
తిరుమలలో భక్తులందరూ హిందూ సంప్రదాయాన్ని పాటిస్తూ శ్రీవారిని దర్శించుకోవాలని టిటిడి ప్రకటిస్తోంది.. అయితే టిటిడిలో పారిశుద్ధ్య పనులు నిర్వహించే కంపెనీ మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు వ్యక్తమయ్యాయి. హిందువుల కట్టూబొట్టుపైన నియంత్రణ చేయడం కలకలం సృష్టించింది. కంపెనీ నిబంధనల పేరుతో సంప్రదాయాన్ని కించపరిచేలా వ్యవహరిస్తున్న సదరు కంపెనీపై కార్మికులు, ప్రజాసంఘాలు తీవ్రంగా స్పందించాయి.
తిరుమలలో పీఎన్‌ఎస్ కంపెనీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని ఆందోళన చేసిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. వైకుంఠం క్యూకాంప్లెక్-1, క్యూకాంప్లెక్స్-2, పద్మావతి ఏరియాలో పీఎన్‌ఎస్ కంపెనీ పారిశుద్ధ్య పనుల కాంట్రాక్ట్ నిర్వహిస్తోంది. అయితే కంపెనీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది తమను బొట్టు పెట్టుకోరాదని.. గాజులు, గొలుసులు, చెప్పులు వేసుకోరాదని నియంత్రించడంతోపాటు అవసరమైన సమయంలో కనీసం సెలవులు ఇవ్వకుండా వేధిస్తున్నారని కార్మికులు ఆరోపించారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్ సమీపంలో చేపట్టిన ఈ ఆందోళనలో తమ సమస్యలను టిటిడి ఆరోగ్యశాఖ మేస్త్రీ దృష్టికి తీసుకెళ్లారు. టిటిడి ఆరోగ్యశాఖాధికారిణి డా.శ్రీదేవి చొరవతో సమస్య తాత్కాలికంగా పరిష్కారమైంది.
కార్మికులను వేధిస్తున్న పీఎన్‌ఎస్ కంపెనీపై చర్యలు తీసుకోవాలని సీఐటీయూ నేత సుబ్రమణ్యం ఓప్రకటనలో డిమాండ్ చేశారు. తిరుమలలో పారిశుద్ధ్య పనులు నిర్వహించే పీఎన్‌ఎస్ కంపెనీ నిబంధనలను కార్మికులను పాటించాలని టిటిడి ఆరోగ్యశాఖ అధికారులు సూచించారు. ఇందులో తక్కువ గాజులు వేసుకోవాలని, చిన్నబొట్టు పెట్టుకోవాలి, కాళ్లకు గజ్జలు వేసుకోరాదని వారి నిబంధనలో ఉందని వాటినే అమలుచేస్తున్నారని వెల్లడించారు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే పారిశుద్ధ్య కార్మికులతో చర్చించి సమస్యను పరిష్కరిస్తామన్నారు.





