
భారత మహిళా బాక్సర్ మేరీకోమ్ మరోమారు సత్తా చాటింది. ఇండోనేషియాలోని లాబన్ బజోలో ఆదివారం జరిగిన 23వ ప్రెసిడెంట్స్ కప్ ఫైనల్‌లో ఘనవిజయం సాధించింది. 51కేజీల విబాగంలో ఒలింపిక్ కాంస్యపతక విజేత, ఆస్ట్రేలియాకు చెందిన ఏప్రిల్ ఫ్రాంక్స్‌ను 5-0తో మట్టికరిపించి స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. ఆరుసార్లు ప్రపంచ చాంపియన్ అయిన 36 ఏళ్ల మేరీకోమ్ 2020లో టోక్యోలో జరగనున్న ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలని గట్టి పట్టుదలగా ఉంది. ఇదిలావుంటే.. ఈ ఏడాది సెప్టెంబరు 7 నుంచి 21 వరకు ప్రపంచ మహిళా బాక్సింగ్ చాంపియన్‌షిప్ పోటీలు జరగనున్నాయి. వరల్డ్ చాంపియన్‌షిప్‌కు ముందు సత్తా చాటడంపై మేరికోమ్ సంతోషం వ్యక్తం చేసింది. ‘ప్రెసిడెంట్స్ కప్ ఇండోనేషియాలో నా దేశానికి.. నాకు స్వర్ణం దక్కింది. గెలవడమంటే ఎంత దూరమైన వెళ్లడానికి, అందరికంటే ఎక్కవ కష్టపడటానికి సిద్ధంగా ఉన్నారని అర్థం. నా కోచ్‌లకు, సహాయక సిబ్బందికి మనస్పూర్తిగా ధన్యవాదాలు అని మేరీకోమ్ పేర్కొంది.





