ మహాల్ ‘ఆగ్రాకోట’, ఫతేపూర్ సిక్రీ, ఖజురహో, మహాబలిపురం, అజంతాపూర్, తిరుచూర్లోని దేవాలయాలు ఇంకా ఎన్నో కొత్తవి రూపు దిద్దుకుంటున్నాయి రావు అధ్వర్యములో.
ప్రస్తుతం రావుగారు తలపెట్టిన కొత్త పథకం లక్ష్యం ‘ద్వారకానగరం’. మహాభారత కథాసూత్రధారి శ్రీకృష్ణుని పట్టణం. హిందువుల సంస్కృతిలో ఒక భాగమైన శ్రీకృష్ణుడు నివసించిన పుణ్యస్థలం ద్వారకానగరం గురించి తెలియని భారతీయుడు ఉండడు. ద్వారకానగరం ప్రస్తావన మహాభారతం లోనే కాక, చందోగ్యోపనిషత్తు, హరివంశం వంటి గ్రంథాలలో కూడా కనిపిస్తుంది.
శ్రీకృష్ణుడు, గోవులను కాచుకొని జీవించే యాదవులను, అమాయకులైన పల్లీయులను, కరవు కాటకాల ప్రభావంతో వలసవచ్చిన అనాగరికులను చేర్చి వారిని నాగరీకులుగా తీర్చిదిద్ది, వారికి ఉపాధి కల్పించే పథకం రూపొందించే యోజన చేసాడు. ఆ పథకం ఫలితమే ద్వారకా రేవుపట్టణ నిర్మాణం.
ఈ రేవు పట్టణం వలన భారతదేశాన్ని గొప్ప వ్యాపార కేంద్రంగా మలచటమేకాక, శత్రువులకు అభేద్యమైన కోటగా ఉపయోగపడేలా నిర్మితమమైంది ద్వారక.ఇన్ని హంగులు ఉండే స్థలం మహోదధి (అరేబియా సముద్రం) తీరంలోని ఒక చిన్నద్వీపం శ్రీకృష్ణునికి అనువైన స్థలంగా కనిపించింది. ఆ ద్వీపంపై పూర్వం రైవతుడనే రాజు (బలరాముని మామగారు) పాలనలో ‘కౌశస్థలి’ అనే శిథిల నగరం ఉండేది. ఆ నగరానికి మార్పులు, చేర్పులు చేసి ద్వారకగా రూపొందించారు.
భారత కథలో వర్ణితమైన ఈ పట్టణ నిర్మాణం ఏ సంవత్సరాల్లో జరిగిందో మనకు తెలియకపోయినా వైనం మాత్రం భారతంలోని ‘మౌసలవర్వం’లో స్పష్టంగా ఉంది. కురుక్షేత్ర యుద్ధానంతరం శ్రీకృష్ణుడు అవతారం చాలించగానే ఈ ద్వీపం మునిగిపోయిందని, ఈ ప్రళయం గురించి శ్రీకృష్ణుని వంటివారికి ముందుగానే తెలిసినట్లుగా పేర్కొని ఉంది. శ్రీకృష్ణుని ఆదేశం ప్రకారం ద్వారకావాసులను అర్జునుడు నగరం నుంచి ఖాళీ చేయిస్తాడు. ఆ వెంటనే సూర్యోదయం అవుతుండగా ద్వారక మెల్లమెల్లగా సముద్రంలో కలిసిపోతుంది.ద్వారక ఉండేదని ఊహిస్తున్న ప్రాంతంలో ఈ మధ్య జరిపిన పరిశోధనల్లో అక్కడ ఒక గొప్ప రేవుపట్టణం ఉండేదనటానికి దాఖలాలు కనిపించాయి.
ఆ ప్రాంతంలో దొరికిన ఎన్నో వస్తువులు, కట్టడ శిథిలాలు ఎంతో చరిత్రను చెప్పాయి. ఈ వస్తువు ‘రేడియోకార్బన్’ పద్ధతి ద్వారా క్రీ.పూ. 1400 నాటిదని నిర్ణయించారు. అంటే ఈ సాక్ష్యాధారాలను బట్టి ఈ పట్టణం క్రీ.వూ.1400-1500 ప్రాంతాలలో ముంపునకు గురయినట్లు అనుకోవచ్చు. అంతేకాదు. భారతయుద్ధం కూడా అదేకాలంలో జరిగినట్లు స్పష్టమవుతున్నది.ఈ సూత్రం ఆధారంగా జరిపిన పరిశోధనల్లో ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి.
(జాగృతి సౌజన్యంతో)





